T20 World Cup 2021: బ్రాడ్ హగ్ టీమిండియా ఎలెవన్.. శ్రేయస్, ధావన్, షమీలకు నో చాన్స్!

సిడ్నీ: కరోనా కారణంగా భారత్ వేదికగా జరగాల్సిన టీ20 ప్రపంచకప్ యూఏఈకి తరలిన విషయం తెలిసిందే. భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ)నే ఈ మెగా టోర్నీని నిర్వహించనుంది. ఇప్పటికే ఈ విషయాన్ని అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్(ఐసీసీ) కూడా ధృవీకరించింది. అక్టోబర్ 17 నుంచి నవంబర్ 14 వరకు పొట్టి ప్రపంచ కప్ నిర్వహించనున్నట్లు వెల్లడించింది. ఈ మెగా టోర్నీకి ఇంకా 4 నెలల సమయం ఉన్నా.. అప్పుడే భారత తుది జట్టు ఎంపికపై అంచనాలు మొదలయ్యాయి.
టీమిండియా మాజీ ఓపెనర్, కామెంటేటర్ ఆకాశ్ చోప్రా.. మెగా టోర్నీలో రోహిత్ శర్మతో కలిసి కేఎల్ రాహుల్ ఓపెనింగ్ చేసే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయని చెబితే.. బ్రాడ్ హగ్ మాత్రం కెప్టెన్ విరాట్ కోహ్లీ, హిట్ మ్యాన్ ఇన్నింగ్స్ ప్రారంభిస్తారని తెలిపాడు. టీ20 ప్రపంచకప్ బరిలో దిగే భారత తుది జట్టును తన యూట్యూబ్ చానెల్ వేదికగా అంచనా వేసాడు.

స్వేచ్చగా ఆడొచ్చు..
విరాట్ కోహ్లీ ఓపెనర్‌గా బరిలోకి దిగితే ఇతర బ్యాట్స్‌మెన్ ఎలాంటి ఒత్తిడి లేకుండా స్వేచ్చగా బ్యాటింగ్ చేయగలరని చెప్పాడు. 'టీ20 వరల్డ్ కప్‌లో బరిలోకి దిగే భారత జట్టులో విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ ఓపెనర్లుగా బరిలోకి దిగుతారు. శిఖర్ ధావన్ పట్ల నేను కఠినంగా వ్యవహరిస్తుండొచ్చు కానీ మిడిలార్డర్‌లో దూకుడైన ఆటగాళ్లను తీసుకోవాలంటే ఈ నిర్ణయం తీసుకోక తప్పదు. కోహ్లీని అప్ ది ఆర్డర్ ఆడిస్తేనే ఇది సాధ్యమవుతోంది. అంతర్జాతీయ క్రికెట్‌లోకి ఇటివలే అరంగేట్రం చేసిన సూర్యకుమార్ యాదవ్ ఫస్ట్ డౌన్‌లో ఆడుతాడు. ఎలాంటి పరిస్థితుల్లోనైనా ఆడగలిగే అతని చేరికతో టీమ్ బ్యాటింగ్ లైనప్ బలంగా మారుతోంది.

రిషభ్ పంత్‌తో..
నాలుగో స్థానానికి కేఎల్ రాహుల్ సరిపోతాడు. నెంబర్ 5లో వికెట్ కీపర్ రిషభ్ పంత్ వస్తాడు. ఏడు ఓవర్లలోపే వికెట్లు కోల్పోతే అతన్ని అప్‌ది ఆర్డర్ పంపించి బౌలర్లపై ఆధిపత్యం చెలాయించేలా ఆడించవచ్చు. నెంబర్ 6, 7లో ఆల్‌రౌండర్లు హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజాలున్నారు. ఒకవేళ శ్రీలంక పర్యటనలో కుల్దీప్ రాణిస్తే మాత్రం లెఫ్టార్మ్ రిస్ట్ స్పిన్నర్‌గా అతన్ని పరిగణలోకి తీసుకోవచ్చు. కానీ ప్రస్తుత పరిస్థితుల్లో యజ్వేంద్ర చాహలే ఏకైక స్పిన్నర్. బ్యాటింగ్‌లో కూడా సత్తా చాటే శార్దూల్ ఠాకూర్‌ను ఎక్స్‌ట్రా పేసర్‌గా తీసుకోవడం ఉత్తమం. ప్రధాన పేసర్లుగా భున్వేశ్వర్, జస్‌ప్రీత్ బుమ్రాలను ఎంపిక చేస్తా.'అని బ్రాడ్ హగ్ చెప్పుకొచ్చాడు.

నో అయ్యర్, ధావన్..
ఇక బ్రాడ్ హగ్ టీమ్‌లో సీనియర్ ఓపెనర్ శిఖర్ ధావన్‌తో పాటు శ్రేయస్ అయ్యర్, మహమ్మద్ షమీలకు అవకాశం దక్కలేదు. శిఖర్ ధావన్ ప్రస్తుతం శ్రీలంక పర్యటనలోని భారత జట్టుకు సారథ్యం వహిస్తున్నాడు. ఇక అయ్యర్ గత కొన్నాళ్లు భారత జట్టులో రెగ్యులర్‌గా కొనసాగుతున్నాడు.
ఇంగ్లండ్‌తో వన్డే సిరీస్‌లో గాయపడ్డ అతను ఐపీఎల్ 2021 ఫస్టాఫ్‌కు దూరమయ్యాడు. ప్రస్తుతం గాయం నుంచి పూర్తిగా కోలుకున్న అతను ఐపీఎల్‌లో సత్తా చాటేందుకు సిద్దమవుతున్నాడు. ఇక భారత స్టార్ పేసర్‌గా కొనసాగుతున్న మహ్మద్ షమీ ప్రస్తుతం ఇంగ్లండ్ పర్యటనలో ఉన్నాడు. ఏది ఏమైనా శ్రీలంక టూర్‌తో పాటు ఐపీఎల్ 2021 సెకండాఫ్‌లో నిలకడగా రాణించే ఆటగాళ్లకే అవకాశాలు దక్కనున్నాయి.

బ్రాడ్ హగ్ ఎలెవన్
రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, కేఎల్ రాహుల్, రిషభ్ పంత్, హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, శార్దూల్ ఠాకూర్, భువనేశ్వర్ కుమార్, యుజ్వేంద్ర చాహల్, జస్‌ప్రీత్ బుమ్రా
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications