
కాబుల్: వెస్టిండీస్ వేదికగా జరుగుతున్న కరీబియన్ ప్రీమియర్ లీగ్ (సీపీఎల్) ప్రాంచైజీలకు భారీ షాక్ తగలనుంది. సీపీఎల్ 2020 చివరి వారంలో జరగనున్న ప్లేఆఫ్స్ మ్యాచ్‌లకు ఆరుగురు ఆఫ్ఘనిస్తాన్ ఆటగాళ్లు దూరం కానున్నారు. ఆఫ్ఘనిస్తాన్ దేశీయ టీ20 టోర్నీ షపగీజాలో పాల్గొనేందుకు వారు కాబుల్ వెళ్లనున్నారు. సీపీఎల్ ఫైనల్ మ్యాచ్ సెప్టెంబర్ 10న జరగనుండగా.. షపగీజా లీగ్ సెప్టెంబర్ 6 నుండి 16 వరకు జరగనుంది.
ఆఫ్ఘనిస్తాన్ దేశీయ టీ20 టోర్నీ (షపగీజా) మొత్తం 11 రోజుల పాటు జరగనుంది. ఈ టోర్నీలో నాలుగు ప్లేఆఫ్స్ మ్యాచ్‌లతో సహా 19 మ్యాచ్‌లు ఉంటాయి. కాబూల్ అంతర్జాతీయ స్టేడియంలో అన్ని మ్యాచ్‌లు షెడ్యూల్ అయి ఉన్నాయి. ఈ టోర్నీ కోసం సీపీఎల్ 2020లో ఆడుతున్న రషీద్ ఖాన్ (బార్బడోస్ ట్రైడెంట్స్), ముజీబ్ ఉర్ రెహ్మాన్ (జమైకా తల్లావాస్), నవీన్-ఉల్-హక్ (గయానా అమెజాన్ వారియర్స్) మరియు సెయింట్ లూసియా జూక్స్ త్రయం మొహమ్మద్ నబీ, జహీర్ ఖాన్ మరియు నజీబుల్లా జాద్రాన్ కాబుల్ వెళ్లనున్నారు.
రషీద్ ఖాన్ షపగీజా లీగ్‌లో బ్యాండ్-ఎ-అమీర్ డ్రాగన్స్‌కు ప్రాతినిధ్యం వహిస్తుండగా.. నబీ మిస్-ఎ-ఐనాక్ నైట్స్, ముజీబ్ మరియు నవీన్ కాబూల్ ఈగల్స్ జట్టుకు ఆడనున్నారు. ఇక జద్రాన్ మరియు జాహిర్ ది స్పీన్‌ఘర్ టైగర్స్ తరఫున ప్రాతినిథ్యం వహించనున్నారు. సీపీఎల్‌లో ఆడే ఆటగాళ్లు షపగీజా లీగ్ కోసం అందుబాటులోకి వస్తారని ఆఫ్ఘనిస్తాన్ క్రికెట్ బోర్డు (ఏసీబీ) తెలిపింది. సెప్టెంబర్ 5 లోగా సీపీఎల్‌లో ఆడే ఆరుగురు ఆటగాళ్లు కాబుల్ చేరుకుంటారని ఏసీబీ యాక్టింగ్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ నజీమ్ జార్ అబ్దుల్ రహింజాయ్ తెలిపారు. అయితే క్వారంటైన్ నిబంధల కారణంగా మొదటి కొన్ని మ్యాచులకు వీరు దూరం కానున్నారు.
షపగీజా లీగ్ సెప్టెంబర్ 16న ముగియనుండగా.. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2020 మ్యాచులు సెప్టెంబర్ 19 నుండి ప్రారంభం కానున్నాయి. దీంతో సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టుకు ఆడుతున్న రషీద్ ఖాన్ కూడా ఐపీఎల్ మొదటి వారం మ్యాచులకు దూరం కానున్నాడు. ఎందుకంటే.. బయటినుండి వచ్చినవారు దుబాయ్ రూల్స్ ప్రకారం ఆరు రోజుల పాటు క్వారంటైన్‌లో ఉండాల్సిందిగా నిబంధనలు ఉన్నాయి. అయితే విదేశీ ప్లేయర్ల విషయంలో బీసీసీఐ ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. సీపీఎల్, ఇంగ్లండ్-ఆస్ట్రేలియా సిరీసులలో ఆడే ప్లేయర్స్ బయో బాబుల్లోనే ఆడుతున్నారు కాబట్టి.. వారికి రోజుల పాటు క్వారంటైన్ అవసరం లేదని కొందరు అంటున్నారు.