సీసీ టీ20 ప్రపంచకప్ 2026లో భాగంగా భారత్ చేతిలో ఎదురైన ఘోర పరాజయంపై పాకిస్థాన్ మాజీ కెప్టెన్ షాహిద్ అఫ్రిది ఆగ్రహం వ్యక్తం చేశాడు. జట్టు ప్రక్షాళన చేయాలని, పేలవ ప్రదర్శనతో భారంగా మారిన సీనియర్ ఆటగాళ్లను పీకేయాలని సూచించాడు. షాహిన్ షా అఫ్రిది తన అల్లుడైనా సరే.. ఫామ్‌లో లేకపోతే జట్టు నుంచి తప్పించాలని ఘాటుగా వ్యాఖ్యానించాడు.
కొలంబో వేదికగా జరిగిన లీగ్ మ్యాచ్‌లో చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌ను భారత్ 61 పరుగుల తేడాతో మట్టికరిపించిన సంగతి తెలిసిందే. భారత్ నిర్దేశించిన 176 పరుగుల లక్ష్యఛేదనలో పాకిస్థాన్ 114 పరుగులకే కుప్పకూలి ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంది. ఈ గెలుపుతో టీమిండియా సూపర్-8 బెర్త్ దక్కించుకోవడంతో పాటు పాకిస్థాన్‌పై తమ ఆధిపత్యాన్ని 8-1గా మార్చుకుంది.
ఈ మ్యాచ్ సందర్భంగా పాకిస్థాన్‌లోని ఓ టీవీ చర్చా కార్యక్రమంలో పాల్గొన్న షాహిద్ అఫ్రిది.. పాకిస్థాన్ పరాజయం నేపథ్యంలో పాకిస్థాన్ క్రికెట్ బోర్డు(పీసీబీ)పై విమర్శలు గుప్పించాడు. జట్టు పునరుద్దరించాల్సిన సమయం ఆసన్నమైందని, సీనియర్ ఆటగాళ్లందర్నీ జట్టు నుంచి పీకేయాలని సూచించాడు. సీనియర్ ఆటగాళ్ల వైఫల్యం పాకిస్థాన్ ఓటమికి ప్రధాన కారణమని అభిప్రాయపడ్డాడు.
గత మూడేళ్లుగా భారత్‌పై తమ ప్రభావం చూపడంలో వారు విఫలమయ్యారని విమర్శించాడు. అందుకే సీనియర్ల స్థానంలో కుర్రాళ్లకు అవకాశం ఇవ్వాలని పీసీబీని అఫ్రిది డిమాండ్ చేశాడు. 'నా అల్లుడు షాహీన్ అఫ్రిదితో పాటు బాబర్ ఆజామ్, షాదాబ్ ఖాన్‌లను జట్టు నుంచి తొలగించాలి. నేనే నిర్ణయాధికారిని అయితే ఈ ముగ్గుర్ని తప్పించేవాడిని. నమీబియా వంటి జట్లపై కొత్త ఆటగాళ్లకు అవకాశాలు ఇచ్చి వారి ఆత్మవిశ్వాసం పెంచేవాడిని.

జట్టులోని సీనియర్లు గత కొన్నేళ్లుగా పేలవ ఫామ్ కనబరుస్తున్నారు. వారి వైఫల్యంతో పాకిస్థాన్ మొత్తాన్ని నిరాశపరుస్తున్నారు. ఎప్పుడైతే వారు బాగా ఆడుతారని ఆశిస్తామో.. అప్పుడు తబడుతారు. వారు ఆడకపోతే.. జూనియర్లను ఆడించాలి. అందులో ఎలాంటి తప్పులేదు.’అని అఫ్రిది నొక్కి చెప్పాడు.
2021 టీ20 ప్రపంచకప్‌లో భారత్‌పై విజయం సాధించిన పాకిస్థాన్.. మళ్లీ ఏ ఫార్మాట్‌లోనూ గెలవలేదు. తాజా ఓటమితో టీ20 ప్రపంచకప్ చరిత్రలోనే పాకిస్థాన్‌కు 8వ ఓటమి. ఇరు జట్లు మొత్తం 9 సార్లు తలపడగా.. భారత్ 8-1తో తమ ఆధిపత్యాన్ని కొనసాగిస్తోంది. టీ20ల్లో గత నాలుగు మ్యాచ్‌లకు నాలుగింటిని టీమిండియా గెలిచింది.
పాకిస్థాన్ స్పిన్నర్లు కట్టడిగా బౌలింగ్ చేసినా.. పాకిస్థాన్ ఏకైక పేసర్‌గా బరిలోకి దిగిన షాహిన్ అఫ్రిది రెండు ఓవర్లలోనే 31 పరుగులు సమర్పించుకొని జట్టు ఓటమికి ప్రధాన కారణమయ్యాడు. బ్యాటింగ్‌లో బాబర్ ఆజామ్ 5 పరుగులే చేసి వెనుదిరగ్గా.. ఫాదాబ్ ఖాన్ 14 పరుగులకే ఔటయ్యాడు. సీనియర్ల వైఫల్యం పాక్ పతనాన్ని శాసించింది. దాంతోనే అఫ్రిది తీవ్ర ఆగ్రహానికి గురయ్యాడు. షాహిద్ అఫ్రిది బిడ్డను షాహీన్ అఫ్రిది వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే.