ప్రస్తుత పాకిస్థాన్ క్రికెట్ టీమ్ భారత ద్వితీయ శ్రేణి జట్టుతో కూడా గెలవదని క్రికెట్ దిగ్గజం సునీల్ గవాస్కర్ అన్నాడు. పాకిస్థాన్‌లో ప్రతిభ కలిగిన ఆటగాళ్లకు కొదవ ఉండదని, కానీ వారి బెంచ్ బలంగా లేకపోవడం తనను ఆశ్చర్యానికి గురిచేసిందని తెలిపాడు. ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో భాగంగా ఆదివారం జరిగిన హైఓల్టేజ్ మ్యాచ్‌లో టీమిండియా 6 వికెట్ల తేడాతో పాకిస్థాన్‌ను చిత్తు చేసిన విషయం తెలిసిందే. విరాట్ కోహ్లీ శతకంతో చెలరేగడంతో ఈ మ్యాచ్ ఏకపక్షంగా ముగిసింది. ఈ ఓటమితో పాకిస్థాన్ ఈ టోర్నీ నుంచి నిష్క్రమించేందుకు సిద్దమైంది.
భారత్-బీ టీమ్‌తో గెలవదు..
తాజాగా పాకిస్థాన్ జట్టు ప్రదర్శనపై ఓ జాతీయ ఛానెల్‌తో మాట్లాడిన గవాస్కర్.. ఆ జట్టు యువ ఆటగాళ్లను తయారు చేసుకోలేకపోయిందన్నాడు. భారత్ మ్యాచ్‌లో పాకిస్థాన్ బ్యాటింగ్ అప్రోచ్ సరిగ్గా లేకనే ఓటమిపాలైందని అభిప్రాయపడ్డాడు. 'భారత బీ టీమ్‌తో కూడా ప్రస్తుత పాకిస్థాన్ జట్టు గెలవలేదు. భారత సీ టీమ్ ఓడిస్తుందా? అంటే కచ్చితంగా చెప్పలేను. కానీ బీ టీమ్ మాత్రం పాకిస్థాన్‌ను ఓడిస్తోంది. ఇరు జట్ల బ్యాటింగ్‌లో వ్యత్యాసం అప్రోచ్ మాత్రమే. తొలి బంతినే రిజ్వాన్ బౌండరీ కొట్టడంతో పాక్ మంచి అప్రోచ్‌తో ఆడుతుందని అనుకున్నాను. కానీ భారత స్పిన్నర్లు త్వరగా ఓవర్లు ముగించడంతో పాకిస్థాన్ బ్యాటర్లు తడబడ్డారు. వేగంగా పరుగులు చేయలేకపోయారు. ఇది పాకిస్థాన్‌కు నష్టం చేసింది.

బెంచ్ బలహీనంగా..
పాకిస్థాన్ జట్టు బెంచ్ బలంగా లేకపోవడం నన్ను ఆశ్చర్యానికి గురిచేసింది. పాకిస్థాన్‌లో సహజ నైపుణ్యానికి కొదవలేదు. పాక్ ఆటగాళ్లు సాంకేతికంగా సరికాకున్నా.. వారికి బ్యాట్, బంతిపై మంచి అవగాహన ఉంటుంది. ఇంజమామ్ ఉల్ హక్ ఆటను పరిశీలిస్తే ఈ విషయం అర్థమవుతోంది. అతని స్టాన్స్‌ను అనుసరించాలని యువ బ్యాటర్లకు చెప్పలేం. కానీ అతనికి మంచి టెంపర్‌మెంట్ ఉంది. ఆ తరహా టెంపర్‌మెంట్‌తోనే టెక్నికల్ లోపాలను సరిచేసుకున్నాడు.
ఈ తరహా నైపుణ్యం కలిగిన ఆటగాళ్లను పాకిస్థాన్ తయారు చేసుకోకపోవడం ఆశ్చర్యం కలిగించింది. వారికి పాకిస్థాన్ సూపర్ లీగ్ ఉంది. ఐపీఎల్ ద్వారా భారత్ ఎలాంటి వైట్‌బాల్ ఆటగాళ్లను తయరు చేసిందో మనం చూస్తున్నాం. ఐపీఎల్‌తో పాటు రంజీ క్రికెట్, టీమిండియాకు ప్రాతినిథ్యం వహించారు. ఈ విషయాన్ని పాకిస్థాన్ విశ్లేషించుకోవాలి. ఒకప్పుడు ఉన్న బలమైన బెంచ్ ఇప్పుడు ఎందుకు లేదో అర్థం చేసుకోవాలి.'అని సునీల్ గవాస్కర్ చెప్పుకొచ్చాడు.