ఐపీఎల్ 2025 సీజన్‌లో చెన్నై సూపర్ కింగ్స్(సీఎస్‌కే) పరాజయాల పరంపర కొనసాగుతోంది. ఇప్పటి వరకు 9 మ్యాచ్‌లు ఆడిన చెన్నై సూపర్ సూపర్ కింగ్స్ ఏడింటిలో ఓటమిపాలైంది. ఎన్నడూ లేని విధంగా సొంతగడ్డపై వరుసగా నాలుగు మ్యాచ్‌ల్లో ఓడింది. ఈ వరుస పరాజయాలపై సీఎస్‌కే ఓనర్ తీవ్ర ఆగ్రహంగా ఉన్నట్లు తెలుస్తోంది. టీమ్‌మేనేజ్‌మెంట్‌తో ఆయన అత్యవసర సమావేశం నిర్వహించేందుకు సిద్దమయ్యారని ఆ జట్టు మాజీ క్రికెటర్ సురేశ్ రైనా తెలిపాడు.
భారీ అంచనాలతో ఐపీఎల్ 2025 సీజన్ బరిలోకి దిగిన చెన్నై సూపర్ కింగ్స్.. తీవ్రంగా నిరాశపరిచింది. ఈ సీజన్ ప్రారంభానికి ముందు పేపర్‌పై చాలా బలంగా కనిపించిన సీఎస్‌కే ఆరో టైటిల్ గెలిచేలా కనిపించింది. అశ్విన్ తిరిగి రావడంతో పాటు కీలక ఆటగాళ్లను కొనుగోలు చేయడంతో సీఎస్‌కేకు తిరుగులేదని అంతా అనుకున్నారు. అందుకు తగ్గట్లుగానే తొలి మ్యాచ్‌లో పటిష్ట ముంబై ఇండియన్స్‌ను మట్టికరిపించింది. సీఎస్‌కే సునాయసంగా ప్లే ఆఫ్స్ చేరుతుందని భావించారు. కానీ ఆ అంచనాలను తలకిందులు చేస్తూ సీఎస్‌కే దారుణ ప్రదర్శన కనబర్చింది.

వరుస పరాజయాలతో..
పేలవ బ్యాటింగ్, బౌలింగ్, చెత్త ఫీల్డింగ్‌తో వరుస పరాజయాలను ఎదుర్కొంది. గాయం కారణంగా కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ జట్టుకు దూరం కాగా.. ధోనీ తిరిగి సారథ్య బాధ్యతలు చేపట్టాడు. ధోనీ సారథ్యంలోనైనా సీఎస్‌కే గెలుస్తుందని అంతా భావించారు. కానీ ఆ జట్టు ఫలితాల్లో ఎలాంటి మార్పులు జరగలేదు. ఎన్నడూ లేని విధంగా తుది జట్టులో పదే పదే మార్పులు చేసినా ఫలితం దక్కలేదు. బ్యాటింగ్ విభాగం వైఫల్యం సీఎస్‌కే విజయవకాశాలను దెబ్బతీసింది. జడేజా, సామ్ కరణ్‌లను అప్‌దీ ఆర్డర్ ఆడించినా ప్రయోజనం చేకూరలేదు.
వైఫల్యాలపై ఫోకస్..
ధోనీ వచ్చే ఏడాది ఆడుతాడా? అనే ప్రశ్నలు కూడా తలెత్తుతున్నాయి. ధోనీ తర్వాత అతని స్థానాన్ని భర్తీ చేసే ఆటగాడు ఎవరనేది కూడా మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారింది. సీఎస్‌కే ఇంకా 5 మ్యాచ్‌లు ఆడాల్సి ఉంది. ప్రస్తుత పరిస్థితుల్లో ప్లే ఆఫ్స్ చేరడం కష్టం. ఈ క్రమంలోనే చెన్నై పరాజయాలకు గల కారణాలపై మేనేజ్‌మెంట్ ఫోకస్ పెట్టిందని సురేశ్ రైనా తెలిపాడు.
ఈ పరాజయాలకు ధోనీని నిందించలేమని, అతను పరుగులు చేయకపోయినా.. కీపర్‌గా సత్తా చాటాడని చెప్పాడు. కెప్టెన్‌గానూ ఆకట్టుకుంటున్నాడని తెలిపాడు. వేలంలోనే సీఎస్‌కే సరైన ఆటగాళ్లను కొనుగోలు చేయలేదని అభిప్రాయపడ్డాడు. జట్టులోకి వచ్చిన ఆటగాళ్లు బాధ్యతాయుతంగా ఆడలేదన్నాడు. సీఎస్‌కే మేనేజ్‌మెంట్ సమావేశంలో ఈ అంశాలన్నీ చర్చకు వస్తాయని రైనా స్పష్టం చేశాడు.