
న్యూఢిల్లీ: ఐపీఎల్ 2022 సీజన్ ప్రారంభానికి ముందే కోల్‌కతా నైట్‌రైడర్స్ స్టార్ ఆల్‌రౌండర్, విండీస్ క్రికెటర్ నరైన్ ఆల్‌రౌండర్ సూపర్ ఫామ్ కనబరుస్తున్నాడు. బంగ్లాదేశ్ ప్రీమియర్ లీగ్(బీపీఎల్)లో విధ్వంసకర బ్యాటింగ్‌తో చెలరేగుతున్నాడు. బుధవారం రాత్రి జరిగిన ఓ మ్యాచ్‌లో నరైన్ ఆకాశమే హద్దుగా చెలరేగాడు. కేవలం 13 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఫలితంగా టీ20 క్రికెట్ చరిత్రలో అతి తక్కువ బంతుల్లో హాఫ్ సెంచరీ బాదిన రెండో బ్యాట్స్‌మన్‌గా గుర్తింపు పొందాడు.
టీమిండియా మాజీ ఆల్‌రౌండర్ యువరాజ్ సింగ్, విండీస్ విధ్వంసకర వీరుడు క్రిస్ గేల్, అఫ్గాన్ ప్లేయర్ హజ్రతుల్లా జాజాయ్ 12 బంతుల్లో హాఫ్ సెంచరీ బాదగా.. మార్కోస్ ట్రెస్కోతిక్, సునీల్ నరైన్ 13 బంతుల్లో ఈ ఘనతను సాధించారు. టీ20 క్రికెట్‌లో తక్కువ బంతుల్లో హాఫ్ సెంచరీ బాదిన బ్యాట్స్‌మన్ జాబితాలో నరైన్ ఐదో స్థానంలో నిలిచాడు.
బంగ్లాదేశ్ ప్రీమియర్ లీగ్‌లో భాగంగా చట్టోగ్రామ్ ఛాలెంజర్స్‌తో బుధవారం జరిగిన సెమీఫైనల్ మ్యాచ్‌లో కోమిల్లా విక్టోరియన్స్ టీమ్ ఏడు వికెట్ల తేడాతో గెలుపొంది ఫైనల్‌కు చేరింది. విక్టోరియన్స్ విజయంలో సునీల్ నరైన్ కీలక పాత్ర పోషించాడు.ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన చట్టోగ్రామ్ టీమ్ 19.1 ఓవర్లలోనే 148 పరుగులకు ఆలౌటైంది. ఆ తర్వాత లక్ష్యచేధనకు దిగిన కోమిల్లా విక్టోరియన్స్.. సునీల్ నరైన్ విధ్వంసానికి 12.5 ఓవర్లలో మూడు వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది.
ఓపెనర్‌గా వచ్చిన సునీల్ నరైన్ 16 బంతుల్లో 5ఫోర్లు, 6 సిక్స్‌లతో 57) దంచి కొట్టాడు. దొరికిన బంతిని దొరికినట్లు బౌండరీకి తరలించాడు. దీంతో అతని ఇన్నింగ్స్ (0, 6, 4, 4, 6, 4, 6, 4, 6, 0, 4, 6, 1, 6) ఇలా సాగింది. ఇక అతను ఔటయ్యాక వచ్చిన డుప్లెసిస్ (30), మొయిన్ అలీ (30) అజేయంగా నిలిచి విజయా లాంఛనాన్ని పూర్తి చేశారు. ఇక నరైన్ బ్యాటింగ్‌కు సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్‌గా మారింది. ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)లో సుదీర్ఘ కాలంగా కేకేఆర్‌కు ఆడుతున్న సునీల్ నరైన్.. బ్యాటింగ్, బౌలింగ్‌తో ఎన్నో అద్భుత ప్రదర్శనలు ఇచ్చాడు. ఈ క్రమంలోనే ఐపీఎల్ 2022 సీజన్ మెగా వేలానికి ముందు అతన్ని కేకేఆర్ రూ. 6 కోట్లకు రిటైన్ చేసుకుంది. కేకేఆర్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ ఎంపికైన విషయం తెలిసిందే.