
న్యూఢిల్లీ: ఐపీఎల్ 2021 సీజన్‌లో దుమ్మురేపుతున్న ఢిల్లీ క్యాపిటల్ పేసర్ అవేశ్ ఖాన్‌కు భారత టీ20 ప్రపంచకప్‌లో చోటు దక్కింది. యూఏఈ వేదికగా జరిగే ఈ మెగా టోర్నీకి అవేశ్ ఖాన్ టీమిండియా నెట్‌బౌలర్‌గా ఎంపికయ్యాడు. దాంతో, అతను యూఏఈలోనే జట్టుతో ఉండిపోనున్నాడు. నెట్ బౌలర్‌గా తను తొందర్లోనే భారత బయో బబుల్‌లో చేరుతాడని ఢిల్లీ క్యాపిటల్స్ ఫ్రాంచైజీ వర్గాలు తెలిపాయి. అయితే ఈ విషయంపై భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ) అధికారికంగా ప్రకటించాల్సి ఉంది.
సన్‌రైజర్స్ హైదరాబాద్ యువ సెన్సేషన్, జమ్మూ కశ్మీర్ పేసర్ ఉమ్రాన్ మాలిక్ తర్వాత రెండో నెట్ బౌలర్‌గా అవేశ్ ఖాన్‌ను జట్టులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. గంటకు 142 నుంచి 145 కిలీమీటర్ల వేగంతో బంతిని విసరగల నైపుణ్యం అవేశ్ ఖాన్‌కు ఉంది. అంతేకాకుండా ప్రస్తుత ఐపీఎల్ సీజన్‌లో 23 వికెట్లను పడగొట్టి.. టోర్నీలో అత్యధిక వికెట్లు సాధించిన బౌలర్ల జాబితాలోనూ ఈ ఢిల్లీ పేసర్ రెండో స్థానంలో నిలిచాడు. పైగా టీమిండియా డ్రెస్సింగ్ రూమ్ పంచుకున్న అనుభవం అతనికి ఉంది. భారత్ వేదికగా జరిగిన ఐపీఎల్ ఫస్టాఫ్ సీజన్‌లో అద్భుత ప్రదర్శన కనబర్చిన అవేశ్.. ఇంగ్లండ్ పర్యటనకు స్టాండ్ బై బౌలర్‌గా ఎంపికయ్యాడు. అయితే ప్రాక్టీస్ మ్యాచ్‌లో గాయపడి సిరీస్ ప్రారంభానికి ముందే వెనుదిరిగాడు. ఒకవేళ రాబోయే టీ20 ప్రపంచకప్‌లో ఎవరైన బౌలర్ గాయపడితే.. ఆవేశ్ ఖాన్‌కు తుదిజట్టులో చోటు దక్కే అవకాశం ఉంది.
ఇక ఐపీఎల్ ముగిసిన వెంటనే యూఏఈ, ఒమన్ వేదికగా అక్టోబర్ 17 నుంచి టీ20 ప్రపంచకప్ 2021 ప్రారంభంకానుంది. మెగా టోర్నీ కోసం యునైటెడ్ ఎమిరేట్స్ క్రికెట్ బోర్డు (ఈసీబీ) ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తిచేసింది. అక్టోబర్ 17న ఓమన్ వేదికగా క్వాలిఫైర్ మ్యాచులు ప్రారంభం కానుండగా.. అక్టోబర్ 23 నుంచి సూపర్ 12 స్టేజ్ ఆరంభం అవుతుంది. పొట్టి ప్రపంచకప్‌లో భాగంగా అబుదాబిలో జరగబోయే తొలి మ్యాచ్‌లో ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా జట్లు తలపడతాయి. గ్రూప్ 2లో భాగంగా అక్టోబర్ 24న భారత్, పాకిస్థాన్ మధ్య దుబాయ్ వేదికగా తొలి మ్యాచ్ జరగనుంది.