ఆస్ట్రేలియా విధ్వంసకర బ్యాటర్ గ్లేన్ మ్యాక్స్‌వెల్ పేలవ ఫామ్ కొనసాగుతోంది. ఐపీఎల్ 2024 సీజన్‌లో దారుణంగా విఫలమైన మ్యాక్స్‌వెల్..టీ20 ప్రపంచకప్ 2024లోనూ అదే తడబాటును కొనసాగిస్తున్నాడు. స్కాట్లాండ్‌తో ఆదివారం ఉదయం జరిగిన మ్యాచ్‌లో మ్యాక్స్‌వెల్ దారుణంగా విఫలమయ్యాడు.
8 బంతుల్లో ఓ సిక్సర్ సాయంతో 11 పరుగులే చేసి క్లీన్ బౌల్డ్ అయ్యాడు. మ్యాక్సీ బ్యాటింగ్ సందర్భంగా తెలుగు కామెంటేటర్, టీమిండియా మాజీ క్రికెటర్ వేణుగోపాల్ ఘాటు వ్యాఖ్యలు చేశాడు. బిల్డప్ ఎక్కువ బిజినెస్ తక్కువ అంటూ విమర్శలు గుప్పించాడు. మ్యాక్సీ విధ్వంసకర బ్యాటర్ అని, క్షణాల్లో మ్యాచ్ స్వరూపాన్ని మార్చేయగలడని సహచర కామెంటేటర్ శశి ప్రశంసల జల్లు కురిపించాడు.

అయితే ఈ వ్యాఖ్యలకు నివ్వెరపోయిన వేణుగోపాల్ అతనికి అంత సీన్ లేదంటూ చెప్పుకొచ్చాడు. చిన్న చితక జట్లపైనే అతను ప్రభావం చూపిస్తాడని, 10 మ్యాచ్‌ల్లో ఒక్క మ్యాచ్ మాత్రమే ఆడుతాడని, బిల్డప్ ఎక్కువ బిజినెస్ తక్కువ అని చెప్పుకొచ్చాడు. ఆర్‌సీబీ ఫ్యాన్స్ అందరికి మ్యాక్స్‌వెల్ గురించి తెలుసన్నాడు. పదేళ్లుగా ఐపీఎల్‌లో ఇలానే విఫలమవుతున్నాడని చెప్పాడు.
అంతలోనే మ్యాక్స్‌వెల్ క్లీన్ బౌల్డ్ అయ్యాడు. దాంతో కామ్ బాక్స్‌లో నవ్వులు పూసాయి. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. ఈ మాటలు వింటే మ్యాక్స్‌వెల్ వాటర్ బాటిల్‌లో దూకి చనిపోతాడని నెటిజన్లు సెటైర్లు పేల్చుతున్నారు.
ఐపీఎల్ 2024 సీజన్‌లో 10 మ్యాచ్‌లు ఆడిన గ్లేన్ మ్యాక్స్‌వెల్ 52 పరుగులే చేశాడు. మ్యాక్సీ వైఫల్యం ఆర్‌సీబీ కొంపముంచింది. ముఖ్యంగా రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన ఎలిమినేటర్ మ్యాచ్‌లో మ్యాక్సీవెల్ చెత్త షాట్‌తో గోల్డెన్ డక్‌గా వెనుదిరిగాడు.
ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన స్కాట్లాండ్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లకు 180 పరుగులు చేసింది. బ్రెండన్ మెక్‌కల్లమ్(34 బంతుల్లో 2 ఫోర్లు, 6 సిక్స్‌లతో 60) హాఫ్ సెంచరీతో రాణించగా.. కెప్టెన్ రిచీ బెర్రింగ్టన్(42 నాటౌట్) కీలక ఇన్నింగ్స్ ఆడాడు.
ఆస్ట్రేలియా బౌలర్లలో గ్లేన్ మ్యాక్స్‌వెల్(2/44) రెండు వికెట్లు తీయగా.. అష్టన్ అగర్, నాథన్ ఎల్లిస్, ఆడమ్ జంపా తలో వికెట్ తీసారు. అనంతరం లక్ష్యచేధనకు దిగిన ఆస్ట్రేలియా 19.4 ఓవర్లలో 5 వికెట్లకు 186 పరుగులు చేసి గెలుపొందింది. ట్రావిస్ హెడ్(49 బంతుల్లో 5 ఫోర్లు, 4 సిక్స్‌లతో 68), మార్కస్ స్టోయినీస్(29 బంతుల్లో 9 ఫోర్లు, 2 సిక్స్‌లతో 59) హాఫ్ సెంచరీలతో రాణించారు.