సౌతాఫ్రికాతో జరుగుతున్న టీ20 ప్రపంచకప్ 2024 ఫైనల్లో టీమిండియా 177 పరుగుల పోరాడే లక్ష్యాన్ని నమోదు చేసింది. విరాట్ కోహ్లీ(59 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్స్‌లతో 76) ఫైటింగ్ హాఫ్ సెంచరీకి అక్షర్ పటేల్(31 బంతుల్లో ఫోర్, 4 సిక్స్‌లతో 47) విలువైన ఇన్నింగ్స్ తోడవ్వడంతో ముందుగా బ్యాటింగ్ చేసిన టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లకు 176 పరుగులు చేసింది.
శివమ్ దూబే(16 బంతుల్లో 3 ఫోర్లు, సిక్స్‌తో 27) విలువైన పరుగులు చేశాడు. సౌతాఫ్రికా బౌలర్లలో కేశవ్ మహారాజ్(2/23), అన్రిచ్ నోర్కియా(2/26) రెండేసి వికెట్లు తీయగా.. మార్కో జాన్సెన్, కగిసో రబడా తలో వికెట్ తీసారు.

నిరాశపరిచిన రోహిత్, పంత్
టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన టీమిండియాకు విరాట్ కోహ్లీ దూకుడైన ఆరంభం ఇచ్చాడు. మార్కో జాన్సెన్ వేసిన తొలి ఓవర్‌లో కోహ్లీ మూడు బౌండరీలు బాది 15 పరుగులు పిండుకున్నాడు. దాంతో వ్యూహం మార్చిన మార్క్‌రమ్ స్పిన్నర్ కేశవ్ మహారాజ్‌ను పట్టుకొచ్చి ఫలితాన్ని రాబట్టాడు. కేశవ్ మహారాజ్ బౌలింగ్‌లో వరుసగా రెండు బౌండరీలు బాదిన రోహిత్.. నాలుగో బంతికి క్యాచ్ ఔటయ్యాడు.
బ్యాక్‌వర్ స్క్వేర్ లెగ్‌లో ఫీల్డర్‌ను పెట్టి రోహిత్ శర్మకు మార్క్‌రమ్ ఉచ్చు బిగించాడు. ఈ వ్యూహాన్ని పసిగట్టలేకపోయిన రోహిత్..మహారాజా వేసిన ఔట్‌సైడ్ ఆఫ్ స్టంప్ బాల్‌ను స్వీప్ షాట్ ఆడాడు. బ్యాట్‌కు మంచి టైమింగ్ అయిన ఈ బంతి బ్యాక్‌వర్డ్ స్క్వేర్ లెగ్ ఫీల్డర్ క్లాసెన్ చేతిలోకి దూసుకొచ్చింది.
చేతులెత్తేసిన సూరీడు..
అనంతరం క్రీజులోకి వచ్చిన రిషభ్ పంత్.. ఈ ఓవర్ చివరి బంతికే క్యాచ్ ఔట్‌గా వెనుదిరిగాడు. స్వీప్ షాట్ ఆడబోయి కీపర్ చేతికి చిక్కాడు. ఆ కొద్ది సేపటికే రబడా వేసిన 5వ ఓవర్‌లో సూర్యకుమార్ యాదవ్(3) క్యాచ్ ఔట్‌గా వెనుదిరిగాడు. దాంతో టీమిండియా 34 పరుగులకే 3 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది.
ఈ పరిస్థితుల్లో టీమిండియా మేనేజ్‌మెంట్ వ్యూహాత్మకంగా అక్షర్ పటేల్‌ను అప్‌ది ఆర్డర్ పంపించింది. ఇక పవర్ ప్లేలో టీమిండియా 3 వికెట్లకు 45 పరుగులే చేసింది. వరుసగా వికెట్లు కోల్పోవడంతో ఓవైపు విరాట్ కోహ్లీ ఆచితూచి ఆడగా.. మరోవైపు అక్షర్ పటేల్ భారీ షాట్స్ ఆడాడు. ఈ ఇద్దరూ మంచి సమన్వయంతో పరుగులు రాబట్టారు.
ఆదుకున్న కోహ్లీ-బాపు
విరాట్ కోహ్లీ సింగిల్స్‌కు పరిమితమైనా.. అక్షర్ పటేల్ భారీ సిక్సర్లతో అలరించాడు. ఈ ఇద్దరూ నాలుగో వికెట్‌కు 72 పరుగులు జోడించిన అనంతరం అక్షర్ పటేల్ దురదృష్టవశాత్తు రనౌట్‌గా వెనుదిరిగాడు. 3 పరుగుల వ్యవధిలో హాఫ్ సెంచరీ చేజార్చుకున్నాడు. క్రీజులోకి వచ్చిన శివమ్ దూబే కూడా బ్యాట్‌కు పని చెప్పగా.. కోహ్లీ సింగిల్స్‌తో 48 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు.
భారీ షాట్లు ఆడకపోవడంతో కోహ్లీ ఈ హాఫ్ సెంచరీని సెలెబ్రేట్ చేసుకోలేదు. రబడా వేసిన 18వ ఓవర్‌లో ఓ భారీ సిక్సర్ బాదిన కోహ్లీ రిథమ్ అందుకున్నాడు. అదే ఓవర్‌లో మరో బౌండరీ బాదాడు. మార్కో జాన్సెన్ వేసిన 19వ ఓవర్‌లో 4, 6 బాదిన కోహ్లీ.. అదే జోరులో క్యాచ్ ఔట్‌గా వెనుదిరిగాడు. చివరి ఓవర్‌లో బౌండరీ బాదిన శివమ్ దూబే అదే జోరులో క్యాచ్ ఔట్‌గా వెనుదిరిగాడు. చివరి బంతికి జడేజా కూడా ఔటవ్వడంతో టీమిండియా 176 పరుగులకే పరిమితమైంది.