
చెన్నై: భారత మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ చెన్నై చేరుకోగానే రిటైర్మెంట్ ప్రకటిస్తాడని తనకు ముందే తెలుసని వెటరన్ బ్యాట్స్‌మన్ సురేశ్ రైనా తెలిపాడు. దానికనుగుణంగానే ఆటకు వీడ్కోలు పలికేందుకు తాను సిద్దమయ్యానన్నాడు. ఆటకు అల్విదా ప్రకటించిన అనంతరం ఇద్దరం ఒకరికొకరం అప్యాయంగా కౌగిలించుకొని కన్నీటి పర్యంతమయ్యామని రైనా చెప్పుకొచ్చాడు. ఆ తర్వాత చెన్నై సూపర్ కింగ్స్ సహచర ఆటగాళ్లతో తమ రిలేషన్‌షిప్, కెరీర్‌కు సంబంధించిన విషయాలను రాత్రంతా మాట్లాడుకున్నామని దైనిక్ జాగరన్ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పాడు.
'చెన్నై చేరుకోగానే ధోనీ భాయ్ రిటైర్మెంట్ ప్రకటిస్తాడని నాకు తెలుసు. దాంతో నేను కూడా సిద్దమయ్యా. నేను, పియూష్ చావ్లా, దీపక్ చాహర్, కరణ్ శర్మ చార్టెడ్ ప్లేన్‌లో రాంచీ చేరుకున్నాం. అక్కడ మహీ భాయ్, మోనూ సింగ్‌ను పిక్ చేసుకున్నాం. మా రిటైర్మెంట్ ప్రకటించిన తర్వాత ఇద్దరం ఆప్యాయంగా హగ్ చేసుకున్నాం. వెక్కివెక్కి ఏడ్చాం. అనంతరం నేను, పియూష్, రాయుడు, కేదార్ జాదవ్, కరన్ అంతా కూర్చొని మా కెరీర్, వ్యక్తిగత విషయాలు రాత్రంతా మాట్లాడుకున్నాం'అని రైనా చెప్పుకొచ్చాడు.
ధోనీ, తాను దాదాపు ఒకేసారి క్రికెట్‌లో అడుగుపెట్టామని, వీడ్కోలు కూడా కలిసే ఇవ్వాలనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నామని రైనా తెలిపాడు. అయితే ఐపీఎల్‌లో మాత్రం కొనసాగుతామని స్పష్టం చేశాడు. 'ధోనీ 2004లో డిసెంబర్ 23న చిట్టగాంగ్ వేదికగా బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌తో అంతర్జాతీయక్రికెట్‌లోకి అరంగేట్రం చేశాడు. నేను 2005లో జూలై 30న శ్రీలంకపై తొలి మ్యాచ్ ఆడాను. ఓ 6-7 నెలల వ్యత్యాసం ఉన్నా దాదాపు ఇద్దరం ఒకేసారి కెరీర్‌ను ప్రారంభించాం. ఆరంభం నుంచి ఐపీఎల్‌లో సీఎస్‌కేకు ఆడుతున్నాం. అందుకే కలిసే అంతర్జాతీయ క్రికెట్‌కు అల్విదా ప్రకటించి ఐపీఎల్‌లో ఆడాలనుకున్నాం'అని రైనా తమ రిటైర్మెంట్ వెనుక ఉన్న కారణాన్ని వెల్లడించాడు.
ఆగస్టు 15నే ఇద్దరు ఆటగాళ్లు రిటైర్మెంట్ ప్రకటించినా.. బీసీసీఐకి మాత్రం వేర్వేరుగా సమాచారమిచ్చాడు. ముందే ధోనీ భారత క్రికెట్ బోర్డుకు తన నిర్ణయాన్ని వెల్లడించగా.. రైనా మాత్రం బీసీసీఐ ప్రొటోకాల్స్ ప్రకారం ఆగస్టు 16 (ఆదివారం)న సమాచారం ఇచ్చాడు.