
ఒకేసారి మొదలుపెట్టాం..
దాదాపు ఇద్దరం ఒకేసారి క్రికెట్‌లో అడుగుపెట్టామని, వీడ్కోలు కూడా కలిసే ఇవ్వాలనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నామని రైనా తెలిపాడు. అయితే ఐపీఎల్‌లో మాత్రం కొనసాగుతామని స్పష్టం చేశాడు. ‘ధోనీ 2004లో డిసెంబర్ 23న చిట్టగాంగ్ వేదికగా బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌తో అంతర్జాతీయక్రికెట్‌లోకి అరంగేట్రం చేశాడు. నేను 2005లో జూలై 30న శ్రీలంకపై తొలి మ్యాచ్ ఆడాను. ఓ 6-7 నెలల వ్యత్యాసం ఉన్న దాదాపు ఇద్దరం ఒకేసారి కెరీర్‌ను ప్రారంభించాం. ఆరంభం నుంచి ఐపీఎల్‌లో సీఎస్‌కేకు ఆడుతున్నాం. అందుకే కలిసే అంతర్జాతీయ క్రికెట్‌కు అల్విదా ప్రకటించి ఐపీఎల్‌లో ఆడాలనుకున్నాం'అని దైనిక్ జాగ్రన్ పత్రికకు తెలిపాడు.

73 కోసమే ఆగస్టు 15..
ఇక రిటైర్మెంట్ డే ప్రత్యేకంగా ఉండాలని ఆగస్టు 15 ఏంచుకున్నట్లు తెలిపాడు. అభిమానులు చెబుతున్నట్లు భారత్ 73 ఏళ్ల స్వాతంత్య్రాన్ని పూర్తి చేసుకున్న సందర్భంగా 7, 3 జెర్సీలకు వీడ్కోలు పలకాలనుకున్నామని రైనా స్పష్టం చేశాడు. ‘మా ప్రణాళిక ప్రకారమే ఆగస్టు 15 శనివారం రిటైర్మెంట్ ప్రకటించాం. ధోనీ జెర్సీ నంబర్ 7, నాది 3-- రెండు కలిస్తే 73. ఈ ఆగస్టు 15తో భారత్‌కు స్వాతంత్ర్యం వచ్చి 73 ఏళ్ల అవుతుంది. అందుకే ఇంతకన్నా మంచి రోజు ఇంకేది లేదనిపించింది. మా రిటైర్మెంట్‌డేకు ప్రత్యేకత ఉండాలనే ఈ నిర్ణయం తీసుకున్నాం'అని రైనా స్పష్టం చేశాడు.

16న బీసీసీఐకి సమాచారం..
ధోనీ, రైనా చడిచప్పుడు లేకుండా సింపుల్ ఓ ఇన్‌స్టా పోస్ట్‌తో రిటైర్మెంట్ ప్రకటించారు. 'కెరీర్ ఆసాంతం నన్ను ప్రేమించి, మద్దతుగా నిలిచిన మీ అందరికీ ధన్యవాదాలు. 19:29 గంటల నుంచి నేను వీడ్కోలు పలికినట్టుగా భావించండి' అని మహీ ఓ వీడియో షేర్ చేయగా.. 'నీతో కలసి ఆడడం కంటే ఏదీ గొప్ప కాదు. నీతో కలసి ఆడినందుకు నా హృదయం గర్వంతో ఉప్పొంగిపోతున్నది. ఈ జర్నీలో నీతో పాటే నడవాలని అనుకుంటున్నా. భారతావనికి ధన్యవాదాలు.. జైహింద్'అని రైనా ఇన్‌స్టాలో రాసుకొచ్చాడు.ఇక బీసీసీఐకి మాత్రం రైనా తన రిటైర్మెంట్ విషయాన్ని అధికారికంగా ఆగస్టు 16 (ఆదివారం) సమాచారం ఇచ్చాడు. అయితే ధోనీ మాత్రం ఆగస్టు 15కు ముందే తన నిర్ణయాన్ని బీసీసీఐకి తెలియజేశాడు.

సూపర్ ఫీల్డర్..
33 ఏళ్ల రైనా భారత అత్యుత్తమ ఫీల్డర్లలో ఒకడిగా నిలుస్తాడు. ఎంత క్లిష్టమైన క్యాచ్‌లనైనా ఒడుపుగా పట్టడంలో దిట్ట. ఫీల్డింగ్ సమయంలో అతడి వద్దకు బంతి వెళ్లిందంటే ప్రత్యర్థి బ్యాట్స్‌మన్ రన్స్ చేసేందుకు తటపటాయించాల్సిందే. అవసరమైనప్పుడు బంతితోనూ ఆదుకొనేవాడు. అలాగే మిడిల్డార్ బ్యాట్స్‌మన్‌గానూ రాణించాడు. టెస్ట్‌ల్లో రైనా అంతగా ఆకట్టుకోలేకపో యినా.. పరిమిత ఓవర్ల క్రికెట్‌లో జట్టుకు కీలక ఆటగాడిగా మారాడు. పొట్టి ఫార్మాట్‌లో శతకం (101) బాదిన ప్లేయర్లలో రైనా ఒకడు. భారత జగజ్జేతగా నిలిచిన 2011 వరల్డ్‌క్‌పతో పాటు 2013 చాంపియన్స్ ట్రోఫీ నెగ్గిన జట్టులో రైనా సభ్యుడు. 3 ఫార్మాట్లలోనూ శతకాలు నమోదు చేసిన భారత బ్యాట్స్‌మన్‌గా రికార్డులకెక్కాడు.


Click it and Unblock the Notifications












