ముంబై ఇండియన్స్ సారథ్య బాధ్యతల నుంచి రోహిత్ శర్మను తొలగించడంపై అతని అభిమానులే కాకుండా ఆ జట్టు క్రికెటర్లు కూడా అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. రోహిత్ శర్మను సారథ్య బాధ్యతల నుంచి తప్పించడంపై టీమిండియా స్టార్ బ్యాటర్, ముంబై ఇండియన్స్ కీలక ప్లేయర్ సూర్యకుమార్ యాదవ్ స్పందించాడు.
ట్విటర్ వేదికగా 'హార్ట్ బ్రేక్' ఏమోజీని షేర్ చేశారు. ముంబై ఇండియన్స్ తీసుకున్న ఈ నిర్ణయం తనకు కూడా నచ్చలేదని పరోక్షంగా వెల్లడించాడు. ఎలాంటి కామెంట్స్, హ్యాష్ ట్యాగ్ లేకుండా తన ఆవేదనను ఏమోజీ రూపంలో పంచుకున్నాడు. సూర్యకుమార్ యాదవ్‌కు రోహిత్ శర్మ ఎంతో అండగా నిలిచాడు. రోహిత్ శర్మ చొరవతో సూర్యకుమార్ యాదవ్ అంతర్జాతీయ క్రికెట్‌లోకి అరంగేట్రం చేశాడు.

రోహిత్ శర్మ సారథ్యంలోనే వరుసగా అవకాశాలు అందుకొని నెంబర్ వన్ టీ20 బ్యాటర్‌గా.. టీ20 తాత్కలిక సారథిగా ఎదిగాడు. హార్దిక్ పాండ్యా సైతం రోహిత్ శర్మ సారథ్యంలోనే ఐపీఎల్‌లోకి ఎంట్రీ ఇచ్చాడు. ముంబై ఇండియన్స్ తీసుకున్న నిర్ణయంపై అభిమానులతో పాటు ఆ జట్టు ఆటగాళ్ల ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
కెప్టెన్సీ మార్పు విషయంపై రోహిత్ శర్మ స్పందించలేదు. శుక్రవారం సౌతాఫ్రికా ఫ్లైట్ ఎక్కిన అతను.. ఈ విషయంపై మౌనంగా ఉన్నాడు. రోహిత్ శర్మను సంప్రదించే ఈ నిర్ణయం తీసుకొని ఉంటారని ఫ్యాన్స్ భావిస్తున్నారు. ఐపీఎల్ 2024 సీజన్‌లో రోహిత్ శర్మ ఓ ప్లేయర్‌గా మాత్రమే కనిపించనున్నాడు.
అనూహ్యంగా ముంబై ఇండియన్స్ సారథ్య బాధ్యతలు అందుకున్న రోహిత్ శర్మ.. జట్టుకు తొలి టైటిల్ అందించడంతో పాటు మొత్తం ఐదు సార్లు ఛాంపియన్‌గా నిలబెట్టాడు. 2013లో తొలి 6 మ్యాచ్‌ల్లో ముంబైకి సారథిగా వ్యవహరించిన రికీ పాంటింగ్ అనూహ్యంగా తప్పుకోవడంతో ఏడో మ్యాచ్ నుంచి రోహిత్ జట్టును నడిపించాడు. అదే సీజన్‌లో ముంబైకి తొలి టైటిల్ అందించాడు. ఆ తర్వాత 2015, 2017,2019,2020 సీజన్లలో ముంబైని ఛాంపియన్‌గా నిలబెట్టాడు.