టీ20 ప్రపంచకప్ 2024లో బంగ్లాదేశ్ ఆటగాళ్లు తమ వక్ర బుద్ధిని మరోసారి బయటపెట్టారు. గ్రూప్-డీలో భాగంగా పసికూన నేపాల్‌తో సోమవారం ఉదయం జరిగిన మ్యాచ్‌లో తొండాట ఆడారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియా వైరల్ కాగా.. బంగ్లాదేశ్ ఆటగాళ్లపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి.
కళ్ల ముందే బంగ్లా ఆటగాళ్లు మోసానికి పాల్పడిన అంపైర్లు పట్టించుకోకపోవడంపై క్రికెట్ అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సెయింట్ విన్సెట్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో బంగ్లాదేశ్ 21 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ గెలుపుతో సూపర్-8కు అర్హత సాధించింది.

డగౌట్ సైగలతో రివ్యూ..
అయితే బంగ్లాదేశ్ బ్యాటర్ జాకర్ అలీ నిబంధనలకు విరుద్దంగా డీఎర్‌ఎస్ నిర్ణయం తీసుకోవడంలో డగౌట్ సాయం తీసుకున్నాడు. అందరు చూస్తుండగానే సైగలతో రివ్యూ తీసుకోవాలా? వద్దా? అని ప్రశ్నించాడు. తీసుకోవాలని డగౌట్‌లోని కోచ్‌లు సూచించడంతో రివ్యూ తీసుకున్నాడు. ఈ సమీక్ష బంగ్లాదేశ్‌కు కలిసొచ్చింది. ఇలా నిబంధనలకు విరుద్దంగా డగౌట్ సాయం తీసుకున్నా అంపైర్లు పట్టించుకోలేదు.
బంగ్లాదేశ్ ఇన్నింగ్స్ సందర్భంగా 14వ ఓవర్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది. సందీప్ లామిచానే వేసిన ఈ ఓవర్ తొలి బంతిని బంగ్లా బ్యాటర్ హసన్ సాకిబ్ డిఫెన్స్ ఆడే ప్రయత్నం చేశాడు. కానీ బ్యాట్‌ను మిస్సైన బంతి ప్యాడ్లను తాకింది. దాంతో నేపాల్ ఆటగాళ్లు ఎల్బీ కోసం గట్టిగా అప్పీల్ చేశారు.
తొండాట..
ఫీల్డ్ అంపైర్ ఔటివ్వగా.. తాంజిమ్ హసన్ మైదానం వీడేందుకు సిద్దమయ్యాడు. డ్రెస్సింగ్ రూమ్ వైపు నడుస్తూ ముందుకు కదిలాడు. కానీ నాన్ స్ట్రైకర్‌గా ఉన్న జాకర్ అలీ.. డగౌట్‌వైపు చూస్తూ డీఆర్‌ఎస్ తీసుకునే విషయంలో సైగలు చేశాడు. మరోవైపు రివ్యూ తీసుకునే సమయం కూడా ముగిసింది. కానీ డగౌట్ సూచనలతో తాంజిమ్ హసన్‌ను ఆపి రివ్యూ తీసుకోవాలని జాకర్ అలీ సూచించాడు.
రివ్యూలో బంతి వికెట్లను మిస్ అవుతున్నట్లు తేలింది. దాంతో అంపైర్ తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకొని నాటౌట్‌గా ప్రకటించాడు. ఈ ఘటనపై సోషల్ మీడియా వేదికగా తీవ్ర దుమారం రేగుతోంది. ఫీల్డ్ అంపైర్‌పై నెటిజన్లు మండిపడుతున్నారు. బంగ్లా ఆటగాళ్లతో పాటు అంపైర్‌పై చర్యలు తీసుకోవాలని ఐసీసీని కోరుతున్నారు. ఇక తొండాటతో ఔటయ్యే ప్రమాదం నుంచి తప్పించుకున్న తాంజిమ్ మరుసటి బంతికే క్లీన్ బౌల్డ్ కావడం విశేషం.
రఫ్ఫాడించిన తన్జీమ్, ముస్తాఫిజుర్
ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ 19.3 ఓవర్లలో 106 పరుగులకు ఆలౌటైంది. షకిబ్ అల్ హసన్ ( 22 బంతుల్లో, 2 ఫోర్లతో 17) టాప్ స్కోరర్. సోంపాల్ (2/10), సందీప్ లమిచానె (2/17), రోహిత్ పాడెల్ (2/20), దీపేంద్ర సింగ్ (2/22) తలో రెండు వికెట్లతో సత్తాచాటారు.
అనంతరం నేపాల్ 19.2 ఓవర్లలో 85 పరుగులకే ఆలౌటై ఓటమిపాలైంది. తన్జీమ్ (4/7) నాలుగు వికెట్లు, ముస్తాఫిజుర్ రెహ్మన్ (3/7) మూడు వికెట్లతో విజృంభించారు.