ఐదు టీ20ల సిరీస్‌లో భాగంగా న్యూజిలాండ్‌తో జరుగుతున్న రెండో టీ20లో టీమిండియా టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. డ్యూ ప్రభావం నేపథ్యంలోనే ఈ నిర్ణయం తీసుకున్నానని టీమిండియా టీ20 కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ తెలిపాడు. ఈ మ్యాచ్ నుంచి బుమ్రాకు విశ్రాంతి కల్పించామని చెప్పిన సూర్య.. గాయంతో అక్షర్ పటేల్ దూరమయ్యాడని పేర్కొన్నాడు.
'మేం ముందుగా బౌలింగ్ చేస్తాం. ఇక్కడ అప్పుడే మంచు కురుస్తోంది. మేం ఈ మధ్య కాలంలో లక్ష్యాన్ని ఛేజ్ చేయలేదు. అందుకే ఇప్పుడు ఛేజింగ్ చేయాలనుకుంటున్నాం. పిచ్ చూడటానికి బాగుంది. మేం ఆడే ప్రతీ మ్యాచ్‌లోనూ.. అన్ని విభాగాల్లో మెరుగవ్వడానికి ప్రయత్నిస్తున్నాం. ఈ మ్యాచ్‌లో కూడా అన్ని రంగాల్లో అలాగే రాణించడానికి ప్రయత్నిస్తాం. మా తుది జట్టులో రెండు మార్పులు జరిగాయి. అక్షర్ పటేల్‌కు గత మ్యాచ్‌లో గాయమైంది. బుమ్రాకు ఈ మ్యాచ్ నుంచి విశ్రాంతి కల్పిచాం.'అని సూర్యకుమార్ యాదవ్ తెలిపాడు.

మరోవైపు టాస్ గెలిస్తే తాము కూడా బౌలింగ్ చేయాలనుకున్నామని న్యూజిలాండ్ కెప్టెన్ మిచెల్ సాంట్నర్ అన్నాడు. 'మేం కూడా ముందుగా బౌలింగ్ చేయాలనుకున్నాం. మైదానంలో అప్పుడే మంచు కురుస్తుంది. పరిస్థితి మాకేమి అంత అనుకూలంగా మారుతుందని నేను అనుకోవడం లేదు. స్వదేశీ పరిస్థితుల్లో ఇలాంటి నాణ్యమైన జట్టుతో ఆడుతున్నప్పుడు, ప్రతీసారి ఎంతో కొంత నేర్చుకోవాల్సి ఉంటుంది.
మేం కూడా నేర్చుకున్నాం. ముఖ్యంగా భారత బ్యాటర్లు ఇన్నింగ్స్ మొత్తం బ్యాటింగ్‌తో విరుచుకుపడ్డారు. బౌలింగ్‌లో మేం ఏం చేయాలో ఇప్పుడు మాకు అర్థమైంది. మా ప్రణాళికల విషయంలో మేం మరింత స్పష్టంగా ఉండి, వారిని కట్టడి చేయడానికి ప్రయత్నించాలి. మా జట్టులో మూడు మార్పులు జరిగాయి. రాబర్ట్‌సన్ స్థానంలో సీఫెర్ట్, క్రిస్టియన్ క్లార్క్ స్థానంలో జక్ ఫోల్క్స్, జేమీసన్ స్థానంలో మాట్ హెన్రీ జట్టులోకి వచ్చారు.'అని మిచెల్ సాంట్నర్ చెప్పుకొచ్చాడు.
న్యూజిలాండ్: డెవాన్ కాన్వే, టిమ్ సీఫెర్ట్ (వికెట్ కీపర్), రచిన్ రవీంద్ర, గ్లెన్ ఫిలిప్స్, మార్క్ చాప్‌మన్, డారిల్ మిచెల్, మిచెల్ సాంట్నర్ (కెప్టెన్), జకారీ ఫోల్క్స్, మాట్ హెన్రీ, ఇష్ సోధి, జాకబ్ డఫీ.
భారత్: సంజు శామ్సన్ (వికెట్ కీపర్), అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్, సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), హార్దిక్ పాండ్యా, శివమ్ దూబే, రింకూ సింగ్, హర్షిత్ రాణా, అర్ష్‌దీప్ సింగ్, కుల్దీప్ యాదవ్, వరుణ్ చక్రవర్తి.