టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ ఇచ్చిన సలహాతోనే ఓటమి నుంచి గట్టెక్కామని టీ20 కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ అన్నాడు. స్లో పిచ్ అని, చివరి వరకు బ్యాటింగ్ చేయాలని బ్రేక్ సమయంలో గంభీర్ సలహా ఇచ్చాడని, ఆయన సూచనలతోనే తాను ఆఖరి వరకు క్రీజులో ఉండి బ్యాటింగ్ చేశానని తెలిపాడు. అతని సలహా జట్టు విజయానికి కలిసొచ్చిందని సూర్య అభిప్రాయపడ్డాడు.
ఐసీసీ టీ20 ప్రపంచకప్ 2026లో భాగంగా అమెరికాతో వాంఖడే మైదానం వేదికగా జరిగిన తమ తొలి మ్యాచ్‌లో భారత్ 29 పరుగులతో గట్టెక్కిన సంగతి తెలిసిందే. 77 పరుగులకే 6 వికెట్లు కోల్పోయి కష్టాల్లో ఉన్న జట్టును సూర్యకుమార్ యాదవ్(49 బంతుల్లో 10 ఫోర్లు, 4 సిక్స్‌లతో 84 నాటౌట్) ఒక్కడే అజేయ హాఫ్ సెంచరీతో గట్టెక్కించాడు. సూర్య సూపర్బ్ బ్యాటింగ్‌తో 161 పరుగులు చేసిన భారత్.. బౌలర్ల అసాధారణ ప్రదర్శనతో విజయాన్నందుకుంది. మ్యాచ్ విన్నింగ్ ప్రదర్శన కనబర్చిన సూర్యకుమార్ యాదవ్‌కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డ్ దక్కింది.
ఈ సందర్భంగా మాట్లాడిన సూర్య.. ఇలాంటి పరిస్థితుల్లో ఆడటం తనకు కొత్త కాదని తెలిపాడు. ముంబై పిచ్‌లపై ఎలా బ్యాటింగ్ చేయాలో తనకు మంచి అవగాహన ఉందని చెప్పాడు. 'ఏదో ఒక రోజు నేను ఇలాంటి మ్యాచ్ విన్నింగ్ ఇన్నింగ్స్ ఆడుతానని నాకు తెలుసు. గతేడాది మొత్తం జట్టు కోసం ఇలాంటి ఇన్నింగ్స్ ఆడేందుకు చాలా ప్రయత్నించాను. కానీ కుదరలేదు. గతేడాది సౌతాఫ్రికాతో సిరీస్ అనంతరం నేను బ్యాటింగ్ వైఫల్యం గురించి ఆలోచించడం మానేశాను. కిట్ బ్యాగ్ పక్కన పెట్టేసి, రెండు వారాల పాటు కుటుంబంతో సరదాగా గడిపాను.

ఆ తర్వాత కొత్త ఏడాదిలో నాగ్‌పూర్ వెళ్లినప్పుడు విభిన్నమైన అనుభూతి కలిగింది. 77 పరుగులకే 6 వికెట్లు కోల్పోవడంతో ఎవరో ఒక బ్యాటర్ ఆఖరి వరకు ఉండాలని నేను ఎప్పుడూ భావిస్తుంటాను. అంతేకాకుండా ఇది 180-190 పరుగుల వికెట్ కాదని గుర్తించాం. ఇది కేవలం 140 పరుగుల పిచ్ అని నమ్మాం. 14 ఓవర్ల తర్వాత బ్రేక్ సమయంలో గౌతీ భాయ్(గంభీర్) నాకు ఇదే చెప్పాడు. చివరి వరకు బ్యాటింగ్ చేయడానికి ప్రయత్నించాలని సూచించాడు. ఆ తర్వాత స్కోర్ కవర్ చేయవచ్చని తెలిపాడు.
అన్నింటికంటే ముఖ్యమైన విషయం ఏంటంటే నేను ముంబైలో చాలా క్రికెట్ ఆడాను. ఇక్కడి పిచ్‌లు, ముంబై మైదానాల గురించి నాకు బాగా తెలుసు. అందుకే ఇలాంటి స్లో వికెట్స్‌పై ఎలా ఆడాలో నాకు మంచి అవగాహన ఉంది. 77/6 స్కోర్ నుంచి చివరి వరకు బ్యాటింగ్ చేయడం అంటే ఎవరో ఒకరు క్రీజులో ఉండాలని భావించాను. ఆ సమయంలో ఎవరూ బౌలింగ్ చేస్తున్నారు. ఇంకా ఎన్ని బంతులు మిగిలి ఉన్నాయని లెక్కిస్తూ.. నా సహజమైన షాట్లు ఆడటానికి ప్రయత్నించాను.
వాస్తవానికి 77 పరుగులకే 6 వికెట్లు కోల్పోయిన స్థితిలో నేను ఎంత ఒత్తిడికి లోనయ్యానో నాకు మాత్రమే తెలుసు. కానీ అదే సమయంలో గతంలో ఇలాంటి పరిస్థితుల్లో చాలా సార్లు బ్యాటింగ్ చేశానని గుర్తు చేసుకున్నాను. నేను ముంబైలోని ఆజాద్ మైదాన్, క్రాస్ మైదాన్ వంటి గ్రౌండ్లలో చాలా క్రికెట్ ఆడాను. కాబట్టి నేను చివరి వరకు బ్యాటింగ్ చేస్తే, మ్యాచ్ ఫలితాన్ని మార్చగలనని గ్రహించాను.
వాంఖడేలో ఎప్పుడూ ఉండే పిచ్ కంటే ఇది కొంచెం భిన్నంగా ఉంది. అయితే ఈ రోజు ఉదయం మేము నిద్రలేవగానే బయట చూసినప్పుడు ఎండ అంతగా లేదు. క్యూరేటర్, గ్రౌండ్స్‌మెన్ ఉత్తమమైన పిచ్‌ను సిద్ధం చేయడానికి తమ వంతు ప్రయత్నం చేశారు. కానీ కొన్ని విషయాలు వారి చేతుల్లో ఉండవు. పిచ్‌ను సరిగ్గా రోలింగ్ చేయడానికి లేదా నీళ్లు పట్టడానికి తగినంత ఎండ లేదు. బహుశా ఆ కారణం వల్ల పిచ్ ఇలా మారి ఉండవచ్చు, కానీ మేం ప్రతిదానిని సాకుగా చెప్పలేం. మేం ఇంకాస్త మెరుగ్గా బ్యాటింగ్ చేసి ఉండాల్సింది.
గెలిచిన తర్వాత కూడా మనం నేర్చుకోవాల్సిన విషయాలు చాలా ఉంటాయి. ఈ రోజు మేము ఇంకా మెరుగ్గా లేదా ఇంకాస్త తెలివిగా బ్యాటింగ్ చేయాల్సింది. ఒకరిద్దరూ చివరి వరకు ఆడటం కంటే చిన్న చిన్న భాగస్వామ్యాలు నమోదు చేయడానికి ప్రయత్నించాల్సింది. ఏదేమైనా ఈ మ్యాచ్ మాకు ఓ గుణపాఠం. తదుపరి మ్యాచ్‌కు ఐదు రోజుల సమయం ఉంది. కాబట్టి ప్రశాంతంగా కూర్చొని మా తప్పిదాలను చర్చించుకుంటాం. కచ్చితంగా తదుపరి మ్యాచ్‌లో మరింత బలంగా తిరిగి వస్తాం.
వాషింగ్టన్ సుందర్ ఢిల్లీలో జట్టుతో కలుస్తాడు. అతను ఫిట్‌గా ఉన్నాడు. వాతావరణం కారణంగా అభిషేక్ శర్మ ఎలాగైతే ఇబ్బంది పడ్డాడో.. బుమ్రా కూడా అదే విధంగా తీవ్రమైన జ్వరంతో బాధపడుతున్నాడు. మిగతా అంతా బాగానే ఉంది.'అని సూర్యకుమార్ యాదవ్ చెప్పుకొచ్చాడు.