ఐసీసీ టీ20 ప్రపంచకప్ 2026 టోర్నీలో భాగంగా జింబాబ్వేతో జరుగుతున్న సూపర్-8 మ్యాచ్‌లో టీమిండియా టాస్ ఓడిపోయింది. టాస్ గెలిచిన జింబాబ్వే బౌలింగ్ ఎంచుకుంది. అయితే టాస్ గెలిచినా తాను బ్యాటింగ్ ఎంచుకునేవాడినని టీమిండియా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ తెలిపాడు. ఈ మ్యాచ్ కోసం వ్యూహాత్మకంగా తుది జట్టులో రెండు మార్పులు చేశామని చెప్పాడు. వాషింగ్టన్ సుందర్ స్థానంలో అక్షర్ పటేల్, రింకూ సింగ్ ప్లేస్‌లో సంజూ శాంసన్ జట్టులోకి వచ్చారని తెలిపాడు.
'జింబాబ్వే బౌలింగ్ ఎంచుకోవడం సంతోషంగా ఉంది. ఎందుకంటే మేం ముందుగా బ్యాటింగ్ చేయాలనుకున్నాం. ఈ మ్యాచ్ కోసం మా కుర్రాళ్లు సిద్దంగా ఉన్నారు. జట్టులో వాతావరణం చాలా ప్రశాంతంగా ఉంది. హడిల్(జట్టు సమావేశం) అద్భుతంగా జరిగింది. హార్దిక్ అద్భుతంగా మాట్లాడాడు. కుర్రాళ్లలో ఆత్మవిశ్వాసాన్ని రెట్టింపు చేశాడు. గెలిచినా.. ఓడినా ఏదో ఒకటి నేర్చుకుంటాం.
గత మ్యాచ్‌లో ఏం జరిగిందో మర్చిపోండని చెప్పాడు. జట్టులో రెండు మార్పులు ఉన్నాయి. వాషింగ్టన్ సుందర్ స్థానంలో అక్షర్, రింకూ ప్లేస్‌లో సంజూ శాంసన్ తుది జట్టులోకి వచ్చారు.'అని సూర్యకుమార్ యాదవ్ వెల్లడించాడు.

ఈ టోర్నీలో ప్రత్యర్థి జట్లు తెలివిగా.. పవర్ ప్లేలో ఎడమచేతి వాటం బ్యాటర్లు ఇషాన్, అభిషేక్, తిలక్‌లకు ఆఫ్ స్పిన్నర్లతో బౌలింగ్ చేయించడం ద్వారా పరుగులు చేయకుండా కట్టడి చేస్తున్నారు.కుడిచేతి వాటం బ్యాటరైన శాంసన్‌ను తీసుకోవడం ద్వారా ఈ సమస్యను అధిగమించవచ్చని టీమిండియా మేనేజ్‌మెంట్ భావిస్తోంది.
పిచ్ కండిషన్స్ నేపథ్యంలోనే బౌలింగ్ ఎంచుకున్నానని జింబాబ్వే కెప్టెన్ సికిందర్ రజా తెలిపాడు. 'మేం మొదట బౌలింగ్ చేయబోతున్నాం. ఇది సాధారణ చెన్నై వికెట్‌లా లేదు. పిచ్‌పై తేమ కనిపిస్తోంది. అందుకే మా పేసర్లకు మంచి అవకాశం ఇవ్వాలనుకుంటున్నాం. భారత్‌ను తక్కువ పరుగులకే పరిమితం చేయగలిగితే.. అది మాకు ఎంతో మేలు చేస్తుంది. మేం ఎంత వేడిని అనుభవిస్తున్నామో.. ప్రత్యర్థి జట్టు కూడా అంతే ఇబ్బంది పడుతుంటుంది. పిచ్ ప్రస్తుతానికి నిలకడగా ఉంది. ఒక టెక్నికల్ మార్పు చేశాం. క్రీమర్ ఈ మ్యాచ్ ఆడటం లేదు.'అని రజా చెప్పుకొచ్చాడు.
జింబాబ్వే :
తడివానాషే మారుమని (వికెట్ కీపర్), బ్రయాన్ బెన్నెట్, డియోన్ మైయర్స్, ర్యాన్ బర్ల్, సికందర్ రజా (కెప్టెన్), టోనీ మున్యోంగా, తాషింగా ముసెకివా, బ్రాడ్ ఈవాన్స్, టినోటెండ మాపోసా, బ్లెస్సింగ్ ముజారబాని, రిచర్డ్ నగారవ.
భారత్:
సంజూ శాంసన్ (వికెట్ కీపర్), అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్, సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా, శివం దూబే, అక్షర్ పటేల్, అర్ష్‌దీప్ సింగ్, వరుణ్ చక్రవర్తి, జస్ప్రీత్ బుమ్రా.