కోల్‌కతా నైట్‌రైడర్స్ మెంటార్ గౌతమ్ గంభీర్ కారణంగానే తాను సెంచరీ నమోదు చేశానని ఆ జట్టు స్టార్ ఓపెనర్ సునీల్ నరైన్ తెలిపాడు. ఓపెనింగ్ చేయమని చెప్పడంతో పాటు బ్యాటింగ్ చేయగలననే ఆత్మవిశ్వాసాన్ని నింపింది కూడా ఆయనేని, ఈ సెంచరీ క్రెడిట్ గంభీర్‌దేనని చెప్పాడు.
ఐపీఎల్ 2024 సీజన్‌లో భాగంగా రాజస్థాన్ రాయల్స్‌తో మంగళవారం జరిగిన మ్యాచ్‌లో సునీల్ నరైన్ సెంచరీ సాధించాడు. ఈ మ్యాచ్‌లో విధ్వంసకర బ్యాటింగ్‌తో చెలరేగిన సునీల్ నరైన్.. 49 బంతుల్లో సెంచరీ పూర్తి చేసుకున్నాడు. కేకేఆర్ తరఫున సెంచరీ బాదిన మూడో బ్యాటర్‌గా నిలిచాడు. ఐపీఎల్‌లో హ్యాట్రిక్‌తో పాటు సెంచరీ బాదిన తొలి కేకేఆర్ ఆటగాడిగా.. మూడో ప్లేయర్‌గా చరిత్రకెక్కాడు.

సెంచరీ అనంతరం తన ఇన్నింగ్స్‌పై అధికారిక బ్రాడ్‌కాస్టర్‌తో మాట్లాడిన సునీల్ నరైన్.. గంభీర్‌పై ప్రశంసల జల్లు కురిపించాడు. 'ఈ సీజన్ ప్రారంభానికి ముందు జట్టులోని ఆటగాళ్లంతా ఆరెంజ్ క్యాప్ రేసులో నిలుస్తావని చెప్పారు. అప్పుడు నేను వాళ్లంతా జోక్ చేస్తున్నారని అనుకునేవాడిని. ఎందుకంటే అప్పుడెప్పుడో 10 ఏళ్ల క్రితం ఓపెనింగ్ చేసిన నేను.. మునపటిలా బ్యాటింగ్ చేస్తానని అనుకోలేదు.
గతేడాదిగా నేను పెద్దగా బ్యాట్ పట్టింది కూడా లేదు. కేకేఆర్‌లోకి గంభీర్ రావడంతో నన్ను ఆయన మరోసారి ఓపెనర్‌గా బరిలోకి దించాడు. బ్యాటింగ్ చేయగలననే నమ్మకాన్ని కలిగించాడు. ఓపెనర్‌గా శుభారంభం అందించడమే నా బాధ్యత అన్నట్లు మైండ్‌సెట్ చేశాడు. ఎలాంటి పరిస్థితుల్లోనైనా డాట్ బాల్ లేకుండా పవర్ ప్లేలో చెలరేగాలని నాకు చెప్పాడు.
డాట్ బాల్స్ ఆడితే మ్యాచ్ ఫలితం తారుమారు అవుతోంది. అందుకే నా సాయశక్తులా జట్టుకు శుభారంభాలు అందించే ప్రయత్నం చేస్తున్నాను. కోల్‌కతా మైదానంలో బౌలింగ్ చేయడం అంత సులువైన పనికాదు. అందుకే పవర్ ప్లేలోనే వికెట్లు తీసే ప్రయత్నం చేస్తాం. మిడిల్ ఓవర్లలో మరింత దెబ్బతీసి లక్ష్యాన్ని అందుకోకుండా చేస్తాం.'అని సునీల్ నరైన్ చెప్పుకొచ్చాడు.
ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన కేకేఆర్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లకు 223 పరుగులు చేసింది. సునీల్ నరైన్(56 బంతుల్లో 13 ఫోర్లు, 6 సిక్స్‌తో 109) విధ్వంసకర శతకంతో చెలరేగగా.. రఘు వంశీ(18 బంతుల్లో 5 ఫోర్లతో 30), రింకూ సింగ్(9 బంతుల్లో ఫోర్, 2 సిక్స్‌లతో 20 నాటౌట్) రాణించారు
రాజస్థాన్ రాయల్స్ బౌలర్లలో ఆవేశ్ ఖాన్, కుల్దీప్ సేన్ రెండేసి వికెట్లు తీయగా.. ట్రెంట్ బౌల్ట్, యుజ్వేంద్ర చాహల్ తలో వికెట్ దక్కించుకున్నారు.