
హైదరాబాద్: తెలంగాణ ఐటీ, మున్సిపల్‌శాఖ మంత్రి కేటీఆర్‌తో టీమిండియా క్రికెటర్ హనుమ విహారి భేటీ అయ్యాడు. సోమవారం ప్రగతిభవన్‌లో మంత్రిని మర్యాదపూర్వకంగా కలిశాడు. ఈ సందర్భంగా హనుమ విహారిని కేటీఆర్ శాలువాతో సత్కరించారు. ఇక విహారి.. తన బ్యాట్‌ను కేటీఆర్‌కు బహుమతిగా అందజేశారు. అనంతరం ఇరువురూ క్రికెట్ సంబంధిత అంశాలపై కాసేపు చర్చించుకున్నారు.
ఆసీస్ పర్యటనకు సంబంధించిన విషయాలను విహారి..కేటీఆర్‌కు వివరించాడు. ఇక కేటీఆర్‌ను కలిసిన విషయాన్ని విహారి సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్నాడు. 'కేటీఆర్ సర్.. మిమ్మల్ని కలవడం, క్రికెట్ గురించి మాట్లాడటం చాలా ఆనందంగా ఉంది'అనే క్యాప్షన్‌తో కేటీఆర్‌తో దిగిన ఫొటోను షేర్ చేశాడు.
ఆస్ట్రేలియాతో సిడ్నీ వేదికగా జరిగిన మూడో టెస్టులో అద్భుత డిఫెన్స్‌తో ఆకట్టుకున్న హనుమ విహారి , రవిచంద్రన్ అశ్విన్ మ్యాచ్ డ్రాగా ముగియడంలో కీలక పాత్ర పోషించిన విషయం తెలిసిందే. తొడకండరాల గాయానికి గురైనా.. వరల్డ్ క్లాస్ బౌలింగ్‌ను విహారీ ధీటుగా ఎదుర్కొన్నాడు.
ఇక గాయం కారణంగా విహారి ఆఖరిదైన నాలుగో టెస్టుకు దూరంకావడంతో ఇటీవలే స్వదేశం చేరుకున్నాడు. మూడో టెస్టును టీమిండియా డ్రా చేసుకోవడంపై మంత్రి కేటీఆర్ ట్విటర్‌లో స్పందించిన విషయం తెలిసిందే. ఈ టెస్టు డ్రా.. ఇన్నింగ్స్ విజయం కన్నా బాగుందని కొనియాడాడు.