
ప్రతిపాదన లేఖ:
జమ్ము కశ్మీర్‌లోని నిరుపేద చిన్నారులను అభివృద్ధి చేసేందుకు తన క్రికెట్ అనుభవం ఎంతగానో ఉపయోగపడుతుందని సురేష్ రైనా తన ప్రతిపాదన లేఖలో పేర్కొన్నాడు. తన ప్రణాళిక విజయవంతం అయ్యేందుకు ఎంతో కష్టపడాలని, చాలామంది సహకారం అవసరమని ఆయన అన్నాడు. ముఖ్యంగా ఓ ఐదు అంశాలపై రైనా దృష్టి సారించాడు. గ్రామీణ ప్రాంతాల్లోని పాఠశాలలు, కళాశాలల విద్యార్థుల్లో ప్రతిభాన్వేషణ చేయడం.. మాస్టర్ క్లాసెస్ నిర్వహించడం.. మానసికంగా దృఢత్వం పెంపొందించే క్లాసెస్ ఇవ్వడం.. శారీరక దారుఢ్యం.. నైపుణ శిక్షణ ద్వారా మంచి క్రికెటర్లను తయారు చేస్తానని రైనా తెలిపాడు.

క్రికెట్ అంటే ఒక ఆట మాత్రమే కాదు:
'క్రికెట్ అంటే ఒక ఆట మాత్రమే కాదు. ఒక క్రికెటర్‌గా మారడం వెనక ఓ ప్రక్రియ ఉంటుంది. శారీరక, మానసిక దృఢత్వం, విలువలు, నైపుణ్యాలు, జీవితంలో ముందుకెళ్లడం వంటివి చాలా అంశాలు ముడిపడి ఉంటాయి. క్రీడల కోసం శిక్షణ పొందే చిన్నారులు ఒక క్రమశిక్షణా యుతమైన జీవితానికి అలవాటవుతారు. శారీరకంగా బలంగా ఉంటారు. అదే దేశ భవిష్యత్తుకు అవసరం. ఈ అవకాశాన్ని ఉపయోగించి భవిష్యత్తు తారలను రూపొందిచాలనే పట్టుదలతో ఉన్నాను' అని జమ్ము కశ్మీర్ డీజీపీ దిల్బాగ్ సింగ్, ఎస్‌ఎస్‌పీ అనంత్‌నాగ్ సందీప్ చౌదరీకి పంపిన లేఖలో సురేష్ రైనా తెలిపాడు.

కశ్మీరీ పండిత కుటుంబం:
జమ్ముకశ్మీర్ చిన్నారుల కోసం భారత మాజీ క్రికెటర్ సురేష్ రైనా ఎందుకు అంత ఇంట్రెస్ట్ పెడుతున్నాడంటే.. అతడి మూలాలు అక్కడే ఉన్నాయట. రైనాది కశ్మీరీ పండిత కుటుంబం అట. అయితే చాలా ఏళ్ల క్రితమే ఉత్తర్‌ప్రదేశ్‌లో స్థిరపడ్డారట. 'నాది కశ్మీరీ వారసత్వం. నేను కశ్మీరీ పండితుడిని. ఉత్తర్‌ప్రదేశ్ నాకు కర్మభూమి. జమ్ముకశ్మీర్ కూడా అంతే. ఆ ప్రాంతంతో నాకెంతో భావోద్వేగ అనుబంధం ఉంది' అని రైనా తెలిపాడు.

అభివృద్ధికి ఏనాడు నోచుకోలేదు:
దశాబ్దాలుగా అభివృద్ధిలో వెనకబడిన ప్రాంతం జమ్ము కశ్మీర్. ఎప్పుడూ వేర్పాటువాద గొడవలు, ఉగ్రవాద దాడులు జరుగుతుండడంతో అభివృద్ధికి ఏనాడు నోచుకోలేదు. పెట్టుబడులు పెట్టినా అక్కడి ఆస్తులపై హక్కులు ఉండవు కాబట్టి ఎవ్వరూ ముందుకు రాలేదు. ఇక విద్యార్థులు చదువుకొనేందుకు మెరుగైన విద్యాసంస్థలు లేవు. దీంతో అక్కడి యువత ఎదిగేందుకు సరైన ఉపాధి అవకాశాలు లేకుండాపోయాయి. మోదీ ప్రభుత్వం వచ్చాక అంతా మారిపోయింది. పెట్టుబడులు పెట్టడానికి ఇప్పుడిప్పుడే అందరూ ముందుకువస్తున్నారు.


Click it and Unblock the Notifications

IPL 2020: సన్ రైజర్స్‌కు భారీ షాక్ తగలనుందా?!!










