
న్యూఢిల్లీ: సొంతగడ్డపై సౌతాఫ్రికాతో జరగనున్న అప్‌కమింగ్ టీ20 సిరీస్ భారత ఆటగాళ్లు చాలా ముఖ్యమని మాజీ క్రికెటర్ సురేశ్ రైనా అన్నాడు. ముఖ్యంగా ఐపీఎల్ 2022 సీజన్‌లో సత్తా చాటి భారత జట్టుకు ఎంపికైన ఆటగాళ్లకు ఈ సిరీస్ చాలా కీలకమన్నాడు. భవిష్యత్తులో జట్టు కొనసాగాలంటే ఈ సిరీస్‌లో వాళ్లు తమ మార్క్ చూపించాలన్నాడు.
ఇక జూన్ 9 నుంచి ప్రారంభం కానున్న ఐదు టీ20ల సిరీస్ కోసం భారత సెలెక్షన్ కమిటీ 18 మంది సభ్యులతో కూడిన జట్టును ఎంపిక చేసిన విషయం తెలిసిందే. ఇక ఈ సిరీస్ నుంచి సీనియర్ ఆటగాళ్లకు విశ్రాంతినిచ్చిన సెలెక్టర్లు .. ఐపీఎల్‌లో సత్తా చాటిన ఉమ్రాన్ మాలిక్, అర్షదీప్ సింగ్, దినేశ్ కార్తీక్, హార్దిక్ పాండ్యా వంటి ఆటగాళ్లకు అవకాశం ఇచ్చారు.
స్టార్ స్పోర్ట్స్ షోలో ఈ అప్ కమింగ్ సిరీస్ గురించి మాట్లాడిన సురేశ్ రైనా.. టీ20 ప్రపంచకప్ సన్నాహకంగా భావించే ఈ సిరీస్‌లో యువ ఆటగాళ్లు ఎలా రాణిస్తారనేది కీలకమవుతుందన్నాడు. 'ఈ సిరీస్ టీమిండియాకు చాలా ముఖ్యమైనది. ఐపీఎల్‌లో అద్భుతంగా రాణించిన యువ ఆటగాళ్లు ప్రొటీస్‌తో సిరీస్‌కు భారత జట్టులో భాగమై ఉన్నారు. అయితే టీమిండియా తరపున వారు ఎలా రాణిస్తారు అనేది ముఖ్యం. ఉమ్రాన్ మాలిక్ చాలా టాలెంట్ ఉన్న బౌలర్.
అదే విధంగా అర్ష్‌దీప్ ఐపీఎల్‌లో బౌలింగ్ చేసిన విధానం అద్భుతమైనది. ఇక కెప్టెన్‌గా రాహుల్ ఐపీఎల్‌లో అద్భుతంగా రాణించాడు. కానీ ఇప్పుడు భారత జట్టు వంతు వచ్చింది. అయితే అతడు జట్టును విజయం పథంలో నడిపిస్తాడని నేను భావిస్తున్నాను "అని రైనా పేర్కొన్నాడు. ఇక ఈ సిరీస్‌లో భాగంగా తొలి టీ20 జూన్9న ఢిల్లీ వేదికగా జరగనుంది.
ఇక ఐపీఎల్ 2022 మెగా వేలంలో సురేశ్ రైనాను ఏ ఫ్రాంచైజీ తీసుకోలేదు. దాంతో అతను కామెంటేటర్‌గా సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించాడు. ఐపీఎల్ 2022 సీజన్‌లో హిందీ కామెంటేటర్‌గా వ్యవహరించాడు.