For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

IND vs NZ: ఇషాన్, సూర్య ఊచకోత.. చిత్తుగా ఓడిన న్యూజిలాండ్!

న్యూజిలాండ్‌తో ఐదు టీ20ల సిరీస్‌లో టీమిండియా జోరు కొనసాగుతోంది. వరుసగా రెండో మ్యాచ్‌లోనూ టీమిండియా ఏకపక్ష విజయాన్ని నమోదు చేసింది. రాయ్‌పూర్ వేదికగా శుక్రవారం జరిగిన రెండో టీ20లో సమష్టిగా రాణించిన టీమిండియా 7 వికెట్ల తేడాతో న్యూజిలాండ్‌ను మట్టికరిపించింది. కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్(37 బంతుల్లో 9 ఫోర్లు, 4 సిక్స్‌లతో 82 నాటౌట్), ఇషాన్ కిషన్(32 బంతుల్లో 11 ఫోర్లు, 4 సిక్స్‌లతో 76) ఊచకోతతో భారత ఏకపక్ష విజయాన్ని అందుకుంది.

ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లకు 208 పరుగులు చేసింది. కెప్టెన్ మిచెల్ సాంట్నర్(27 బంతుల్లో 6 ఫోర్లు, సిక్స్‌తో 47 నాటౌట్), రచిన్ రవీంద్ర(26 బంతుల్లో 2 ఫోర్లు, 4 సిక్స్‌లతో 44) టాప్ స్కోరర్లుగా నిలిచారు. భారత బౌలర్లలో కుల్దీప్ యాదవ్(2/35) రెండు వికెట్లు తీయగా.. హార్దిక్ పాండ్యా, హర్షిత్ రాణా, వరుణ్ చక్రవర్తీ, శివమ్ దూబే తలో వికెట్ తీసారు.

Suryakumar Yadav Ishan Kishan Shine as India Secure 7-Wicket Victory in 2nd T20I vs New Zealand

అనంతరం భారత్ 15.2 ఓవర్లలో 3 వికెట్లకు 209 పరుగులు చేసి 28 బంతులు మిగిలి ఉండగానే విజయాన్ని కైవసం చేసుకుంది. ఓపెనర్లు సంజూ శాంసన్(6), అభిషేక్ శర్మ(0) విఫలమైనా.. ఇషాన్ కిషన్, సూర్య, శివమ్ దూబే(18 బంతుల్లో ఫోర్, 3 సిక్స్‌లతో 35 నాటౌట్) విధ్వంసకర బ్యాటింగ్‌తో చెలరేగారు. న్యూజిలాండ్ బౌలర్లలో మ్యాట్ హెన్రీ, జాకోబ్ డఫీ, ఇష్ సోధీ తలో వికెట్ తీసారు. ఈ విజయంతో ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో భారత్ 2-0తో ఆధిక్యంలో నిలిచింది. మూడో టీ20 ఆదివారం గౌహతి వేదికగా జరగనుంది.

విఫలమైన ఓపెనర్లు..

209 పరుగుల భారీ లక్ష్య ఛేదనలో టీమిండియాకు ఊహించని షాక్ తగిలింది. ఓపెనర్లు సంజూ శాంసన్(6), అభిషేక్ శర్మ(0) వెనువెంటనే పెవిలియన్ చేరారు. భారీ సిక్సర్‌తో ఇన్నింగ్స్ ప్రారంభించిన సంజూ శాంసన్(6)ను మ్యాట్ హెన్రీ తొలి ఓవర్‌లోనే ఔట్ చేయగా.. మరుసటి ఓవర్ తొలి బంతికే అభిషేక్ శర్మ(0)ను జాకో డఫీ గోల్డెన్ డక్‌గా పెవిలియన్ చేర్చాడు. దాంతో 6 పరుగులకే 2 వికెట్లు కోల్పోయి టీమిండియా పీకల్లోతు కష్టాల్లో పడింది. ఈ పరిస్థితుల్లో క్రీజులోకి వచ్చిన ఇషాన్ కిషన్, సూర్యకుమార్ యాదవ్ జట్టును ఆదుకున్నారు.

మలుపు తిప్పిన జాక్ ఫోక్స్

జాక్ ఫోక్స్ వేసిన మూడో ఓవర్‌‌లో మ్యాచ్‌ మలుపు తిరిగింది. అతని వైఫల్యం టీమిండియాపై ఉన్న ఒత్తిడిని తగ్గించింది. ఈ ఓవర్ తొలి బంతిని వేసే క్రమంలో ఫోక్స్ చేతి.. నాన్ స్ట్రైకర్ స్టంప్స్‌ను తాకింది. దాంతో అంపైర్ నోబాల్ ఇచ్చాడు. ఈ నోబాల్‌ను ఇషాన్ కిషన్ బౌండరీ తరలించాడు. నోబాల్‌తో లభించిన ఫ్రీహిట్ అడ్డుకోవాలనే ప్రయత్నంలో జాక్ ఫోక్స్ వరుసగా రెండు వైడ్స్ సంధించాడు. మరుసటి బంతిని ఇషన్ కిషన్ మరో బౌండరీ కొట్టడంతో ఒక లీగల్ డెలవరికి 11 పరుగులు(4nb, wd, wd,4) వచ్చినట్లు అయ్యింది. ఇదే ఓవర్‌లో మరో బౌండరీతో పాటు సిక్స్ బాదిన ఇషాన్ కిషన్ ఈ ఓవర్‌లో మొత్తం 24 పరుగులు పిండుకున్నాడు. దాంతో మూమెంటమ్ మొత్తం భారత్ వైపు మళ్లింది.

అదే జోరును కొనసాగించిన ఇషాన్ కిషన్ న్యూజిలాండ్ బౌలర్లపై విరుచుకుపడ్డాడు. మ్యాట్ హెన్రీ బౌలింగ్‌లో వరుసగా 6, 4, 4 బాది 21 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. అనంతరం మరింత ధాటిగా ఆడిన అతన్ని ఇష్ సోధీ క్యాచ్ ఔట్‌గా పెవిలియన్ చేర్చాడు. దాంతో మూడో వికెట్‌కు నమోదైన 122 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది. ఇషాన్ కిషన్ ఇన్నింగ్స్‌కు ఫిదా అయిన సూర్య అతన్ని హగ్ చేసుకొని మరి సెండాఫ్ ఇచ్చాడు.

ఉదయించిన సూరీడు..

ఇషాన్ ఔటైన వెంటనే సూరీడు తన ఊచకోత మొదలు పెట్టాడు. శివమ్ దూబేతో కలసి కివీస్ బౌలర్లపై విరుచుకుపడ్డాడు. తనకే సాధ్యమై 360 బ్యాటింగ్‌తో బంతిని మైదానం నలుమూలల తరలించాడు. ఈ క్రమంలో అతను 23 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకొని 468 రోజుల నిరీక్షణకు తెరదించాడు. గత 24 ఇన్నింగ్స్‌ల్లో సూర్యకు ఇదే తొలి హాఫ్ సెంచరీ. ఈ ఇన్నింగ్స్‌తో విమర్శకుల నోర్లు మూయించాడు. శివమ్ దూబే కూడా బ్యాట్‌కు పనిచెప్పడంతో 28 బంతులు మిగిలి ఉండగానే టీమిండియా విజయాన్ని కైవసం చేసుకుంది.

Story first published: Friday, January 23, 2026, 22:39 [IST]
Other articles published on Jan 23, 2026
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+