టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యాతో తనకు ఎలాంటి గొడవలు లేవని టీ20 కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ అన్నాడు. టీ20 కెప్టెన్సీ అనేది తనకు దక్కిన అదనపు బాధ్యత మాత్రమేనని స్పష్టం చేశాడు. ఇంగ్లండ్‌తో ఐదు టీ20ల సిరీస్‌కు టీమిండియా సిద్దమైన విషయం తెలిసిందే. ఈ సిరీస్‌లో భాగంగా బుధవారం తొలి మ్యాచ్ జరగనుంది.
ఈ సిరీస్‌కు ఎంపిక చేసిన జట్టులో హార్దిక్ పాండ్యాకు కాకుండా అక్షర్ పటేల్‌కు వైస్ కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించారు. వైస్ కెప్టెన్సీ హార్దిక్ పాండ్యాకు ఇవ్వాలని గౌతమ్ గంభీర్ సూచించినా.. రోహిత్ శర్మ, చీఫ్ సెలెక్టర్ అగార్కర్ వినలేదని వార్తలు వచ్చాయి. ఇక రోహిత్ శర్మకు డిప్యూటిగా వ్యవహరించిన హార్దిక్ పాండ్యా.. అతని గైర్హాజరీలో టీమిండియా టీ20 సారథిగా వ్యవహరించాడు.

టీ20 ప్రపంచకప్ 2024 విజయానంతరం రోహిత్ శర్మతో పాటు విరాట్ కోహ్లీ ఈ ఫార్మాట్‌కు వీడ్కోలు పలకడంతో హార్దిక్ పాండ్యా సారథ్య బాధ్యతలు చేపడుతాడని అంతా అనుకున్నారు. కానీ ఫిట్‌నెస్ సమస్యలను సాకుగా చూపిస్తూ.. హార్దిక్ పాండ్యాను కెప్టెన్సీ బాధ్యతల నుంచి తప్పించి సూర్యకుమార్ యాదవ్‌కు అప్పగించారు. దాంతో సూర్య, హార్దిక్ పాండ్యా మధ్య బేధాభిప్రాయాలు ఉన్నాయనే ప్రచారం జోరు అందుకుంది.
ఐపీఎల్ 2024 సీజన్‌లో ముంబై ఇండియన్స్ సారథిగా ఉన్న హార్దిక్ పాండ్యాకు సూర్యతో పాటు ఇతర ఆటగాళ్లు సహకరించలేదని ప్రచారం జరిగింది. ఈ క్రమంలోనే మంగళవారం మీడియాతో మాట్లాడిన సూర్యకుమార్ యాదవ్.. హార్దిక్ పాండ్యాతో తనకు విభేదాలు ఉన్నాయనే ప్రచారాన్ని ఖండించాడు. తామిద్దరం మంచి స్నేహితులమని స్పష్టం చేశాడు.
'హార్దిక్ పాండ్యాతో నా రిలేషన్ బాగుంది. టీ20 కెప్టెన్సీ అనేది నాకు దక్కిన అదనపు బాధ్యత మాత్రమే. టీమ్ లీడర్‌షిప్ గ్రూప్‌లో హార్దిక్ పాండ్యా కూడా ఓ భాగమే. మేమిద్దరం మంచి స్నేహితులం.'అని సూర్య బదులిచ్చాడు.
ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025 కోసం ఎంపిక చేసిన భారత జట్టులో చోటు దక్కకపోవడంపై కూడా సూర్యకుమార్ యాదవ్ స్పందించాడు. ఈ జట్టులో చోటు దక్కనందుకు తనకేం బాధలేదన్నాడు. బాగా ఆడనప్పుడు బాధపడటం ఎందుకు? అని ప్రశ్నించాడు.
'నేను ఎందుకు బాధపడుతాను? ఒకవేళ నేను బాగా ఆడి ఉంటే ఛాంపియన్స్ ట్రోఫీ జట్టులో ఉండేవాడిని. నేను బాగా ఆడనప్పుడు దాన్ని అంగీకరించడం ముఖ్యం. అదే సమయంలో ఛాంపియన్స్ ట్రోఫీ జట్టును గమనిస్తే.. చూడటానికి జట్టు బాగుంది. జట్టులో ఉన్న వారంతా అద్భుతమైన ఆటగాళ్లు. వన్డే ఫార్మాట్‌లో టీమిండియా తరఫున అద్భుత ప్రదర్శన కనబర్చారు.
దేశవాళీ క్రికెట్‌లోనూ రాణించారు. వారి ఎంపిక పట్ల నేను సంతోషంగా ఉన్నాను. వన్డే ఫార్మాట్‌లో నేను రాణించనందుకు బాధగా ఉంది. వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకోలేకపోయాను. ఒకవేళ నేను మెరుగ్గా ఆడి ఉంటే జట్టులో ఉండేవాడిని. నేను బాగా రాణించనప్పుడు మెరుగ్గా ఆడే ఆటగాడు ఆ స్థానానికి అర్హుడు.'అని సూర్యకుమార్ యాదవ్ చెప్పుకొచ్చాడు.