ఐసీసీ టీ20 ప్రపంచకప్ 2026లో భాగంగా పాకిస్థాన్‌తో విజయానంతరం టీమిండియా స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ కోపంగా కనిపించడం తీవ్ర చర్చనీయాంశమైంది. హార్దిక్ పాండ్యా బౌలింగ్‌లో ఈజీ క్యాచ్ వదిలేసినందుకు అతనితో పాటు కెప్టెన్ సూర్య ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఈజీ క్యాచ్ పట్టకపోతే ఎలా అంటూ మందలించాడు.
ఈ విజయానంతరం ఆటగాళ్లు పరస్పరం అభినందనలు తెలుపుకొనే సమయంలో సూర్య చేయి కలపబోగా.. కుల్దీప్ యాదవ్ పట్టించుకోకుండా వెళ్లిపోయాడు. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. సూర్యకుమార్ యాదవ్, కుల్దీప్ యాదవ్ మధ్య విభేదాలు ఉన్నట్లు వార్తలు వచ్చాయి.
మున్ముందు జట్టులోని ఆటగాళ్ల మధ్య సంబంధాలు ఎలా ఉంటాయో అని భారత అభిమానులు కంగారు పడ్డారు. అయితే ఈ వార్తలకు సూర్యకుమార్ యాదవ్ తనదైన శైలిలో ఫుల్ స్టాప్ పెట్టాడు. మ్యాచ్‌లో జరిగిన విషయాలను మరిచిపోయి ఇద్దరూ కలిసిపోయామని అభిమానులకు తెలియజేశాడు.

పాకిస్థాన్‌తో మ్యాచ్ అనంతరం తమ మధ్య చోటు చేసుకున్న ఘటనను సూర్య, కుల్దీప్ యాదవ్ ఫన్నీగా రీక్రియేట్ చేశారు. ఈ రీల్‌ను సూర్య సోషల్ మీడియా వేదికగా పంచుకున్నాడు. ఈ వీడియోకు 'కోపం తగ్గించుకో భాయ్'అని క్యాప్షన్‌ను పేర్కొన్నాడు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.
పాకిస్థాన్ ఇన్నింగ్స్ సందర్భంగా హార్దిక్ పాండ్యా వేసిన 18వ ఓవర్‌లో షాహిన్ అఫ్రిది ఇచ్చిన రెండు క్యాచ్‌లను ఇషాన్ కిషన్, కుల్దీప్ యాదవ్ వరుసగా వదిలేసారు. ఈ ఓవర్ తొలి బంతి షాహిన్ అఫ్రిది గ్లోవ్స్ తాకుతూ కీపర్ వైపు వెళ్లగా ఇషాన్ అందుకోలేకపోయాడు. ఆ మరుసటి బంతినే షాహిన్ అఫ్రిది భారీ షాట్ ఆడగా.. లాంగాన్‌లో ఫీల్డింగ్ చేస్తున్న కుల్దీప్ యాదవ్ చేతిలో నుంచి జారి బౌండరీ బయట పడింది. క్యాచ్ వదిలేయడంతో పాటు కుల్దీప్ సిక్సర్‌ను కూడా అడ్డుకోలేకపోయాడు. దాంతో తీవ్ర అసహనానికి గురైన హార్దిక్ పాండ్యా.. ముందు వాడు.. ఇప్పుడు నువ్వు.. ఏడ మోపైర్రా నాకు అని అసహనం వ్యక్తం చేశాడు.
ఈ మ్యాచ్ అనంతరం కుల్దీప్ యాదవ్‌ను హార్దిక్ పాండ్యాతో పాటు సూర్యకుమార్ యాదవ్ మందలించాడు. ఈజీ క్యాచ్ పట్టకపోతే ఎలా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. సాధారణంగా కుల్దీప్ యాదవ్ లాంగాన్‌లో ఫీల్డింగ్ చేయడు. కానీ అప్పటికే భారత విజయం లాంఛనం కావడంతో ప్రాక్టీస్ కోసం అతన్ని లాంగాన్‌లో ఉంచారు. కానీ అతను సునాయస క్యాచ్‌ను నేలపాలు చేయడంతో పాటు సిక్సర్‌ను అడ్డుకోలేకపోయాడు. భారత్ విజయం ఖాయమైంది కాబట్టి ఎలాంటి నష్టం జరగ లేదు. కానీ కీలక మ్యాచ్‌ల్లో ఇలాంటి ఈజీ క్యాచ్‌లు వదిలేస్తే ఎలా? అని సూర్య ఆందోళన వ్యక్తం చేశాడు. కుల్దీప్ యాదవ్ ఫీల్డింగ్‌లో వీక్ అనే సంగతి తెలిసిందే. ఈ కారణంతోనే గతంలో రోహిత్ శర్మ చేతిలో కూడా అతను తిట్లు తిన్నాడు.