For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ఆ ఇద్దరే మా ఓటమిని శాసించారు: సూర్యకుమార్ యాదవ్

సౌతాఫ్రికా మిడిలార్డర్ బ్యాటర్లు డేవిడ్ మిల్లర్, డెవాల్డ్ బ్రెవిస్ అసాధారణ బ్యాటింగ్‌తో తమ ఓటమిని శాసించారని టీమిండియా టీ20 కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ తెలిపాడు. బ్యాటింగ్ వైఫల్యం కూడా తమ విజయవకాశాలను దెబ్బతీసిందన్నాడు. ఐసీసీ టీ20 ప్రపంచకప్ 2026లో భాగంగా అహ్మదాబాద్ వేదికగా ఆదివారం జరిగిన సూపర్-8 మ్యాచ్‌లో సమష్టిగా రాణించిన సౌతాఫ్రికా 76 పరుగుల భారీ తేడాతో టీమిండియాను చిత్తు చేసింది.

చెత్త బ్యాటింగ్‌తోనే..

ఈ మ్యాచ్ అనంతరం తమ పరాజయంపై స్పందించిన సూర్యకుమార్ యాదవ్.. బ్యాటింగ్‌తో పాటు మిడిల్ ఓవర్ల‌లో బౌలింగ్‌ వైఫల్యం తమ పతనాన్ని శాసించిందని అభిప్రాయపడ్డాడు. పవర్ ప్లేలో మెరుగ్గా బ్యాటింగ్ చేసి ఉంటే ఫలితం మరోలా ఉండేదన్నాడు. 'మ్యాచ్ ఆరంభంలో మేం మెరుగైన ప్రదర్శన కనబర్చాం. అద్భుత బౌలింగ్‌తో 21 పరుగులకే 3 వికెట్లు తీసి సౌతాఫ్రికాను కట్టడి చేశాం. కానీ 7 నుంచి 15 ఓవర్లలో సౌతాఫ్రికా బ్యాటర్లు అద్భుతంగా బ్యాటింగ్ చేశారు.

ఆ తర్వాత మేం మళ్లీ పుంజుకొని ఆటలోకి వచ్చాం. మొత్తంగా చూస్తే మా బౌలింగ్ బాగానే ఉంది. కానీ బ్యాటింగ్‌ ఇంకాస్త మెరుగ్గా చేయాల్సింది. 180-185 పరుగుల లక్ష్య ఛేదనలో పవర్ ప్లేలో వీలైనన్ని పరుగులు చేయడం ముఖ్యం. పవర్ ప్లేతోనే మ్యాచ్ గెలవకపోవచ్చు కానీ.. అక్కడే మ్యాచ్‌ను కోల్పోయే ప్రమాదం ఉంటుంది. మేం పవర్ ప్లేలో ఎక్కువ వికెట్లు కోల్పోయాం. దానివల్ల 180-185 పరుగులు ఛేజ్ చేయడానికి అవసరమైన చిన్న చిన్న భాగస్వామ్యాలను కూడా నెలకొల్పలేకపోయాం. అయితే ఇది ఆటలో భాగమే. మేం ఈ ఓటమి నుంచి నేర్చుకుంటాం. మా ఆటను సమీక్షించుకుని మళ్ళీ బలంగా తిరిగి వస్తాం.

Suryakumar Yadav Points to Powerplay Collapse and Middle-Overs Bowling for Defeat Against South Africa in T20 WC Super-8 Clash
Photo Credit: screen grab for JioHotstar

డేంజరస్ జోడీ..

బుమ్రా, అర్ష్‌దీప్‌ల కాంబినేషన్ ఎంత ప్రమాదకరమైదో అందరికి తెలుసు. వారిద్దరూ కలిసి చాలా కాలంగా ఆడుతున్నారు. ఈరోజు కూడా ఇద్దరూ కలిసి ఎనిమిది ఓవర్లు వేసి, దాదాపు ఐదు వికెట్లు పడగొట్టారు. కేవలం 45-50 పరుగులు మాత్రమే ఇచ్చారు. వారిద్దరూ జోడీగా అద్భుతంగా బౌలింగ్ చేశారు. మేం వారి నుంచి కోరుకునేది కూడా ఇదే. వారిద్దరూ అనుభవజ్ఞులు, వారు మా జట్టులో ఉండటం చాలా మంచి విషయం.

జింబాబ్వేతో తదుపరి మ్యాచ్‌లో మెరుగైన ప్రదర్శన కనబరుస్తాం. ఈ ఓటమిని ఇక్కడే మర్చిపోయి స్వేచ్ఛగా బ్యాటింగ్ చేయడంతో పాటు బౌలింగ్, ఫీల్డింగ్‌లో రాణిస్తాం. మా ఆట సింపుల్‌గా ఉండేలా చూసుకుంటాం. మేం ఆడాలనుకుంటున్న శైలిలోనే ఆడుతాం. అందులో ఏ మార్పు ఉండదు. మేం బలంగా తిరిగి వస్తామని ఆశిస్తున్నా.'అని సూర్యకుమార్ యాదవ్ చెప్పుకొచ్చాడు.

మిల్లర్.. కిల్లర్

ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన సౌతాఫ్రికా నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లకు 187 పరుగులు చేసింది. డేవిడ్ మిల్లర్‌ (35 బంతుల్లో 7 ఫోర్లు, 3 సిక్స్‌లతో 63) హాఫ్ సెంచరీతో రాణించగా.. డెవాల్డ్ బ్రెవిస్(29 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్స్‌లతో 45), ట్రిస్టన్ స్టబ్స్(24 బంతుల్లో ఫోర్, 3 సిక్స్‌లతో 44 నాటౌట్) దూకుడుగా ఆడారు. భారత బౌలర్లలో జస్‌ప్రీత్ బుమ్రా(3/15) మూడు వికెట్లతో సత్తా చాటగా.. అర్ష్‌దీప్ సింగ్(2/28) రెండు వికెట్లు పడగొట్టాడు. వరుణ్ చక్రవర్తీ, శివమ్ దూబే చెరో వికెట్ తీసారు.

అనంతరం టీమిండియా 18.5 ఓవర్లలో 111 పరుగులకు ఆలౌటైంది. శివమ్ దూబే(37 బంతుల్లో ఫోర్, 3 సిక్స్‌లతో 42 నాటౌట్) ఒక్కడే ఒంటరి పోరాటం చేయగా.. మిగతా బ్యాటర్లు దారుణంగా విఫలమయ్యారు. సౌతాఫ్రికా బౌలర్లలో మార్కో యాన్సెన్(4/22) నాలుగు వికెట్లు, కేశవ్ మహరాజ్(3/24) మూడు వికెట్లతో టీమిండియా పతనాన్ని శాసించారు. కార్బిన్ బోష్ రెండు వికెట్లు తీయగా.. ఎయిడెన్ మార్క్‌రమ్ ఒక వికెట్ పడగొట్టాడు.

Story first published: Sunday, February 22, 2026, 23:43 [IST]
Other articles published on Feb 22, 2026
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+