సౌతాఫ్రికా కెప్టెన్ ఎయిడెన్ మార్క్‌రమ్ చరిత్ర సృష్టించాడు. ప్రపంచకప్ చరిత్రలోనే సౌతాఫ్రికాను ఫైనల్ చేర్చిన తొలి కెప్టెన్‌గా అరుదైన ఘనతను సొంతం చేసుకున్నాడు. టీ20 ప్రపంచకప్ 2024లో భాగంగా గురువారం జరిగిన తొలి సెమీఫైనల్లో సౌతాఫ్రికా 9 వికెట్ల తేడాతో అఫ్గానిస్థాన్‌ను చిత్తు చేసింది.
ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన అఫ్గానిస్థాన్ 56 పరుగులకే కుప్పకూలింది. బ్యాటింగ్‌కు కఠినంగా ఉన్న వికెట్‌పై అఫ్గాన్ బ్యాటర్లు 12 ఓవర్లు ఆడలేకపోయారు. దాంతో అఫ్గాన్ 11.5 ఓవర్లకే ఆలౌటైంది. సఫారీ బౌలర్లలో టబ్రైజ్ షంసీ(3/6), మార్కో జాన్సన్(3/16) మూడేసి వికెట్లు తీయగా.. కగిసో రబడా(2/14) రెండు వికెట్లు పడగొట్టాడు.

అనంతరం లక్ష్యచేధనకు దిగిన సౌతాఫ్రికా 8.5 ఓవర్లలో వికెట్ నష్టానికి 60 పరుగులు చేసి 67 బంతులు మిగిలి ఉండగానే విజయాన్ని అందుకుంది. అఫ్గాన్ బౌలర్లలో ఫజలక్ ఫరూకీ మాత్రమే వికెట్ తీసాడు. అద్భుత ప్రదర్శనతో తొలి సారి సెమీఫైనల్ చేరిన అఫ్గాన్ అనూహ్య రీతిలో ఓటమిపాలైంది. పిచ్ నుంచి లభించిన సహకారాన్ని సౌతాఫ్రికా బౌలర్లు అందిపుచ్చుకున్నారు.
శనివారం జరిగే ఫైనల్లో భారత్ వర్సెస్ ఇంగ్లండ్ మధ్య జరిగే రెండో సెమీఫైనల్ విజేతతో సౌతాఫ్రికా తలపడనుంది. అంతర్జాతీయ క్రికెట్‌లో ఇప్పటి వరకు సౌతాఫ్రికా జట్టు ఐసీసీ ట్రోఫీ గెలవలేదు. గతంలో ఫైనల్ కూడా చేరలేదు. ఈ సారైనా ఆ ముచ్చట తీర్చుకోవాలని సఫారీ టీమ్ భావిస్తోంది.
ఎయిడెన్ మార్క్‌రమ్ కెప్టెన్‌గానే సౌతాఫ్రికా అండర్ 19 ప్రపంచకప్ గెలిచింది. మార్క్‌రమ్ సారథ్యంలోనే సఫారీ టీమ్ టీ20 ప్రపంచకప్‌లో తొలిసారి ఫైనల్ చేరింది. 2014లో మార్క్‌రమ్ సారథ్యంలోనే సౌతాఫ్రికా అండర్-19 ప్రపంచకప్ గెలిచింది. అన్ని స్థాయి క్రికెట్‌లో సౌతాఫ్రికా గెలిచిన ఏకైక ఐసీసీ టైటిల్ ఇదే కావడం విశేషం. సౌతాఫ్రికా టీ20 లీగ్‌లోనూ ఎయిడెన్ మార్క్‌రమ్ కెప్టెన్సీలోని సన్‌రైజర్స్ ఈస్టెర్న్ కేప్ వరుసగా రెండు సీజన్లలో విజేతగా నిలిచింది.