ఐపీఎల్ 2026 మినీ వేలంలో సన్‌రైజర్స్ హైదరాబాద్ తీవ్రంగా నిరాశపర్చింది. అబుదాబి వేదికగా మంగళవారం జరిగిన ఈ మినీ ఆక్షన్‌లో రూ.25.5 కోట్ల భారీ పర్స్‌తో బరిలోకి దిగిన ఆరెంజ్ ఆర్మీ దూకుడుగా వ్యవహరించలేకపోయింది. ప్రధాన ఆటగాళ్లందర్నీ రిటైన్ చేసుకున్న సన్‌రైజర్స్ హైదరాబాద్.. వారికి సరితూగే బ్యాకప్ ప్లేయర్లను కొనుగోలు చేయలేకపోయింది. అంతేకాకుండా గత సీజన్‌లో జట్టు వైఫల్యానికి కారణమైన బలహీనతలను అధిగమించలేకపోయింది.
ముఖ్యంగా స్టార్ పేసర్ మహమ్మద్ షమీకి సరైన రిప్లేస్‌మెంట్‌ను కొనుగోలు చేయలేకపోయింది. రూ.25.5 కోట్ల డబ్బులు పెట్టుకొని కూడా స్పెషలిస్ట్ స్పిన్నర్‌ను తీసుకోలేదు. పేరున్న ఆటగాళ్ల కోసం సన్‌రైజర్స్ కనీసం బిడ్ కూడా వేయలేదు. అందరూ ఊహించినట్లుగానే రవి బిష్ణోయ్ కోసం తీవ్రంగా ప్రయత్నించి చివర్లో చేతులెత్తేసింది. రవి బిష్ణోయ్ కోసం రూ.7 కోట్ల వరకు బిడ్ వేసిన సన్‌రైజర్స్ హైదరాబాద్.. రాజస్థాన్ రాయల్స్ రూ.7.20 కోట్లకు బిడ్ వేయడంతో వెనక్కి తగ్గింది.

అనామక ఆటగాళ్ల కోసం కూడా ఆరెంజ్ ఆర్మీ తీవ్రంగా ప్రయత్నించింది. స్పిన్ ఆల్‌రౌండర్ అయిన ప్రశాంత్ వీర్, వికెట్ కీపర్ కమ్ బ్యాటర్ అయిన కార్తీక్ శర్మ, పేస్ ఆల్‌రౌండర్ అకీబ్ దార్‌ల కోసం తీవ్రంగా ప్రయత్నించి వెనకడుగు వేసింది. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే మొదట్లో అన్‌సోల్డ్‌గా నిలిచిన లియామ్ లివింగ్ స్టోన్‌ను రూ. 13 కోట్ల భారీ ధరకు కొనుగోలు చేసింది. ఆ తర్వాత జాక్ ఎడ్వర్డ్స్ కోసం రూ. 3 కోట్లు ఖర్చు చేసింది. మరో ఆప్షన్ లేకనే ఈ ఇద్దర్నీ కొనుగోలు చేసినట్లు కనిపించింది.
ఈ వేలంలో సన్‌రైజర్స్ హైదరాబాద్ వ్యవహరించిన తీరు అభిమానులతో పాటు కామెంటేటర్లను కూడా తీవ్రంగా నిరాశపర్చింది. వేలంలో సరైన ఆటగాళ్లు కొనుగోలు చేయకపోయినా.. కోర్ టీమ్ బలంగానే ఉంది. కానీ స్పెషలిస్ట్ ఇండియన్ పేసర్, స్పిన్నర్ లోటు ఆరెంజ్ ఆర్మీకి ఉంది. అనామక ఆటగాళ్లు ఆ రెండు స్థానాలను భర్తీ చేస్తే సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు తిరుగుండదు.
సలీల్ అరోరా(రూ.1.50 కోట్లు), శివాంగ్ కుమార్(రూ.30 లక్షలు), క్రెయిన్స్ ఫులెట్రా(రూ.30 లక్షలు), సాకిబ్ హుస్సేన్(రూ.30 లక్షలు), ఓంకార్ తర్మలె(రూ.30 లక్షలు), ప్రఫుల్ హింగే(రూ.30 లక్షలు), అమిత్ కుమార్(రూ.30 లక్షలు), లియామ్ లివింగ్ స్టోన్(రూ.13 కోట్లు), శివమ్ మావి(రూ.75 లక్షలు), జాక్ ఎడ్వర్డ్స్(రూ.3 కోట్లు).
ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ, అనికేత్ వర్మ, ఆర్ సమరన్, ఇషాన్ కిషన్, హెన్రీచ్ క్లాసెన్, నితీష్ కుమార్ రెడ్డి, హర్ష్ దూబే, కామిందు మెండీస్, హర్షల్ పటేల్, బ్రైడన్ కార్స్, ప్యాట్ కమిన్స్, జయదేవ్ ఉనాద్కత్, ఇషాన్ మలింగా, జీషన్ అన్సారీ.
ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్, నితీష్ కుమార్ రెడ్డి, హెన్రీచ్ క్లాసెన్, లియామ్ లివింగ్ స్టోన్, అనికేత్ వర్మ, హర్షల్ పటేల్, ప్యాట్ కమిన్స్, జీషన్ అన్సారీ, జయదేవ్ ఉనాద్కత్.