దేశవాళీ క్రికెట్‌లో ముంబై జైత్ర యాత్ర కొనసాగుతోంది. గత సీజన్ రంజీ ట్రోఫీతో పాటు ప్రతిష్టాత్మక ఇరానీ కప్‌ను సొంతం చేసుకున్న ముంబై.. తాజాగా దేశవాళీ టీ20 టోర్నీ సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ టైటిల్‌ను కైవసం చేసుకుంది. మధ్యప్రదేశ్‌తో ఆదివారం జరిగిన మ్యాచ్‌లో సమష్టిగా రాణించిన ముంబై 5 వికెట్ల తేడాతో గెలుపొందింది. టీమిండియా టీ20 కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్(35 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్స్‌లతో 48) దూకుడుగా ఆడి ముంబై విజయంలో కీలక పాత్ర పోషించాడు.
ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన మధ్యప్రదేశ్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లకు 174 పరుగులు చేసింది. రజత్ పటీదార్(40 బంతుల్లో 6 ఫోర్లు, 6 సిక్స్‌లతో 81 నాటౌట్) అజేయ హాఫ్ సెంచరీతో రాణించగా మిగతా బ్యాటర్లు విఫలమయ్యారు. ముంబై బౌలర్లలో శార్దూల్ ఠాకూర్, రాయ్‌స్టోన్ డయాస్ చెరో రెండు వికెట్లు తీయగా.. అథర్వ అంకోలేకర్, శివమ్ దూబే, సూర్యాన్ష్ షెద్గే తలో వికెట్ తీసారు.

అనంతరం లక్ష్యఛేదనకు దిగిన ముంబై 17.5 ఓవర్లలో 5 వికెట్లకు 180 పరుగులు చేసి సునాయస విజయాన్నందుకుంది. సూర్యకుమార్ యాదవ్‌తో పాటు సుర్యాన్ష్ షెద్గే(15 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్స్‌లతో 36 నాటౌట్) రాణించాడు. మధ్యప్రదేశ్ బౌలర్లలో త్రిపురేష్ సింగ్(2/34) రెండు వికెట్లు తీయగా.. శివమ్ శుక్లా, వెంకటేశ్ అయ్యర్, కుమార్ కార్తీకేయ తలో వికెట్ తీసారు.
లక్ష్యచేధనలో ముంబైకి ఆదిలోనే షాక్ తగిలింది. ఓపెనర్ పృథ్వీ షా(10) మరోసారి తీవ్రంగా నిరాశపరిచాడు. క్రీజులోకి వచ్చిన కెప్టెన్ శ్రేయస్ అయ్యర్(16) కూడా త్వరగానే ఔటవ్వగా.. క్రీజులోకి వచ్చిన సూర్యకుమార్ యాదవ్ దూకుడుగా ఆడాడు. దాంతో పవర్ ప్లేలో ముంబై 2 వికెట్ల నష్టానికి 50 పరుగులు చేసింది.
నిలకడగా ఆడుతున్న అజింక్యా రహానే(37)ను వెంకటేశ్ అయ్యర్ ఔట్ చేయడంతో మూడో వికెట్‌కు నమోదైన 52 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది. ఆ వెంటనే క్రీజులోకి వచ్చిన శివమ్ దూబే(9) ఔటవ్వగా.. సూర్యకుమార్ యాదవ్(48) హాఫ్ సెంచరీ ముంగిట వెనుదిరిగాడు. దాంతో మ్యాచ్ ఉత్కంఠగా మారగా.. అథ్వర్ అంకోలేకర్(16 బ్యాటింగ్) సాయంతో సూర్యన్ష్ షెద్గే(36 నాటౌట్) రాణించాడు.