
న్యూఢిల్లీ: టీమిండియా మాజీ కెప్టెన్, సీనియర్ వికెట్ కీపర్ మహేంద్ర సింగ్ ధోనీ కేవలం తనకు స్నేహితుడు మాత్రమే కాదని, మార్గదర్శకుడని వెటరన్ బ్యాట్స్‌మన్ సురేశ్ రైనా తెలిపాడు. స్నేహితుల దినోత్సవం సందర్భంగా ఐపీఎల్ ఫ్రాంచైజీ చెన్నై సూపర్ కింగ్స్ ట్విటర్ వేదికగా ఓ స్పెషల్ వీడియోను షేర్ చేసింది. ఆ వీడియోలో చెన్నై కెప్టెన్ ధోనీతో పాటు రైనా కూడా ఉన్నాడు.
ఈ వీడియోకు 'ఎల్లప్పుడూ జట్టు కోసం పోరాడే F.R.7.3.N.D.S" అంటూ కాప్షన్ ఇచ్చింది. ఈ వీడియోపై స్పందించిన రైనా.. ఇంత మంచి జ్ఞాపకాలను గుర్తి చేసిన ఫ్రాంచైజీకి ధన్యవాదాలు తెలియజేశాడు. 'ఫ్రాంచైజీకి ధన్యవాదాలు.. ఇంత మంచి జ్ఞాపకాలను మళ్లీ గుర్తు చేశారు. నాకు ధోనీ భాయ్ స్నేహితుడు మాత్రమే కాదు, అంతకన్నా ఎక్కువ. నన్ను సరైన మార్గం వైపు నడిపించే శక్తి. నా మెంటార్. ఇంకా చెప్పాలంటే.. కష్టంలో ఎల్లప్పుడూ నాతోనే ఉండే వ్యక్తి. మహి భాయ్ నీకు కూడా థ్యాంక్స్.. హ్యాపీ ఫ్రెండ్‌షిప్ డే. త్వరలో కలుద్దాం' అంటూ రైనా భావోద్వేగమైన రిప్లై ఇచ్చాడు.
ఇదిలా ఉంటే ఫ్రెండ్‌షిప్ డే సందర్భంగా సచిన్ టెండూల్కర్ కూడా స్నేహితులతో కలిసి ఉన్నప్పటి ఫొటోలను ట్విటర్‌లో షేర్ చేశాడు. ఈ సందర్భంగా స్నేహం గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. 'స్నేహబంధాలు అనేవి ఫ్లడ్‌లైట్ల లాంటివి. మన విజయాల్ని ఓ మూల నుంచే ఆస్వాదిస్తాయి. అలాగే, మనమీద నుంచి సూర్యుడు పోతున్నాడని తెలిస్తే వాటంతట అవే వెలిగిపోతాయి. మన చుట్టూ వెలుగునిస్తూ ఉపయోగంగా ఉంటాయి. నాకైతే ప్రతీ రోజు స్నేహితుల దినోత్సవమే' అని పేర్కొన్నాడు. ఇక ముంబై ఇండియన్స్ ఫ్రాంచైజీ తమ ఆటగాళ్ల ఫొటోలు పంచుకొని ఒక కుటుంబంగా మారిన మిత్రులకు ఫ్రెండ్‌షిప్ డే శుభాకాంక్షలు అని పేర్కొంది.