
న్యూఢిల్లీ: టీ20 ప్రపంచకప్‌లో పేలవ బ్యాటింగ్, పసలేని బౌలింగ్‌తో వరుస పరాజయాలతో తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్న టీమిండియా మరో ఆసక్తికర పోరుకు సిద్దమైంది. సాంకేతికంగా టీ20 ప్రపంచకప్ సెమీఫైనల్ అవకాశాలు ఇంకా ఉన్నా.. వాస్తవికంగా కోహ్లీసేన దారులు దాదాపుగా మూసుకుపోయాయి. ఈ నేపథ్యంలో టోర్నీలో తొలి విజయం కోసం ఆరాటపడుతున్న కోహ్లీసేన.. ఈ రోజు అఫ్గానిస్థాన్‌ను ఢీకొంటుంది. అద్భుతాలు జరిగి ముందంజ వేయాలన్నా.. మిగిలిన తన మూడు మ్యాచ్‌ల్లోనూ భారత్ గెలవాల్సివుంది.
టీ20 ప్రపంచకప్ నుంచి నిష్క్రమణ అంచుల్లో ఉన్న టీమిండియా.. ఏ మూలో ఉన్న చిన్న ఆశను కాపాడుకోవడానికి సిద్ధమవుతోంది. బుధవారం జరిగే మ్యాచ్‌లో అఫ్గానిస్థాన్‌ను ఢీకొంటుంది. అఫ్గాన్ చిన్న జట్టే కావొచ్చు కానీ.. ఏ జట్టుకైనా షాకిచ్చే సత్తా ఉన్న జట్టే. పేలవ ప్రదర్శనతో తొలి రెండు మ్యాచ్‌ల్లో పాకిస్థాన్, న్యూజిలాండ్ చేతుల్లో పరాజయంపాలైన భారత్.. అన్ని విభాగాల్లోనూ గణనీయంగా మెరుగుపడాల్సివుంది. ఆ కాస్త సెమీస్ ఆశలైనా నిలవాలంటే టీమిండియాకు అఫ్గాన్‌పై భారీ విజయం అవసరం.
అయితే ఈ మ్యాచ్‌కు టీమిండియాకు దిగ్గజ క్రికెటర్ సునీల్ గవాస్కర్ కీలక సలహా ఇచ్చాడు. అవసరమైతే ముగ్గురు స్పిన్నర్లతో బరిలోకి దిగాలని, రవిచంద్రన్ అశ్విన్‌ను మాత్రం కచ్చితంగా ఆడించాలన్నాడు. ప్రస్తుతం స్పెషలిస్ట్ స్పిన్నర్‌గా ఉన్న వరుణ్ చక్రవర్తిని అఫ్గాన్ బ్యాటర్స్ సులువుగా ఎదుర్కొనే అవకాశముంది. అందుకే అతని స్థానంలో రాహుల్ చహర్‌ను జట్టులోకి తీసుకోవడం ఉత్తమమని తెలిపాడు.
'ముగ్గురు స్పిన్నర్లతో బరిలో దిగితే పోయేదేమీ లేదు. ఇద్దరు సీమర్లు, ముగ్గురు స్పిన్నర్లతో టీమిండియా ఆడాలి. హార్దిక్ ఎలాగూ 2 ఓవర్లు వేయగలడు. అందువల్ల మరో ముగ్గురు పేసర్లతో బరిలో దిగడం వల్ల ఉపయోగం ఉండదు. అశ్విన్ లాంటి అత్యుత్తమ స్పిన్నర్‌ను జట్టులోకి తీసుకోవాలి. అతడు లెఫ్టార్మ్ స్పిన్నరా? రైట్ ఆర్మ్ స్పిన్నరా? అన్నది ప్రశ్న కాదు. అతడి గణాంకాలు ఎలా ఉన్నాయో చూడండి.'అని గవాస్కర్ పేర్కొన్నాడు. ఒక పేసర్‌ను తప్పించాలంటే శార్దూల్ ఠాకూర్, మహమ్మద్ షమీలో ఒకరిపై వేటు వేయాలన్నాడు.
అఫ్గానిస్థాన్‌పై టి20 ప్రపంచకప్‌లో రెండు సార్లు తలపడిన భారత్ రెండుసార్లూ గెలుపొందింది. అయితే గత కొన్నేళ్లుగా ఈ ఫార్మాట్‌లో ఆ జట్టు ఎంతో మెరుగు పడింది. ఒక ఓవర్ ఫలితాన్ని మార్చేసే అవకాశం ఉన్న టీ20ల్లో అఫ్గాన్ ఎన్నో సార్లు సంచలనాలకు చేరువగా వచ్చింది. ఈ టోర్నీలో కూడా ఆసిఫ్ అలీ అనూహ్యంగా చెలరేగి ఉండకపోతే పాక్‌పై కూడా అఫ్గాన్ గెలిచేదేమో! కాబట్టి టీమ్‌ను తక్కువగా అంచనా వేయడానికి లేదు. ఒకవైపు వికెట్లు పడినా, మరోవైపు ఆత్మరక్షణలో పడకుండా ధాటిగా ఆడుతూ చకచకా పరుగులు సాధించగల బ్యాట్స్‌మెన్ జట్టులో ఉన్నారు.