పరిస్థితులపై ఫోకస్ పెట్టా..
కెరీర్‌లో అత్యద్భుతమైన ఫామ్‌లో ఉన్న సూర్యకుమార్ యాదవ్ ప్రాక్టీస్ సెషన్ ముగిసిన అనంతరం బీసీసీఐ టీవితో మాట్లాడాడు. ఈ వీడియోను బీసీసీఐ ట్విటర్ వేదికగా అభిమానులతో పంచుకుంది. 'ఇక్కడికి వచ్చి సాధన చేసేందుకు నేను చాలా ఎదురుచూశాను. మైదానంలోకి అడుగుపెట్టి.. నడిచి.. పరిగెత్తి.. ఇక్కడ ఎలా ఉంటుందో తెలుసుకోవాలనుకొన్నాను. ఇక్కడి వికెట్‌పై పేస్ ఎలా ఉంటుందో తెలుసుకోవాలనుకున్నాను. వికెట్ బౌన్స్‌ను చూడాలనుకొన్నాను. తొలి నెట్ సెషన్ అద్భుతంగా ముగిసింది.

పెద్ద మైదానాలకు తగ్గట్లు..
భారత్ తో పోలిస్తే ఇక్కడ పెద్దగా మార్పులేమీ లేకున్నా గాలి మాత్రం చల్లగా వీస్తున్నది. ఇక్కడి వాతావరణానికి అలవాటుపడటానికి కాస్త సమయం పడుతుంది. ఇక్కడి మైదానాలు పెద్దగా ఉంటాయని చెబుతున్నారు. ఆ మేరకు నా ఆటలో కూడా నేను మార్పులు చేసుకుంటున్నా. రాబోయే ప్రపంచకప్ లో రాణించేందుకు గాను నా ప్రణాళికల్లో మార్పులు చేసుకుంటున్నా.. వరల్డ్ కప్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నా. పిచ్‌పై బౌన్స్ ఉన్నట్లు సాధన సమయంలో గమనించాను. వికెట్‌పై పేస్.. ఆస్ట్రేలియాలో గ్రౌండ్ కొలతలు గురించి చాలా మంది మాట్లాడుతారు. ఈ వికెట్లపై మంచి స్కోర్ సాధించడానికి అవసరమైన గేమ్‌ప్లాన్ సిద్ధం చేసుకోవడానికి ఇవి చాలా కీలకం'అని సూర్యకుమార్ యాదవ్ విశ్లేషించాడు.

ముమ్మరంగా సాధన..
టీ20 ప్రపంచకప్ కోసం ఆస్ట్రేలియాలో అడుగుపెట్టిన భారత ఆటగాళ్లు కసరత్తుల్లో మునిగిపోయారు. పెర్త్ మైదానంలో ప్రాక్టీస్ చేస్తున్నారు. అయితే టోర్నీలో ప్రత్యర్థి జట్ల కంటే ముందు అక్కడి చలి వాతావరణం టీమిండియా క్రికెటర్లకు సవాలు విసురుతోంది. ఈ నెల 16న ప్రపంచకప్ ఆరంభమయ్యే నాటికి అక్కడ ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశం ఉంది. కానీ ప్రస్తుతం మాత్రం చలి భారత క్రికెటర్లను వణికిస్తోంది. తొలిసారి టీ20 ప్రపంచకప్ ఆడబోతున్న దీపక్ హుడా, అర్ష్‌దీప్ సింగ్, హర్షల్ పటేల్‌తో చాహల్ సరదాగా ముచ్చటించిన వీడియోను బీసీసీఐ పోస్టు చేసింది. అందులో చాహల్ వెచ్చదనం కోసం జాకెట్ వేసుకుని, హర్షల్ టీ తాగుతూ కనిపించారు.

చలి కాచుకుంటూ..
అక్కడ చాలా చలిగా ఉందని, ఓ కప్పు టీ అత్యవసరమని చాహల్ తెలిపాడు. తాము క్రమంగా ఈ వాతావరణానికి అలవాటు పడతామని హర్షల్ అన్నాడు. భారత్‌లోని ఇండోర్‌లో 22 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రత మధ్య దక్షిణాఫ్రికాతో మూడో టీ20 ఆడిన తర్వాత రోహిత్ సేన ఆస్ట్రేలియా విమానమెక్కింది. ఇప్పుడక్కడ పెర్త్‌లో కనిష్ఠ ఉష్ణోగ్రత 7 డిగ్రీలుగా ఉంది. ఈ నెల 13 వరకు అది 8 డిగ్రీలుగా కొనసాగే అవకాశం ఉంది. మరోవైపు తొలిసారి ప్రపంచకప్ ఆడేందుకు ఆత్రుతగా ఎదురు చూస్తున్నామని, ఈ అవకాశాన్ని ఉపయోగించుకుని జట్టుకు విజయాలు అందిస్తామని హర్షల్, దీపక్, అర్ష్‌దీప్ చెప్పారు. ఈ నెల 23న పాక్‌తో పోరుతో టీమ్‌ఇండియా కప్పు వేట మొదలెడుతుంది.


Click it and Unblock the Notifications
