న్యూజిలాండ్‌తో ఐదు టీ20ల సిరీస్‌లో భాగంగా ఉన్న టీమిండియా స్టార్ బ్యాటర్ శ్రేయస్ అయ్యర్‌కు టీమిండియా మేనేజ్‌మెంట్ ఒక్క అవకాశం ఇవ్వలేదు. మిడిలార్డర్ బ్యాటర్ తిలక్ వర్మ సర్జరీతో భారత జట్టుకు దూరం కావడంతో అనూహ్యంగా అవకాశం అందుకున్న అయ్యర్‌కు వరుసగా నాలుగు మ్యాచ్‌ల్లో నిరాశే ఎదురైంది. వైజాగ్ వేదికగా జరిగిన నాలుగో టీ20లో ఇషాన్ కిషన్ గాయంతో దూరమైనా.. అయ్యర్‌ను ఆడించలేదు. ఈ నిర్ణయం అందర్నీ విస్మయ పరిచింది.
భారత క్రికెట్ అభిమానులైతే హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్‌పై విమర్శలు గుప్పించారు. ఇషాన్ స్థానంలో మరో బ్యాటర్ కాకుండా బౌలర్ అర్ష్‌దీప్ సింగ్‌ను ఆడించడం ఏంటని మండిపడ్డారు. 15 మంది సభ్యులతో కూడిన ఈ జట్టులో 14 మందికి ఈ సిరీస్‌లో అవకాశం కల్పించిన టీమ్‌మేనేజ్‌మెంట్.. శ్రేయస్ అయ్యర్‌ను మాత్రం బెంచ్‌కే పరిమితం చేసింది. ఉద్దేశపూర్వకంగా అయ్యర్‌కు అవకాశం ఇవ్వడం లేదనే విషయం స్పష్టమవుతుంది.

న్యూజిలాండ్‌తో నాలుగో టీ20 అనంతరం సూర్యకుమార్ యాదవ్ కూడా ఇదే విషయాన్ని వెల్లడించాడు. టీ20 ప్రపంచకప్ జట్టులో భాగంగా ఉన్న ఆటగాళ్లందర్నీ ఆడించాలనే ఉద్దేశంతోనే ఇతర ఆటగాళ్లకు అవకాశం ఇవ్వడం లేదని స్పష్టం చేశాడు. ఈ క్రమంలోనే శ్రేయస్ అయ్యర్‌ను పక్కనపెట్టాల్సి వచ్చిందని పరోక్షంగా వెల్లడించాడు.
'ఈ మ్యాచ్‌లో మేం కావాలనే ఆరుగురు బ్యాటర్లు, ఐదుగురు స్పెషలిస్ట్ బౌలర్లతో బరిలోకి దిగాం. తద్వారా మాకు మేం పరీక్ష పెట్టుకున్నాం. 180-200 పరుగుల లక్ష్య చేధనలో ఆరంభంలోనే రెండు, మూడు వికెట్లు కోల్పోతే పరిస్థితి ఎలా ఉంటుందో చూడాలనుకున్నాం. ఈ మ్యాచ్‌లో ఓడినా ఇది మాకు ఓ గుణపాఠం. ప్రపంచకప్ జట్టులో భాగమైన ఆటగాళ్లందరికీ అవకాశం ఇవ్వాలని అనుకున్నాం. అందుకే ఇతర ఆటగాళ్లను ఆడించలేదు. 'అని సూర్య తెలిపాడు. తద్వారా ఆఖరి టీ20లో కూడా శ్రేయస్ అయ్యర్‌కు అవకాశం దక్కదనే హింట్ ఇచ్చాడు.
అయితే ఈ నిర్ణయాన్ని నెటిజన్లు తప్పుబడుతున్నారు. ప్రపంచకప్ ఆటగాళ్లకే అవకాశం ఇచ్చినప్పుడు.. అయ్యర్‌ను ఎందుకు ఎంపిక చేశారని ప్రశ్నిస్తున్నారు. ఒకవేళ తిలక్ వర్మ, ఇషాన్ కిషన్‌లో ఎవరైనా గాయంతో దూరమైతే పరిస్థితి ఏందని నిలదీస్తున్నారు. మెగా టోర్నీకి బ్యాకప్‌గా శ్రేయస్ అయ్యర్‌ను సిద్దం చేసుకోవాల్సిన అవసరం ఉందని సూచిస్తున్నారు. మాజీ క్రికెటర్లు కూడా టీమ్‌మేనేజ్‌మెంట్ నిర్ణయాన్ని తప్పుబడుతున్నారు.