
తెలుగోడు ఒక్కడు లేడు..
వెటరన్ ప్లేయర్ అంబటి రాయుడు కోసం గట్టి ప్రయత్నం చేయలేదు. అండర్ 19 స్టార్ షేక్ రషీద్‌ను కనుకరించలేదు. ఆంధ్ర క్రికెట్ కేఎస్ భరత్‌తో పాటు హరిశంకర్ రెడ్డి వంటి ఆటగాళ్లను తీసుకోలేదు. ఐపీఎల్‌కే బ్రాండ్ అంబాసిడర్ అయిన డేవిడ్ వార్నర్‌ను ఇగోకు పోయి వదిలేసుకుంది. అలా అని ఆ స్థాయి ఆటగాడిని వేలంలో కొనుగోలు చేసిందా? అంటే అది లేదు. ఫిట్‌నెస్ సమస్యలతో బాధపడుతున్న కేన్ విలియమ్సన్‌ను అట్టిపెట్టుకున్న సన్‌రైజర్స్.. దేశవాళీ స్టార్‌లపైనా దృష్టి పెట్టలేదు. నిలకడలేని నికోలస్ పూరన్ కోసం పది కోట్లకు పైగా వెచ్చించిన సన్‌రైజర్స్.. మరో రెండు కోట్లు వేస్తే శ్రేయస్ అయ్యర్ దక్కే అవకాశం ఉన్నా.. ఆ ప్రయత్నమే చేయలేదు.

ఒక్కనికి కూడా తెలియదు..
గతంలో తమ జట్టుకు ఆడిన ఓపెనర్ శిఖర్ ధావన్‌ను తిరిగి తీసుకునేందుకూ ఆసక్తి చూపలేదు. లీగ్ మొత్తంలో అత్యుత్తమ బౌలింగ్ దళంగా పేరు తెచ్చుకున్న హైదరాబాద్.. రషీద్ ఖాన్ లాంటి ప్లేయర్‌ను కొనుగోలు చేయలేకపోయింది. గతంలో వార్నర్, బెయిర్‌స్టో, విలియమ్సన్, రషీద్‌ఖాన్, హోల్డర్ వంటి విదేశీ స్టార్లతో కళకళలాడిన రైజర్స్.. ఈసారి పేరున్న ఆటగాళ్ల జోలికే పోలేదు. పూరన్, మార్కరమ్ తప్ప మిగిలిన ఐదుగురు (సీన్ అబాట్, రొమారియా షెఫర్డ్, జాన్‌సెన్, ఫిలిప్స్, ఫజల్లాఖ్ ఫారూఖీ) విదేశీ ఆటగాళ్ల పేర్లు అభిమానులకు పెద్దగా పరిచయం లేనివే!

ఇండియా స్టార్లు లేరు..
స్వదేశీ ఆటగాళ్లనైనా సరైన వాళ్లను ఎంపిక చేసుకున్నారా అంటే అదీ కూడా లేదు. పెద్ద మ్యాచ్‌లు ఆడిన అనుభవం ఎక్కువ లేని అబ్దుల్ సమద్‌ను వేలానికి ముందే అట్టి పెట్టుకున్న రైజర్స్.. అభిషేక్ శర్మ కోసం ఆరున్నర కోట్లు ఖర్చు చేసింది. టీమిండియాకు ప్రాతినిధ్యం వహిస్తున్న వాషింగ్టన్ సుందర్ తప్ప పెద్దగా చెప్పుకోదగ్గ వాళ్లెవరినీ తీసుకోలేదు. కోల్‌కతా తరఫున కొన్ని మెరుపు ఇన్నింగ్స్‌లు ఆడిన రాహుల్ త్రిపాఠి కోసం భారీ మొత్తాన్ని వెచ్చించిన టీమ్‌మేనేజ్‌మెంట్.. తుది జట్టులో ఉంటాడనే నమ్మకం లేని యువ పేసర్ కార్తీక్ త్యాగికి నాలుగు కోట్లు కట్టబెట్టింది. ఇప్పటికే భారత జట్టుకు దాదాపుగా దూరమైన భువనేశ్వర్ కుమార్‌లో పాత మెరుపు లేకపోగా.. బౌలింగ్ భారం నటరాజన్‌పై పడేలా కనిపిస్తున్నది. గాయం నుంచి కోలుకోని విలియమ్సన్‌కు డిప్యూటీ ఎవరనే అంశంపై కూడా స్పష్టత లేదు.

మనకే సిగ్గుండాలి..
డేవిడ్ వార్నర్‌ను వదిలేసుకోవడంతోనే అభిమానుల నుంచి తీవ్ర వ్యతిరేకత ఎదుర్కొన్న సన్‌రైజర్స్ హైదరాబాద్.. తాజా నిర్ణయాలతో వారికి మరింత దూరమైంది. తెలుగు ప్లేయర్లకు ప్రాధాన్యత ఇవ్వకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇతర ఫ్రాంచైజీలు తీసుకున్న ఆటగాళ్లు సన్‌రైజర్స్‌కు పనికిరారా? అని ప్రశ్నిస్తున్నారు. అసలు తెలుగు జట్టని సన్‌రైజర్స్‌కు సపోర్ట్ చేయడమే మన తప్పిదమని కామెంట్ చేస్తున్నారు. తెలుగు భాషకు, తెలుగు ఆటగాళ్లకు అవకాశం ఇవ్వని సన్‌రైజర్స్ హైదరాబాద్ అసలు తెలుగు టీమే కాదని మండిపడుతున్నారు.
సన్‌రైజర్స్ టీమ్..
కేన్ విలియమ్సన్ (14 కోట్లు), అబ్దుల్ సమద్ (4 కోట్లు), ఉమ్రాన్ మాలిక్ (4 కోట్లు), ప్రియమ్ గార్గ్ (20 లక్షలు), అభిషేక్ శర్మ (6.50 కోట్లు), కార్తీక్ త్యాగి (4 కోట్లు), సౌరభ్ దూబే (20 లక్షలు), భువనేశ్వర్ కుమార్ (4.20 కోట్లు), శ్రేయస్ గోపాల్ (75 లక్షలు), శశాంక్ (20 లక్షలు), సీన్ అబాట్ (2.40 కోట్లు), రాహుల్ త్రిపాఠి (8.50 కోట్లు), సమర్థ్ (20 లక్షలు), సుచిత్ (20 లక్షలు), మార్క్మ్ (2.60 కోట్లు), పూరన్ (10.75 కోట్లు), షెఫర్డ్ (7.75 కోట్లు), జాన్‌సెన్ (4.20 కోట్లు), వాషింగ్టన్ సుందర్ (8.75 కోట్లు), విష్ణు వినోద్ (50 లక్షలు), నటరాజన్ (4 కోట్లు), ఫిలిప్స్ (1.50 కోట్లు), ఫారూఖీ (50 లక్షలు)


Click it and Unblock the Notifications












