ఇంగ్లండ్ వేదికగా జరిగే ది హండ్రెడ్ లీగ్ కోసం పాకిస్థాన్ స్పిన్నర్ అబ్రార్ అహ్మద్‌ను కొనుగోలు చేసిన సన్‌రైజర్స్ మేనేజ్‌మెంట్‌పై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇటీవల జరిగిన వేలంలో సన్‌రైజర్స్ లీడ్స్ రూ.2.34 కోట్ల(190,000 పౌండ్లు) భారీ ధరకు అబ్రార్ అహ్మద్‌ను కొనుగోలు చేసింది. ఈ వేలంలో సన్‌రైజర్స్ ఓనర్ కావ్యమారన్ పాల్గొనడం.. తమ నిర్ణయాన్ని హెడ్ కోచ్ డానియల్ వెటోరి సమర్థించుకోవడం తీవ్ర వివాదానికి దారి తీసింది.
భారత్-పాక్ మధ్య ఉన్న ఉద్రిక్తతల నేపథ్యంలో ఒక భారతీయ ఫ్రాంచైజీ పాక్ ఆటగాడిని కొనుగోలు చేయడంపై నెటిజన్లు, మాజీ క్రికెటర్లు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఐపీఎల్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టును నిషేధించాలని బీసీసీఐని కోరుతున్నారు. ఈ వివాదంపై స్పందించిన ఐపీఎల్ మాజీ ఛైర్మన్ లలిత్ మోదీ ఎక్స్ వేదికగా ఒక ఆసక్తికరమైన పోస్ట్ చేశారు. సాయం కావాలంటే తనకు ఫోన్ చేయాలని ఎక్స్ వేదికగా సన్‌రైజర్స్ ఓనర్ కావ్యమారన్‌కు సూచించారు.

'అభిమానులు ఇప్పటికే ఆగ్రహంతో ఉన్న సమయంలో ఒక పాకిస్థాన్ ఆటగాడిపై రూ. 2.34 కోట్లు పెట్టుబడి పెట్టాలా? ఇలాంటి పరిస్థితుల్లో డ్యామెజ్ కంట్రోల్‌ను ఎలా మేనేజ్ చేయాలి, సామ్రాజ్యాలను ఎలా నిర్మించాలో నాకు బాగా తెలుసు. నాకు కాల్ చేయండి.'అని సన్‌రైజర్స్ లీడ్స్ ఫ్రాంచైజీని ట్యాగ్ చేశారు.
ఈ ట్వీట్‌లో ఆయన నేరుగా కావ్య మారన్ పేరు ప్రస్తావించనప్పటికీ.. సన్‌రైజర్స్ లీడ్స్ టీమ్‌ను ట్యాగ్ చేయడం ద్వారా ఆమెను ఉద్దేశించే ఈ పోస్ట్ పెట్టాడని స్పష్టమవుతుంది. 2008 ముంబై దాడుల తర్వాత ఐపీఎల్‌లో పాక్ ఆటగాళ్లు ఆడకుండా నిషేధం విధించాడు. పాకిస్థాన్‌తో ఎలాంటి ద్వైపాక్షిక సిరీస్‌లు ఆడటం లేదు. విదేశీ లీగ్స్‌లో కూడా భారతీయ ఫ్రాంచైజీలు సాధారణంగా పాక్ ఆటగాళ్లను తీసుకోవడానికి మొగ్గు చూపరు. కానీ సన్‌రైజర్స్ ఆ సంప్రదాయాన్ని పక్కన పెట్టడం వివాదానికి దారితీసింది.
ఈ నిర్ణయాన్ని భారత క్రికెట్ దిగ్గజం సునీల్ గవాస్కర్ కూడా తప్పుబట్టారు. 'పాకిస్థాన్ ఆటగాడికి చెల్లించే జీతం పరోక్షంగా భారత సైనికులు, పౌరుల మరణాలకు దోహదపడుతుందనే విషయాన్ని భారత ఫ్రాంచైజీలు గ్రహించాలి.
జట్టు కోచ్ డానియెల్ వెటోరీ న్యూజిలాండ్ వాడు కాబట్టి అతనికి భారత్-పాక్ మధ్య ఉన్న రాజకీయ ఉద్రిక్తతలు తెలియకపోవచ్చు. కానీ భారతీయులైన కావ్యమారన్‌కు ఈ విషయంపై అవగాహన ఉండాలి కదా? భారతీయుల ప్రాణాల కంటే ది హండ్రెడ్ లీగ్ గెలవడం ఎక్కువైపోయిందా?'అని గవాస్కర్ తన కాలమ్‌లో రాసుకొచ్చారు.