ఐపీఎల్ 2026 మినీవేలానికి రంగం సిద్దమవుతుంది. డిసెంబర్ చివరి వారంలో ఈ మినీ వేలాన్ని నిర్వహించేందుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ) కసరత్తులు చేస్తోంది. నవంబర్ 15 లోపు పది ఫ్రాంచైజీలు తమ రిటెన్షన్ జాబితాలను ప్రకటించాల్సి ఉంటుంది. ఈ క్రమంలోనే ఆయా ఫ్రాంచైజీలు వదిలేసే ఆటగాళ్ల గురించి తీవ్ర చర్చ జరుగుతుంది.
రోహిత్ శర్మ కూడా ముంబై ఇండియన్స్‌ను వీడేందుకు సిద్దమయ్యాడని, కేకేఆర్‌లోకి వెళ్తున్నాడని వార్తలు వచ్చాయి. కానీ ఈ వార్తలను ముంబై ఇండియన్స్ ఖండించింది. బాలీవుడ్ బాద్ షా, కేకేఆర్ కో ఓనర్ షారూఖ్ ఖాన్‌కు చెందిన సినిమా డైలాగ్‌తో రోహిత్ శర్మ ముంబై ఇండియన్స్‌లోనే ఉంటాడని క్లారిటీ ఇచ్చింది.
'సూర్యుడు రేపు ఉదయిస్తాడు. కానీ రాత్రి వేళలో ఉదయించడు. ఇది అసాధ్యం కూడా'అని నైట్‌రైడర్స్ జట్టును ఉద్దేశించి ముంబై ఇండియన్స్ పోస్ట్ పెట్టింది. ముంబై ఇండియన్స్ రిటెన్షన్ గురించి తాజాగా మాట్లాడిన సురేశ్ రైనా ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఐదు టైటిళ్లు అందించిన రోహిత్ శర్మను ముంబై రిటైన్ చేసుకోవాలన్నాడు. ప్రస్తుత పరిస్థితుల్లో రోహిత్ లాంటి మరో ఆటగాడు ఆ జట్టుకు దొరకడని చెప్పాడు.

అధికార బ్రాడ్‌కాస్టర్ స్టార్ స్పోర్ట్స్ షోలో మాట్లాడిన సురేశ్ రైనా.. ట్రెంట్ బౌల్డ్‌ను కూడా రిటైన్ చేసుకోవాలన్నాడు. 'రోహిత్ శర్మను ముంబై ఇండియన్స్ రిటైన్ చేసుకోవాలి. అతను ముంబైకి చాలా ట్రోఫీలు అందించాడు. దీపక్ చాహర్ ఇప్పుడే జట్టులోకి వచ్చాడు. వారికున్న ఆప్షన్స్ బట్టి అతన్ని రిటైన్ చేసుకోవాలా? వద్దా? అనేది నిర్ణయించుకుంటారు.
దీపక్ చాహర్‌ను వదిలేయవచ్చు. రిటైన్ చేసుకోవచ్చు. కానీ వేలంలో వారికి ఆటగాళ్లు దొరకకపోవచ్చు. కానీ వేలంలో అతని లాంటి మరో ఆటగాడు దొరకకపోవచ్చు. కాబట్టి నేనైతే దీపక్ చాహర్‌ను రిటైన్ చేసుకోవాలనే చెబుతాను. ట్రెంట్ బౌల్డ్‌ను అయితే కచ్చితంగా రిటైన్ చేసుకోవాలి. అతను అద్భుతమైన ఆటగాడు. లెఫ్ట్ ఆర్మ్ బౌలర్ కావడం అతనికి ఉన్న అడ్వాంటేజ్.'అని సురేశ్ రైనా చెప్పుకొచ్చాడు.
అంతర్జాతీయ టీ20లతో పాటు టెస్ట్ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన రోహిత్ శర్మ.. కేవలం వన్డే ఫార్మాట్‌లో మాత్రమే కొనసాగుతున్నాడు. ఫిట్‌నెస్‌పై ఫోకస్ పెట్టిన రోహిత్ 10 కిలోల బరువు కూడా తగ్గాడు. 2027 వన్డే ప్రపంచకప్ ఆడటమే లక్ష్యంగా పెట్టుకున్నాడు. ఐపీఎల్ 2026 సీజన్‌లో ముంబై ఇండియన్స్ తరఫున రోహిత్ సత్తా చాటే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. గత ఐదేళ్లుగా ఐపీఎల్‌లో రోహిత్ శర్మ స్థాయికి తగ్గ ప్రదర్శన చేయలేదు.