నా కెప్టెన్సీలో ఒక్క సిరీస్ ఓడిపోలేదు... డిప్రెషన్‌కు గురయ్యా: సూర్యకుమార్ యాదవ్
ఐసీసీ టీ20 ప్రపంచకప్ 2026 గెలిపించినా.. టీమిండియా టీ20 కెప్టెన్సీ బాధ్యతల నుంచి తనను తప్పించడంపై సూర్యకుమార్ యాదవ్ తొలి సారి స్పందించాడు. ఈ నిర్ణయాన్ని తాను అస్సలు ఊహించలేదని చెప్పాడు.మరో రెండేళ్ల పాటు తానే కెప్టెన్‌గా కొనసాగుతానని భావించానని తెలిపాడు. తన కెప్టెన్సీలో టీమిండియా ఒక్క సిరీస్ కూడా ఓడిపోలేదని సూర్యకుమార్ యాదవ్ గుర్తు చేశాడు.
అయితే ఈ నిర్ణయాన్ని తాను తప్పుబట్టడం లేదని కూడా చెప్పుకొచ్చాడు. కానీ ఈ నిర్ణయాన్ని జీర్ణించుకోవడం తనకు కష్టమైందని అంగీకరించాడు. ఐసీసీ టీ20 ప్రపంచకప్ 2026 విజయానంతరం టీమిండియా టీ20 కెప్టెన్సీ బాధ్యతల నుంచి సూర్యకుమార్ యాదవ్‌ను తప్పించి శ్రేయస్ అయ్యర్‌ను నూతన సారథిగా ఎంపిక చేసిన సంగతి తెలిసిందే. గత రెండేళ్లుగా సూర్యకుమార్ యాదవ్ బ్యాటింగ్‌లో తీవ్రంగా ఇబ్బంది పడటంతో అతన్ని కెప్టెన్సీతో పాటు జట్టు నుంచి తప్పించారు.

నా పేరు లేదని తెలిసి నవ్వుకున్నా..
తాజాగా ఆకాశ్ చోప్రా యూట్యూబ్ ఛానెల్‌లో మాట్లాడిన సూర్యకుమార్ యాదవ్.. తనను జట్టు నుంచి తప్పించడం పట్ల ఎలాంటి బాధ లేదన్నాడు. ఇప్పటి వరకు తనకు లభించిన అవకాశాల పట్ల తాను సంతోషంగా ఉన్నానని చెప్పుకొచ్చాడు. 'జట్టులో నా పేరు లేకపోవడం చూసి నవ్వుకున్నాను. ఎందుకంటే ప్రతికూల పరిస్థితుల్లో నవ్వుతూ ఉండటం నాకు అలవాటే. గత ఏడాదిన్నరగా క్లిష్ట పరిస్థితులను ఎదురైనప్పుడు ఎన్నోసార్లు ఇదే చేశాను. ప్రశాంతంగా ఉన్నాను. నాకు ఆడే అవకాశాలు లభించిన ప్రతీసారి కృతజ్ఞతతోనే ఉన్నాను.
మరో రెండేళ్లు నేనే కెప్టెన్ అనుకున్నా..
వాస్తవానికి కెప్టెన్సీ బాధ్యతల నుంచి నన్ను తొలగిస్తారని నేను ఊహించలేదు. మరో రెండేళ్ల పాటు నేను కెప్టెన్‌గా కొనసాగుతానని భావించాను. అప్‌కమింగ్ టీ20 ప్రపంచకప్ 2028తో పాటు ఒలింపిక్స్ కూడా ఆడుతానని అనుకున్నా. కానీ మనం అనుకున్నట్లు ఇతరులు అనుకోరు కదా? వారి అభిప్రాయాలను కూడా గౌరవించాలి. జట్టు భవిష్యత్తుకు ఇదే సరైన నిర్ణయమని భావించి వారు ఈ నిర్ణయం తీసుకున్నారు. కాబట్టి ఆ నిర్ణయాన్ని నేను తప్పుబట్టలేను. నాకు బదులుగా మరోకరి నాయకత్వంలో జట్టు మెరుగ్గా రాణిస్తే.. నాకు ఎలాంటి అభ్యంతరం లేదు.
డిప్రెషన్‌కు గురయ్యా..
ఐర్లాండ్, ఇంగ్లండ్ సిరీస్‌లకు ఎంపిక చేసి జట్టును చూశాను. నేను శ్రేయస్ అయ్యర్‌తో చాలా క్రికెట్ ఆడాను. అతను గొప్ప ఆటగాడు. మంచి వ్యక్తి. మంచి కెప్టెన్ కూడా. అందుకే అతన్ని కెప్టెన్ చేయడాన్ని నేను తప్పుబట్టలేదు. కానీ ఈ నిర్ణయంతో నేను నిరాశకు గురయ్యాననే విషయం మాత్రం వాస్తవం. ఎందుకంటే గత రెండేళ్లలో మేం ఒక్క సిరీస్ కోల్పోలేదు. నా సారథ్యంలో టీమిండియా ప్రపంచకప్, ఆసియా కప్ గెలిచింది. అంతా సవ్యంగా సాగుతున్నప్పుడు ఈ మార్పు చేయాల్సిన అవసరం ఏంటనే ప్రశ్నలు నన్ను వెంటాడుతూనే ఉన్నాయి.
నేను నెలన్నర పాటు ఇంట్లో ఖాళీగా కూర్చున్నాను. మనో వేధనతో బాధపడ్డా. ఇలా ఎలా అయిపోయిందని ఆలోచిస్తూ కూర్చున్నాను. మేం ప్రపంచకప్ గెలిచాం. ఐపీఎల్‌లో నేను ఆశించినంత రీతిలో రాణించలేదు. నేను ఇంట్లో ఉన్నప్పుడు స్నేహితులు, బంధువులు వచ్చారు. జీవితంలో ఇదంతా సహజం, వదిలేసి ముందుకు సాగండని ఓదార్చారు. కానీ వారు ఇంటి నుంచి వెళ్లిపోయిన తర్వాత మళ్లీ ఒంటరిగా కూర్చునేవాడిని. ఆ వేదన మరింత ఎక్కువయ్యేది.
మూడు రోజుల ముందే చెప్పారు..
భారత జట్టును ప్రకటించడానికి 2 3 రోజుల ముందు సెలెక్టర్లు నాకు ఫోన్ చేశారు. 'ఇక తదుపరి దశకు వెళ్లాల్సిన సమయం వచ్చింది'అని అన్నారు. నేను ఎలాంటి అభ్యంతరం చెప్పలేదు. ఎందుకంటే అది నా తప్పు కాదు. జట్టుకు మేలు చేస్తుందని వారు ఈ నిర్ణయం తీసుకొని ఉండొచ్చు. అదే విషయాన్ని నాకు చెప్పారు. టీమిండియా తరఫున ఆడేందుకు నేను సిద్దంగా ఉన్నాను. ఏ సమయంలో పిలిచినా వస్తా. ఎప్పుడైనా .. ఎక్కడైనా క్రికెట్ ఆడుతా.'అని సూర్యకుమార్ యాదవ్ చెప్పుకొచ్చాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications

