చెన్నై సూపర్ కింగ్స్(సీఎస్‌కే) మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీపై ఆ జట్టు మాజీ ప్లేయర్ సురేష్ రైనా ప్రశంసల జల్లు కురిపించాడు. ధోనీ వంద ఏళ్లకు ఒకసారి పుట్టే వ్యక్తి అని కొనియాడాడు. ధోనీ కేవలం ఒక ఆటగాడు మాత్రమే కాదని, భారత క్రికెట్ గమనాన్ని మార్చిన యోధుడని రైనా ప్రశంసించాడు.
ఐపీఎల్ 2026 సీజన్‌లో ధోనీ పాత్ర గురించి అడిగిన ప్రశ్నకు రైనా తనదైన శైలిలో బదులిచ్చాడు. 'హెలికాప్టర్(ధోనీ) ఇప్పటికే అక్కడ ల్యాండ్ అయింది. గత సీజన్‌లో ధోనీ అద్భుతంగా రాణించాడు. ఇప్పుడు టీమ్‌లోని యువ ఆటగాళ్లకు ఒక మార్గదర్శి అవసరం. ఈ జట్టు ఇంత సక్సెస్‌ఫుల్‌గా ఎందుకు ఉందో ధోనీ స్వయంగా వారికి వివరిస్తాడు. అతను మైదానంలో ఉండటం జట్టుకు చాలా ముఖ్యం.
ధోనీ లాంటి ఆటగాడు వందేళ్లకు ఒకసారి మాత్రమే పుడతాడు. ధోనీ కెప్టెన్‌గా ఉన్నప్పుడే విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ వంటి దిగ్గజ ఆటగాళ్లను తయారు చేశాడు. నన్ను కూడా క్రికెటర్‌గా తీర్చిదిద్దింది ధోనీనే. కుర్రాళ్లంతా అత్యుత్తమ వ్యక్తుల నుంచే నేర్చుకోవాలని కోరుకుంటారు. అందుకే ధోనీ ఉనికి వారికి పెద్ద బలం.
సీఎస్‌కే జట్టులో ధోనీ కేవలం వికెట్ కీపర్ లేదా బ్యాటర్ మాత్రమే కాదు. ఆయన జట్టుకు ఒక సర్పంచ్ (పెద్ద దిక్కు). పెద్ద మనిషిలా జట్టులో కూర్చుని అందరినీ నడిపిస్తాడు. గత రెండు మూడేళ్ల కంటే ఈ ఏడాది చాలా కీలకం. ప్రతీ ఆటగాడి బాధ్యతను ధోనీ నిర్వచిస్తాడు. వ్యక్తిగత ప్రదర్శన కంటే కూడా.. యువతకు ధోనీ మార్గదర్శకత్వం ఇక్కడ చాలా అవసరం. ఐపీఎల్ 2026 సీజన్‌లో ధోనీ మ్యాచ్‌లు ఆడేది అతని ఫిట్‌నెస్‌పై ఆధారపడి ఉంటుంది.’అని సురేష్ రైనా చెప్పుకొచ్చాడు.

44 ఏళ్ల వయసులో ఐపీఎల్ 2025 సీజన్ ఆడిన ధోనీ 14 మ్యాచ్‌ల్లో 135.17 స్ట్రైక్‌రేట్‌తో 196 పరుగులు చేశాడు. అయితే ఈ సీజన్‌లో అతను అన్ని మ్యాచ్‌లు ఆడుతాడా? లేక కొన్ని మ్యాచ్‌లకే పరిమితమవుతాడా? అనేది మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారింది. వికెట్ కీపింగ్ చేస్తాడా? ఇంపాక్ట్ ప్లేయర్‌గా బ్యాటింగ్‌కు మాత్రమే పరిమితమవుతాడా? అనేది చూడాలి.