టీ20 ప్రపంచకప్ 2024 ఫైనల్ నేర్పిన పాఠంతోనే శ్రీలంక పర్యటనలో శుభారంభం అందుకున్నామని టీమిండియా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ అన్నాడు. ఆఖరి ఓవర్ వరకు విజయం కోసం పోరాడాలనే పాఠాన్ని ఆ అద్భుత మ్యాచ్ నేర్పిందని గుర్తు చేసుకున్నాడు. మూడు టీ20ల సిరీస్‌లో భాగంగా శనివారం జరిగిన తొలి మ్యాచ్‌లో టీమిండియా 43 పరుగుల తేడాతో విజయం సాధించింది.
ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లకు 213 పరుగుల భారీ స్కోర్ చేసింది. సూర్యకుమార్ యాదవ్(26 బంతుల్లో 8 ఫోర్లు, 2 సిక్స్‌లతో 58) హాఫ్ సెంచరీతో రాణించగా.. రిషభ్ పంత్(33 బంతుల్లో 6 ఫోర్లు, సిక్స్‌తో 49), యశస్వి జైస్వాల్(21 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్స్‌లతో 40), శుభ్‌మన్ గిల్(16 బంతుల్లో 6 ఫోర్లు, సిక్స్‌తో 34) ధాటిగా ఆడారు.

30 పరుగులు.. 9 వికెట్లు
శ్రీలంక బౌలర్లలో మతీష పతీరణ(4/40) నాలుగు వికెట్లు తీయగా.. దిల్షాన్ మదుషంక, అసిత ఫెర్నాండో, వానిందు హసరంగా తలో వికెట్ తీసారు.
అనంతరం లక్ష్యచేధనకు దిగిన శ్రీలంక పాతుమ్ నిస్సంక(48 బంతుల్లో 7 ఫోర్లు, 4 సిక్స్‌లతో 79), కుశాల్ మెండీస్(27 బంతుల్లో 7 ఫోర్లు, సిక్స్‌తో 45) సూపర్ బ్యాటింగ్‌తో సునాయసంగా గెలిచేలా కనిపించింది.
14 ఓవర్లలో 140/1 స్కోర్ పటిష్టంగా కనిపించిన ఆ జట్టు తర్వాతి 32 బంతుల్లో 30 పరుగులే చేసి 9 వికెట్లు కోల్పోయి 170 పరుగులకు ఆలౌటై చిత్తుగా ఓడింది. భారత బౌలర్లలో రియాన్ పరాగ్(3/5) మూడు వికెట్లు తీయగా.. అర్ష్‌దీప్ సింగ్, అక్షర్ పటేల్ రెండేసి వికెట్లు పడగొట్టారు. రవి బిష్ణోయ్, మహమ్మద్ సిరాజ్ తలో వికెట్ తీసారు.
ప్రపంచకప్ ఫైనల్ నేర్పిన పాఠం..
ఈ మ్యాచ్ అనంతరం తమ విజయంపై స్పందించిన సూర్యకుమార్ యాదవ్.. శ్రీలంక బ్యాటింగ్ చూసి ఎలాంటి ఒత్తిడికి గురికాలేదన్నాడు. ఏ దశలోనూ గేమ్ చేజారిపోయినట్లు ఫీలవ్వలేదని, శ్రీలంక ఓపెనర్లు అద్భుతంగా బ్యాటింగ్ చేసారని కొనియాడాడు.
'శ్రీలంక ఓపెనర్లు తొలి బంతి నుంచే బ్రాండ్ ఆఫ్ క్రికెట్ ఆడారు. అటాకింగ్ అప్రోచ్‌తో వేగంగా పరుగులు చేశారు. వారి అటాకింగ్ గేమ్‌ను ప్రశంసించాల్సిందే. శ్రీలంక ఓపెనర్లు అసాధారణ ప్రదర్శన చేసినా.. తాము మ్యాచ్ చేజారినట్లు భావించలేదు. ఎందుకంటే టీ20 ప్రపంచకప్‌లో ఇలాంటి పరిస్థితుల నుంచే మేం విజయం సాధించాం.
అది కలిసొచ్చింది..
ఆ మ్యాచ్ మాకు మళ్లీ గుర్తొచ్చింది. ఆఖరి ఓవర్ వరకు విజయం కోసం పోరాడాలనే విషయం తెలిసొచ్చింది. రాత్రి వేళలో పిచ్‌లు ఎలా ఉంటాయో మాకు బాగా తెలుసు. అదృష్టవశాత్తు ఎలాంటి డ్యూ లేదు. 'అని సూర్యకుమార్ యాదవ్ చెప్పుకొచ్చాడు. లెఫ్ట్ రైట్ కాంబినేషన్‌ను కొనసాగిస్తారా? అన్న ప్రశ్నకు జట్టుకు మేలు చేసే ప్రతీ దానిని ఉపయోగించుకుంటామని తెలిపాడు.