
చెన్నై: టీమిండియా యువ పేసర్ టీ. నటరాజన్ శనివారం దిండుగల్ జిల్లా పళనిలోని సుబ్రహ్మణ్యస్వామి ఆలయాన్ని సందర్శించాడు. ఈ సందర్భంగా తలనీలాలు సమర్పించుకొని మొక్కులు తీర్చుకున్నాడు. ఈ విషయం తెలుసుకున్న అభిమానులు పెద్ద ఎత్తున ఆలయానికి చేరుకుని నటరాజన్‌తో సెల్ఫీలు దిగారు. సేలం జిల్లా చిన్నపంబట్టికి చెందిన నటరాజన్ గతేడాది యూఏఈ వేదికగా జరిగిన ఐపీఎల్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ తరఫున బరిలోకి దిగి సత్తాచాటాడు. కచ్చితత్వంతో కూడిన యార్కర్లతో యార్కర్ల నట్టూగా అందరి ప్రశంసలు అందుకున్నాడు.
ఈ సూపర్ పెర్ఫామెన్స్‌తో ఆస్ట్రేలియా పర్యటనకు నెట్ బౌలర్‌గా వెళ్లిన నట్టూ.. ఆ తర్వాత ఇతర ఆటగాళ్ల గాయాలతో టీ20, వన్డే, టెస్ట్ జట్టులో చోటు దక్కించుకున్నాడు. ఆస్ట్రేలియాతో జరిగిన మూడు వన్డేతో అంతర్జాతీయ క్రికెట్‌లోకి అరంగేట్రం చేసిన నట్టూ సూపర్ పెర్ఫామెన్స్‌తో టీ20 సిరీస్‌లో కూడా అవకాశం అందుకున్నాడు.
ఆ తర్వాత సీనియర్ బౌలర్ల గాయాలతో గబ్బా వేదికగా జరిగిన ఆఖరి టెస్ట్‌లోనూ చోటు దక్కించుకొని సుదీర్ఘ ఫార్మాట్‌లోకి కూడా అరంగేట్రం చేశాడు. తద్వారా ఓ పర్యటనలో మూడు ఫార్మాట్లలో అరంగేట్రం చేసిన తొలి భారత క్రికెటర్‌గా రికార్డు కెక్కాడు. ఆసీస్ పర్యటన ముగించుకుని ఇటీవల స్వగ్రామం చిన్నపంపట్టి చేరుకున్న నటరాజన్‌కు ఘన స్వాగతం లభించింది.
ఈ నేపథ్యంలో తన ఇష్టదైవం దండాయుధపాణి స్వామివారిని దర్శించుకొని మొక్కులు తీర్చుకున్నాడు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన నటరాజన్.. ప్రతి ఏటా తాను పళని దండాయుధపాణిస్వామివారిని దర్శించుకుంటానని, భారత క్రికెట్ చరిత్రలో భారీ విజయాన్ని సాధించి పెట్టేందుకు తన వంతుసాయమందించినందుకు కృతజ్ఞతగా స్వామివారికి తలనీలాలు సమర్పించుకున్నానని తెలిపాడు.