
హైదరాబాద్: వరల్డ్ నెంబర్ వన్ టీ20 బ్యాటర్, టీమిండియా 360 ప్లేయర్ సూర్యకుమార్ యాదవ్ కెరీర్‌లో విషమ దశను ఎదుర్కొంటున్నాడు. టీ20ల్లో ధనాధన్ బ్యాటింగ్‌తో ఆకట్టుకున్న సూర్య.. వన్డే ఫార్మాట్‌లో మాత్రం దారుణంగా విఫలమయ్యాడు. క్రీజులో అడుగుపెట్టిన మొదటి బంతి నుంచే బౌలర్లపై సిక్సర్లతో విరుచుకుపడే సూర్య.. హ్యాట్రిక్ గోల్డెన్ డక్స్‌తో అందర్నీ ఆశ్చర్యపరిచాడు. ఆస్ట్రేలియాతో మూడు వన్డేల సిరీస్‌లో వరుసగా గోల్డెన్ డక్స్ అయ్యి.. భారత ఓటమికి కారణమయ్యాడు.
దాంతో సూర్యకుమార్ యాదవ్‌పై అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వరుసగా మూడు మ్యాచ్‌ల్లో గోల్డెన్ డకౌటవ్వడం దారుణమని, ఇప్పటి ఏ బ్యాటర్ కూడా ఇంత దారుణంగా విఫలమవ్వలేదని మండిపడుతున్నారు. సూర్యకుమార్ యాదవ్ కాబట్టే వరుసగా గోల్డెన్ డకౌటైన జట్టులో అవకాశం దక్కించుకున్నాడని, ముంబై క్రికెటర్ కావడం, ముంబై ఇండియన్స్ అండదండలు, రోహిత్ శర్మకు సన్నిహితంగా ఉండటమే సూర్యకు వరుస అవకాశాలు తెచ్చిపెడుతున్నాయని ఆరోపిస్తున్నారు.
శ్రేయస్ అయ్యర్ గాయంతో జట్టుకు దూరమైనప్పుడు అతనికి బ్యాకప్‌గా ఉన్న సూర్యకుమార్ యాదవ్‌ను జట్టులోకి తీసుకున్నారని, మరీ సూర్యకు బ్యాకప్‌గా సంజూ శాంసన్‌ను ఎందుకు ఎంపిక చేయలేదని ఫ్యాన్స్ నిలదీస్తున్నారు. సూర్యకుమార్ యాదవ్‌కు పోటీ లేకుండా చేయడం కోసమే రోహిత్ శర్మ ఈ వ్యూహాన్ని రచించాడని మండిపడుతున్నారు. సూర్యకుమార్ యాదవ్‌కు ఇచ్చే మద్దతు గతంలో సంజూ శాంసన్, మనీశ్ పాండే, మయాంక్ అగర్వాల్ వంటి ఆటగాళ్లకు ఇచ్చి ఉంటే వాళ్లు కూడా స్టార్ ప్లేయర్లుగా ఎదిగేవారని గుర్తు చేస్తున్నారు. ఒకటి రెండు మ్యాచ్‌ల్లో విఫలమవ్వగానే సంజూ, మనీశ్ పాండే, మయాంక్ అగర్వాల్‌లను పక్కనపెట్టారని విమర్శిస్తున్నారు. ఏది ఏమైనా.. ఈ మూడు వన్డేల సిరీస్ సూర్యకుమార్ యాదవ్ కెరీర్‌లో ఓ మచ్చలా మిగిలిపోతుందని అభిప్రాయపడుతున్నారు.
వన్డే ఫార్మాట్‌లో అతనికి అవకాశాలు దక్కడం కష్టమేననే సంకేతాలిస్తుందని చెబుతున్నారు. ఇప్పటివరకూ సూర్యకుమార్ యాదవ్ 21 వన్డే ఇన్నింగ్స్‌ల్లో 24.05 సగటుతో 433 పరుగులే చేశాడు. 2021 జులైలో శ్రీలంకతో సిరీస్‌లో వన్డేల్లో అడుగుపెట్టిన సూర్య.. ఆరంభంలో పర్వాలేదనిపించాడు. తొలి ఆరు ఇన్నింగ్స్‌ల్లో వరుసగా 31 నాటౌట్, 53, 40, 39, 34 నాటౌట్, 64 పరుగులు చేశాడు. కానీ ఆ తర్వాతే అతని ఆట గాడితప్పింది. టీ20ల్లో విధ్వంసం సృష్టిస్తున్న అతను.. వన్డేల్లో కనీసం క్రీజులో నిలబడలేకపోతున్నాడు.