మహిళల వన్డే ప్రపంచకప్ 2025లో విజేతగా నిలిచిన భారత ప్లేయర్లను దిగ్గజ క్రికెటర్ సునీల్ గవాస్కర్ హెచ్చరించారు. ఈ గొప్ప విజయాన్ని కొందరు వాడుకుంటారని, అవార్డులు, రివార్డులు ప్రకటిస్తూ ఫ్రీ పబ్లిసిటీ కోసం వాడుకుంటారని చెప్పారు. 1983 ప్రపంచకప్ విజేతలుగా తమకు ఈ అనుభం ఎదురైందని ఓ జాతీయ దినపత్రికకు రాసిన కాలమ్‌లో పేర్కొన్నారు.
తొలి మహిళల వన్డే ప్రపంచకప్ గెలిచిన భారత జట్టుపై సర్వత్రా ప్రశంసల జల్లు కురుస్తోంది. ఇప్పటికే బీసీసీఐ రూ. 51 కోట్ల భారీ క్యాష్ ప్రైజ్ ప్రకటించగా.. ఆయా రాష్ట్రాల ప్రభుత్వాలు ఆటగాళ్లను ఘనంగా సత్కరించడంతో పాటు నగదు ప్రోత్సహకాలను అందజేస్తున్నారు. కొందరికి ఉద్యోగాలు కూడా ఇస్తామని ప్రకటించాయి.
ఆంధ్రప్రదేశ్‌కు చెందిన శ్రీచరణికి రూ. 2.5 కోట్ల భారీ క్యాష్ ప్రైజ్‌తో పాటు 1000 గజాల ఇంటి స్థలం, గ్రూప్-1 ఉద్యోగాన్ని రివార్డ్‌గా చంద్రబాబు సర్కార్ ప్రకటించింది. మహారాష్ట్ర ప్రభుత్వం తమ రాష్ట్రానికి చెందిన స్మృతి మంధాన, జెమీమా రోడ్రిగ్స్, రాధ యాదవ్‌లకు రూ. 2.25 కోట్ల క్యాష్ ప్రైజ్ అందజేసింది. సపోర్ట్ స్టాప్‌కు కూడా నగదు ప్రోత్సాహకాలను అందజేసింది. అయితే ఈ రివార్డుల విషయంలో ఆటగాళ్లంతా జాగ్రత్తగా ఉండాలని సునీల్ గవాస్కర్ సూచించారు. ప్రకటించిన రివార్డ్స్ అందుకోకపోతే బాధపడవద్దని చెప్పారు.

'అమ్మాయిలు కాస్త జాగ్రత్తగా ఉండండి. మీ మంచి కోరే ఈ మాటలు. అందరూ మాట ఇచ్చినట్లుగా మీకు అవార్డులు, రివార్డులు దక్కకపోతే అస్సలు బాధపడొద్దు. మన దేశంలో అడ్వర్టైజర్లు, బ్రాండ్లు, కొంతమంది వ్యక్తులు ఉచిత ప్రచారం కోసం విజేతలను తమ భుజాలపై మోస్తారు. విజేత టీమ్‌కు శుభాకాంక్షలు తెలుపుతూ ఫుల్‌పేజీ యాడ్లు, హోర్డింగ్‌లు పెట్టిస్తారు. టీమ్‌మేనేజ్‌మెంట్, స్పాన్సర్లు తప్పా మిగతా వారంతా ఫ్రీ పబ్లిసిటీ కోసమే ఇదంతా చేస్తారు. వాస్తవానికి వారి వల్ల భారత క్రికెట్‌కు ఒరిగేది ఏం లేదు.
1983 ప్రపంచకప్ గెలిచినప్పుడు కూడా మాకు ఇలానే పెద్ద పెద్ద హామీలు ఇచ్చారు. వాటి గురించి మీడియాలో కూడా వార్తలు వచ్చాయి. కానీ అవేవి కార్యరూపం దాల్చలేదు. అయితే మీడియాను కూడా తప్పుబట్టాల్సిన అవసరం లేదు. ఆటగాళ్లతో పాటు వారు కూడా బాధితులే. విజేతలకు ప్రకటించిన నజరానాల గురించి పెద్ద పెద్ద హోర్డింగ్స్ పెడుతారంతే. అయితే విజేతలతో పాటు మీడియాను కూడా కొంతమంది సిగ్గులేని వాళ్లు ఉపయోగించుకుంటారని వారికి తెలిసి ఉండదు. కాబట్టి.. ఇలాంటి సిగ్గులేని వ్యక్తులతో అమ్మాయిలు జాగ్రత్తగా ఉండండి.
తమ ప్రచారం కోసం మీ పేరును ఉపయోగించుకుంటారు. 1983 విజేతల తరఫున మీకు ఒక విషయం చెబుతాను. భారత క్రికెట్ అభిమానుల ప్రేమే అన్నింటికంటే గొప్ప సంపద. ఈ విషయాన్ని మీరు గ్రహించాలి. మరోసారి విజేతలకు శుభాకాంక్షలు. దేశాన్ని గర్వపడేలా చేశారు. జైహింద్'అని గావస్కర్ తన కథనంలో రాసుకొచ్చాడు.
గుజరాత్‌కు చెందిన ఓ వజ్రాల వ్యాపారి డైమండ్ నెక్లెస్‌లు ఇస్తానని ప్రకటించడం, మరో కార్ల కంపెనీ ఇంకా లాంచ్ చేయని వర్షన్‌ను కానుకగా ఇస్తామని చెప్పారు. ఈ ప్రకటనల నేపథ్యంలోనే అమ్మాయిలను గవాస్కర్ హెచ్చరించాడు. ప్రభుత్వాలు, ఇతర సంస్థలు ప్రకటించిన రివార్డుల్లో చాలా వరకు పేపర్లకే పరిమితం కావచ్చని కూడా తెలియజేశాడు.