టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ ఓటములకు కృంగిపోయేవాడు కాదని టీ20 సారథి సూర్యకుమార్ యాదవ్ అన్నాడు. విజయాలు సాధించినా.. అపజయాలు ఎదురైనా రోహిత్ వ్యక్తిత్వంలో ఎలాంటి మార్పు ఉండదని స్పష్టం చేశాడు.
సౌతాఫ్రికాతో నాలుగు టీ20ల సిరీస్‌ల నేపథ్యంలో శుక్రవారం డర్బన్ వేదికగా తొలి టీ20 జరగనుంది. ఈ మ్యాచ్ నేపథ్యంలో గురువారం సూర్యకుమార్ యాదవ్ మీడియాతో మాట్లాడాడు. ఈ సందర్భంగా మీడియా ప్రతినిధులు అడిగిన ప్రశ్నలకు ఓపికగా సమాధానమిచ్చాడు.

రోహిత్ క్యారెక్టర్ మారదు..
సొంతగడ్డపై న్యూజిలాండ్‌తో టెస్ట్ సిరీస్‌లో టీమిండియా 0-3తో క్లీన్ స్వీప్ అవ్వడంతో రోహిత్ శర్మపై ఒత్తిడి ఉంటుందా? అని ఒకరు సూర్యకుమార్ యాదవ్‌ను ప్రశ్నించగా.. తనదైన శైలిలో బదులిచ్చాడు. 'ఆటల్లో గెలుపు, ఓటములు సహజం. గెలవడం కోసం ప్రతీ జట్టు కష్టపడుతోంది. కొన్నిసార్లు గెలిస్తే.. మరికొన్ని సార్లు ఓటములు ఎదురవుతాయి.
జీవితంలో సమతుల్యత అనే ముఖ్యం. ఈ విషయంలో నేను రోహిత్ భాయ్ నుంచే ఎంతో నేర్చుకున్నాను. విజయాలు సాధించినా.. అపజయాలు ఎదురైనా అతని వ్యక్తిత్వంలో మార్పును ఎన్నడూ చూడలేదు. అతను ఒక ఆటగాడిగా.. సారథిగా ఎదగడం నేను దగ్గరుండి చూశాను. నేను అతనితో కలిసి ఆడుతున్నప్పుడు మైదానంలో అతను ఏం చేస్తున్నాడనేది నిశితంగా పరిశీలిస్తాను.
ఎంతో నేర్చుకున్నాను..
అతని బాడీ లాంగ్వేజ్ ఎలా ఉంది? ప్రశాంతంగా ఎలా ఉంటున్నాడు? బౌలర్లను ఎలా ట్రీట్ చేస్తున్నాడు? ఆఫ్ ది ఫీల్డ్‌లో ప్రతీ ఒక్కరితో ఎలా మాట్లాడుతున్నాడు? అనేది చూస్తాను. అతను ఆటగాళ్లను ట్రీట్ చేసే విధానం.. వారి నుంచి కావాల్సింది రాబట్టుకునే తత్వం గురించి నాకు బాగా తెలుసు. అతని నుంచి నేను ఎంతో నేర్చుకున్నాను.'అని సూర్యకుమార్ యాదవ్ చెప్పుకొచ్చాడు.
టెస్ట్ క్రికెట్‌లో రీఎంట్రీ ఎప్పుడు ఇస్తారని ప్రశ్నించగా.. ఈ విషయంలో తాను తొందరపడటం లేదని, అవసరమైన సమయాన్ని ఇవ్వడానికి సిద్దంగా ఉన్నానని తెలిపాడు. 'టెస్ట్‌ల్లో రీఎంట్రీ సమయం వచ్చినప్పుడు జరుగుతుంది. నేను అన్ని దేశవాళీ క్రికెట్ టోర్నీలు ఆడుతున్నా. రెడ్ బాల్, వైట్ బాల్ క్రికెట్ అనే తేడా లేకుండా బరిలోకి దిగుతున్నాను.'అని సూర్య సమాధానమిచ్చాడు.
రుతురాజ్‌కు టైమ్ వస్తోంది..
టీ20లకు రుతురాజ్ గైక్వాడ్‌ను ఎందుకు పరిగణలోకి తీసుకోవడం లేదని ప్రశ్నించగా.. అతనికి ఒక రోజు టైమ్ వస్తుందని సూర్య బదులిచ్చాడు.
'రుతురాజ్ గైక్వాడ్ అద్భుతమైన ఆటగాడు. మూడు ఫార్మాట్లలో నిలకడగా రాణిస్తున్నాడు. వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటున్నాడు. అయితే అతన్ని కన్నా ముందు రాణించిన ఆటగాళ్లు చాలా మంది ఉన్నారు. టీమ్‌మేనేజ్‌మెంట్ ఓ విధానాన్ని అనుసరిస్తున్నారు. ఒక రోజు రుతురాజ్ గైక్వాడ్‌కు కూడా సమయం వస్తుంది.'అని సూర్య చెప్పుకొచ్చాడు.