టీమిండియా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ ఎట్టకేలకు ఫామ్‌లోకి వచ్చాడు. 24 ఇన్నింగ్స్‌లు.. 468 రోజుల తర్వాత హాఫ్ సెంచరీ నమోదు చేశాడు. కమ్ముకున్న కారు చీకట్లను చీల్చుకుంటూ తన సాధ్యమైన ఆటతో చెలరేగాడు. ఐదు టీ20ల సిరీస్‌లో భాగంగా న్యూజిలాండ్‌తో రాయ్‌పూర్ వేదికగా జరిగిన రెండో టీ20లో అజేయ అర్థ శతకంతో భారత విజయంలో కీలక పాత్ర పోషించాడు.
జాకోబ్ డఫ్ఫీ బౌలింగ్‌లో డీప్ బ్యాక్‌వర్డ్ స్క్వేర్ లెగ్ దిశగా సిక్సర్ బాదిన సూరీడు..మరుసటి బంతిని సింగిల్ తీసి 23 బంతుల్లో అర్థ శతకాన్ని అందుకున్నాడు. సూర్య కెరీర్‌లో ఇది 22వ హాఫ్ సెంచరీ కాగా.. దీని కోసం ఎన్నో విమర్శలు, ఛీత్కారాలు, చీదరింపులను ఎదుర్కొన్నాడు. ఎట్టకేలకు తన బ్యాట్‌తోనే విమర్శకుల నోళ్లు మూయించాడు.
209 పరుగుల భారీ లక్ష్య ఛేదనలో భారత్ 6 పరుగులకే ఓపెనర్ల వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడగా.. ఇషాన్ కిషన్‌తో కలిసి కెప్టెన్ సూర్య జట్టును ఆదుకున్నారు. ఆరంభంలో ఇషాన్ కిషన్ చెలరేగగా.. సూర్య అతనికి స్ట్రైక్ ఇస్తూ అండగా నిలిచాడు. ఆ తర్వాత తన అసలు సిసలు బ్యాటింగ్ మొదలు పెట్టాడు.

360 షాట్స్‌తో మైదానం నలుమూలల బంతి బాదుతూ వీర విహారం చేశాడు. 64 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద అతను ఇచ్చిన క్యాచ్‌ను మిచెల్ సాంట్నర్ వదిలేయడంతో మరింత దూకుడుగా ఆడి భారత విజయానికి బాటలు వేసాడు. ఈ క్రమంలో టీ20 కెరీర్‌లో 900 ఫోర్లతో పాటు 400 సిక్స్‌ల మైలురాయి అందుకున్నాడు. 37 బంతుల్లో 9 ఫోర్లు, 4 సిక్స్‌లతో వీర విహారం చేసిన సూరీడు.. 82 పరుగలతో అజేయంగా నిలిచి భారత విజయలాంఛనాన్ని పూర్తి చేశాడు.
అతనితో ఇషాన్ కిషన్(32 బంతుల్లో 11 ఫోర్లు, 4 సిక్స్‌లతో 76) రఫ్ఫాడించడంతో న్యూజిలాండ్ విధించిన 209 పరుగుల లక్ష్యాన్ని భారత్ 28 బంతులు మిగిలి ఉండగానే ఛేదించింది. శివమ్ దూబే(18 బంతుల్లో ఫోర్, 3 సిక్స్‌లతో 35 నాటౌట్) దూకుడుగా ఆడాడు. ఈ విజయంతో ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో భారత్ 2-0తో ఆధిక్యంలో నిలిచింది. మూడో టీ20 ఆదివారం గౌహతి వేదికగా జరగనుంది. టీ20 ప్రపంచకప్ ముందు సూర్య ఫామ్ అందుకోవడం అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. మెగా టోర్నీ గెలిచే వరకు సూరీడు ఇదే జోరు కొనసాగించాలని ఆకాంక్షిస్తున్నారు.