IND vs AUS: కుర్రాళ్లంతా ఆధిపత్యం చెలాయించడంతో పాటు ఆస్వాదిస్తూ ఆడటంతో విజయాన్నందుకున్నామని టీమిండియా తాత్కలిక సారథి సూర్యకుమార్ యాదవ్ తెలిపాడు. ఐదు టీ20ల సిరీస్‌లో భాగంగా ఆస్ట్రేలియాతో జరిగిన ఆఖరి మ్యాచ్‌లోనూ టీమిండియా 6 పరుగుల తేడాతో గెలుపొందింది. ఆఖరి బంతి వరకు ఉత్కంఠగా సాగిన లోస్కోరింగ్ గేమ్‌లో టీమిండియా సమష్టిగా రాణించి విజయాన్నందుకుంది.
ఈ గెలుపుతో ఐదు టీ20ల సిరీస్‌ను 4-1తో కైవసం చేసుకుంది. ఈ మ్యాచ్ అనంతరం మాట్లాడిన సూర్యకుమార్ యాదవ్.. సమష్టి ప్రదర్శనతో ఓడిపోయే మ్యాచ్‌లో గెలిచామని తెలిపాడు. 'ఇదో అద్భుతమైన సిరీస్. కుర్రాళ్లంతా పూర్తి ఆధిపత్యం చెలాయించారు. నిర్భయంగా ఆడాలనుకున్నాం. మిడిల్‌లో ఉన్నా ఆటను ఆస్వాదిస్తూ ఆడాలనుకున్నాం.

మా కుర్రాళ్లకు ఒక్కటే చెప్పాను. 'జట్టు ఏది సరైనదో అదే చేయండి. మీ ఆటను ఆస్వాదించండి.'అని సూచించాను. వాళ్లు అలాగే ఆడారు. ఈ సిరీస్ విజయం చాలా సంతోషాన్నిచ్చింది. వాషింగ్టన్ సుందర్ ఉండి ఉంటే ఈ మ్యాచ్ మరింత సులువయ్యేది. చిన్నస్వామి స్టేడియంలో 200+ లక్ష్యాన్ని కూడా సునాయసంగా చేధించవచ్చు. 160-175 లక్ష్యాన్ని చేధించడం మాత్రం కష్టమని చెప్పారు. 10 ఓవర్ల తర్వాత ఈ మ్యాచ్ విన్నింగ్ రేసులో ఉన్నామని మా కుర్రాళ్లకు చెప్పాను.'అని సూర్యకుమార్ యాదవ్ చెప్పుకొచ్చాడు.
ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లకు 160 పరుగులు చేసింది. శ్రేయస్ అయ్యర్(37 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్స్‌లతో 53) హాఫ్ సెంచరీతో రాణించగా.. అక్షర్ పటేల్(21 బంతుల్లో 2 ఫోర్లు, సిక్స్‌తో 31) అతనికి అండగా నిలిచాడు. ఆస్ట్రేలియా బౌలర్లలో జాసన్ బెహ్రాండార్ఫ్, బెన్ రెండేసి వికెట్లు తీయగా.. ఆరోన్, నాథన్ ఎల్లిస్, తన్వీర్ సంఘా తలో వికెట్ తీసారు.
అనంతరం లక్ష్యచేధనకు దిగిన ఆస్ట్రేలియా నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లకు 154 పరుగులు చేసి ఓటమిపాలైంది. బెన్ మెక్‌డెర్మోట్(36 బంతుల్లో 5 ఫోర్లతో 54) హాఫ్ సెంచరీతో రాణించగా.. మిగతా బ్యాటర్లు విఫలమయ్యారు. చివర్లో మాథ్యూ వేడ్(15 బంతుల్లో 4 ఫోర్లతో 22) పోరాడినా ఫలితం లేకపోయింది. భారత బౌలర్లలో ముఖేశ్ కుమార్ మూడు వికెట్లు తీయగా.. అర్ష్‌దీప్ సింగ్, రవి బిష్ణోయ్ తలో రెండు వికెట్లు పడగొట్టారు. అక్షర్ పటేల్‌కు ఓ వికెట్ దక్కింది.