
అబుదాబి: టీ20 ప్రపంచకప్‌లో భాగంగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న లీగ్ మ్యాచ్‌లో వెస్టిండీస్ స్టార్ ఆల్‌రౌండర్ డ్వేన్ బ్రావోకు పెను ప్రమాదం తప్పింది. అతను గనుక అప్రమత్తంగా లేకుంటే.. మూతి పచ్చడయ్యేది. కెరీర్‌లో తన చివరి మ్యాచ్ ఆడుతున్న బ్రావో.. చాకచక్యంగా తన వైపు దూసుకొచ్చిన బంతి నుంచి తప్పుకున్నాడు. దాంతో మైదానంలోని ఆటగాళ్లంతా ఊపిరి పీల్చుకున్నారు.ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.
అసలేం జరిగిందంటే.. వెస్టిండీస్ ఇన్నింగ్స్ సందర్భంగా మిచెల్ మార్ష్ వేసిన 15వ ఓవర్‌లో అతను వేసిన లెంగ్త్ బాల్‌ను కీరన్ పోలార్డ్ భారీ షాట్ ఆడగా.. బంతి నాన్ స్ట్రైకర్‌గా ఉన్న బ్రావో వైపు దూసుకొచ్చింది. వెంటనే అప్రమత్తమైన బ్రావో చాకచక్యంగా తలను వంచి ప్రమాదాన్ని తప్పుకున్నాడు. ఈ క్రమంలో బ్రావో బ్యాట్ కిందపడిపోయింది. ఆ వెంటనే ఇద్దరు బ్యాట్స్‌మన్ సింగిల్ పూర్తి చేశారు. పొలార్డ్ ఆడిన ఆ పవర్ ఫుల్ షాట్ బ్రావోకు తాకి ఉంటే తీవ్ర గాయమయ్యేది. అదే జరిగితే అతని కెరీర్ చివరి మ్యాచ్ ఓ చేదు జ్ఞాపకంగా మిగిలిపోయేది.
ఇక ఈ మ్యాచ్‌కు ముందే డ్వేన్ బ్రావో అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలుకుతున్నట్లు ప్రకటించాడు. ఆసీస్‌తో ఆడే మ్యాచే తన కెరీర్‌లో చివరిదని పేర్కొన్నాడు. 'సమయం ఆసన్నమైందని అనిపిస్తోంది. వెస్టిండీస్‌కు 18 ఏళ్ల పాటు ప్రాతినిథ్యం వహించాను. ఈ సుదీర్ఘ ప్రయాణంలో ఎన్నో ఎత్తుపళ్లాలు చూశాను. అయితే, వెనక్కి తిరిగి చూసుకుంటే నా కెరీర్‌లో ఎన్నో విజయాలు సాధించాను. కరేబియన్ ప్రజల తరఫున అంతర్జాతీయ స్థాయిలో ప్రాతినిథ్యం వహించడం పట్ల కృతజ్ఞతాభావంతో నా మనసు నిండిపోయింది. మూడు ఐసీసీ ట్రోఫీలు గెలిచిన విండీస్ జట్టులో సభ్యుడిని కావడం సంతోషకరం. ఈ ప్రపంచకప్‌లో తమ జట్టు వైఫల్యాలకు తలదించుకోవాల్సిన అవసరం లేదు. ఈ టోర్నీలో మేం ఇలా విఫలమవుతాం అనుకోలేదు. టోర్నీలో టఫ్ కాంపిటేషన్ ఉంది.'అని ఐసీసీ పోస్ట్ మ్యాచ్ షోలో బ్రావో వ్యాఖ్యానించాడు.
2004లో అంతర్జాతీయ క్రికెట్‌లో అడుగుపెట్టిన బ్రావో... వెస్టిండీస్ తరఫున ఇప్పటి వరకు మొత్తంగా అన్ని ఫార్మాట్లు కలిపి 293 మ్యాచ్‌లు ఆడాడు. ఇక 2006లో న్యూజిలాండ్‌తో మ్యాచ్‌తో పొట్టి ఫార్మాట్‌లో అరంగేట్రం చేసిన బ్రావో.. ఇప్పటివరకు 90 టీ20 మ్యాచ్‌లు ఆడి 1000 పరుగులతో పాటు 78 వికెట్లు పడగొట్టాడు. 2012, 2016 టీ20 ప్రపంచకప్ గెలిచిన వెస్టిండీస్ జట్టులో అతను కీలక ఆటగాడు. ముఖ్యంగా 2012 టోర్నీలో విన్నింగ్ క్యాచ్ అందుకుని జట్టును విజయతీరాలకు చేర్చిన తీరును ఎవరూ మర్చిపోలేరు.
ఆసీస్‌తో మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన విండీస్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లకు 157 రన్స్ చేసింది. కెప్టెన్ కీరన్ పొలార్డ్(44), ఆండ్రీ రస్సెల్(18 నాటౌట్), ఎవిన్ లూయిస్(29) రాణించారు. డ్వేన్ బ్రావో(10) మాత్రం బ్యాటింగ్‌లో ఆకట్టుకోలేకపోయాడు. ఇక ఇదే మ్యాచ్‌తో యూనివర్స్ బాస్ క్రిస్ గేల్ సైతం ఆటకు అల్విదా ప్రకటించినట్లు తెలుస్తోంది.