T20 Blast 2022: ఆఖరి బంతికి హై డ్రామా.. క్రికెట్ చరిత్రలోనే కని విని ఎరగని ఘటన (వీడియో)

లండన్: టీ20 బ్లాస్ట్ 2022 సీజన్ ఫైనల్లో ఆఖరి బంతికి హై డ్రామా చోటు చేసుకుంది. క్రికెట్ చరిత్రలోనే కని విని ఎరగని ఈ ఘటన క్రికెట్ అభిమానులను ఆకట్టుకుంటుంది. లాంకషైర్ జట్టుతో శనివారం జరిగిన ఫైనల్లో హాంప్‌షైర్ టీమ్ ఒక్క పరుగుతో గెలిచి చాంపియన్‌గా నిలిచింది. అయితే ఆఖరి బంతికి లాంకషైర్ జట్టు విజయానికి 5 పరుగులు అవసరమయ్యాయి.
క్రీజులో ఉన్న రిచర్డ్ గ్లీసన్ భారీ షాట్ ఆడే ప్రయత్నం చేశాడు. కానీ నాథన్ ఎల్లిస్ వేసిన స్లో యార్కర్‌ను అతను సరిగ్గా అంచనా వేయలేక క్లీన్ బౌల్డ్ అయ్యాడు. దాంతో హాంప్‌షైర్ గెలిచిందని అంతా భావించారు. ఆ జట్టు ఆటగాళ్లు అయితే ఆనందంతో ఎగిరి గంతేసారు. మైదానమంతా తిరుగుతూ ఒకరిపై ఒకరు దుంకుతూ సంబరాలు చేసుకున్నారు.
నో బాల్ అంటూ అంపైర్ ట్విస్ట్..
కానీ అప్పుడే ఫీల్డ్ అంపైర్ భారీ ట్విస్ట్ ఇచ్చాడు. నాథన్ ఎల్లిస్ వేసిన ఆఖరి బంతిని నోబాల్‌గా ప్రకటించాడు. దాంతో మైదానమంతా ఒక్కసారిగా మూగబోయింది. హాంప్‌షైర్ ఆటగాళ్లంతా నెత్తిని పట్టుకున్నారు. విజయ సమీకరం కూడా చివరి బంతికి 3 పరుగులుగా మారింది.
లాంకషైర్‌కు లక్ కలిసిరావడంతో ఆ జట్టునే విజయం వరిస్తుందా? అని అంతా అనుకున్నారు. కానీ ఎల్లిస్ స్లోయర్ స్వింగ్ బాల్ వేయగా.. గ్లీసన్ దాన్ని కనీసం టచ్ కూడా చేయలేకపోయాడు. బై రూపంలో ఒక పరుగు తీసినా లాభం లేకపోయింది. దాంతో హాంప్‌షైర్ ఆటగాళ్లంతా ఊపిరి పీల్చుకున్నారు. ప్రస్తుతం ఈ డ్రామాకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.
మెక్ డెర్మాట్ హాఫ్ సెంచరీ..
ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన హాంప్‌షైర్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లకు 152 పరుగులు చేసింది. బెన్ మెక్‌డెర్మాట్(36 బంతుల్లో 4 ఫోర్లు, 4 సిక్స్‌లతో 62)హాఫ్ సెంచరీతో రాణించగా.. క్రిస్ వుడ్(20 నాటౌట్) విలువైన పరుగులు చేశాడు. లాంకషైర్ జట్టులో మ్యాట్ పార్కిన్సన్ (4/26) నాలుగు వికెట్లతో చెలరేగాడు. లూక్ వుడ్ రెండు వికెట్లు తీయగా.. రిచర్డ్ గ్లీసన్, డానీ లామ్ తలో వికెట్ తీసారు.
ఒక్క పరుగుతో..
అనంతరం లక్ష్యచేధనకు దిగిన లాంకషైర్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లకు 151 పరుగులు మాత్రమే చేసి ఓటమిపాలైంది. స్టీవెన్ క్రాఫ్ట్(25 బంతుల్లో 5 ఫోర్లతో 36), లుక్ వెల్స్(24 బంతుల్లో 2 ఫోర్లు, సిక్స్‌తో 27) టాప్ స్కోరర్లుగా నిలిచారు. హాంప్‌షైర్ బౌలర్లలో లియామ్ డాసన్, జేమ్స్ ఫుల్లర్ రెండేసి వికెట్లు తీయగా.. క్రిస్ వుడ్, మాసన్ క్రేన్ తలో వికెట్ పడగొట్టారు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications