ఐపీఎల్ 2025 సీజన్‌లో మిగిలిన మ్యాచ్‌లకు డీజేలు, డ్యాన్సింగ్ గర్ల్స్ వద్దని బీసీసీఐని దిగ్గజ క్రికెటర్ సునీల్ గవాస్కర్ కోరాడు. పాకిస్థాన్‌తో యుద్దం నేపథ్యంలో అసువులు బాసిన జవాన్లు, సాధారణ ప్రజలకు నివాళిగా డీజేలు, డ్యాన్సింగ్ గర్ల్స్‌ను పెట్టవద్దని సూచించారు. ఆపరేషన్ సిందూర్ నేపథ్యంలో భారత్, పాకిస్థాన్ మధ్య నెలకొన్న ఉద్రిక్తతల కారణంగా ఐపీఎల్ 2025 సీజన్ వారం పాటు వాయిదా పడిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఇరుదేశాల మధ్య కాల్పుల విరమణ ఒప్పందం జరగడంతో టోర్నీని ప్రారంభించడంపై బీసీసీఐ ఫోకస్ పెట్టింది.
ఇప్పటికే ఐపీఎల్ 2025 సీజన్ రివైజ్డ్ షెడ్యూల్‌ను ప్రకటించింది. 13 లీగ్ మ్యాచ్‌లతో పాటు 4 ప్లే ఆఫ్స్ మ్యాచ్‌ల వివరాలను వెల్లడించింది. 6 వేదికల్లో లీగ్ మ్యాచ్‌లను పూర్తి చేయనున్నట్లు తెలిపింది. ప్లే ఆఫ్స్ షెడ్యూల్‌ను ఇంకా ఖరారు చేయలేదు. ఐపీఎల్ 2025 సీజన్ పున:ప్రారంభం కావడంపై మాట్లాడిన గవాస్కర్.. కేవలం క్రికెట్‌కు మాత్రమే ప్రాధాన్యత ఇవ్వాలన్నాడు.

'ఐపీఎల్ 2025 సీజన్‌లో ఇప్పటికే 60 మ్యాచ్‌లు పూర్తయ్యాయి. బహుశా మరో 15 లేదా 16 మ్యాచ్‌లు మాత్రమే ఉన్నట్లున్నాయి. కానీ భారత్-పాక్ ఉద్రిక్తతల నేపథ్యంలో కొన్ని కుటుంబాలు తమ ప్రియమైన వారిని కోల్పోయాయి. వారి అకాల మరణానికి నివాళిగా ఐపీఎల్‌లో జరిగే మిగతా మ్యాచ్‌లకు సంగీతం పెట్టవద్దు. ఓవర్ మధ్యలో డీజేల అరుపులు వద్దు. కేవలం మ్యాచ్‌లను మాత్రమే నిర్వహించండి. ప్రేక్షకులను అనుమతించండి. టోర్నీలో మిగిలిన భాగాన్ని ఓ టోర్నీలా మాత్రమే జరుపుకుందాం. డ్యాన్సింగ్ గర్ల్స్ కూడా వద్దు. పాకిస్థాన్‌తో ఉద్రిక్తతల నేపథ్యంలో ప్రాణాలు కోల్పోయిన కుటుంబాల బాధను గౌరవించండి.'అని సునీల్ గవాస్కర్ సూచించాడు.
శనివారం ఆర్‌సీబీ, కోల్‌కతా మధ్య బెంగళూరు వేదికగా జరిగే మ్యాచ్‌తో ఐపీఎల్ 2025 ప్రారంభం కానుంది. బెంగళూరు, జైపూర్, ఢిల్లీ, లక్నో, అహ్మదాబాద్, ముంబై వేదికగా 13 లీగ్ మ్యాచ్‌లు జరగనున్నాయి. ప్లే ఆఫ్స్, ఫైనల్ మ్యాచ్‌ల వేదికలను త్వరలో ప్రకటించనున్నారు. భద్రతా కారణాలతో రద్దయిన పంజాబ్, ఢిల్లీ మ్యాచ్‌ను మళ్లీ నిర్వహించనున్నారు. హైదరాబాద్‌లో జరగాల్సిన రెండు లీగ్ మ్యాచ్‌లను కూడా తరలించారు.