Sunil Gavaskar: ఆ ఇద్దరు తప్పా ఇంగ్లండ్‌లో ఆడేటోడు ఎవడు? కోహ్లీసేనదే సిరీస్!

న్యూఢిల్లీ: ఇంగ్లండ్ గడ్డపై కోహ్లీసేన చరిత్ర సృష్టించడం ఖాయమని భారత దిగ్గజ క్రికెటర్ సునీల్ గవాస్కర్ అన్నాడు. ఇంగ్లండ్‌ను ఐదు టెస్టుల సిరీస్‌లో భారత్ జట్టు 4-0 లేదా 3-1 తేడాతో ఓడిస్తుందని సిరీస్ ప్రారంభానికి ముందే చెప్పిన లిటిల్ మాస్టర్.. ఇప్పటికీ అదే మాటకు కట్టుబడి ఉన్నానని స్పష్టం చేశాడు. ఇంగ్లండ్ జట్టులో జోరూట్, జేమ్స్ అండర్సన్ మినహా ఆడేటోడే లేడని, అందుకే ఇండియాను ఇంగ్లండ్ ఓడించలేదంటున్నానని తెలిపాడు. లార్డ్స్ వేదికగా సోమవారం ముగిసిన రెండో టెస్టులో విరోచిత పోరాటం కనబర్చిన భారత్ 151 పరుగుల తేడాతో ఇంగ్లండ్‌ను చిత్తు చేసిన విషయం తెలిసిందే. ఫలితంగా ఐదు టెస్ట్‌ల సిరీస్‌లో 1-0తో ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. నాటింగ్‌హామ్ వేదికగా జరిగిన ఫస్ట్ టెస్టు మ్యాచ్ చివరి రోజు వర్షం కారణంగా డ్రాగా ముగియగా.. మూడో టెస్టు లీడ్స్ వేదికగా ఈ నెల 25 నుంచి ప్రారంభంకానుంది.

ఇద్దరు ఆటగాళ్ల టీమ్..
లార్డ్స్ టెస్టులో భారత్ విజయంపై స్పందించిన సునీల్ గవాస్కర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.'ఇంగ్లండ్ ఇప్పుడు ఇద్దరు ఆటగాళ్ల టీమ్. బ్యాటింగ్‌లో జో రూట్, బౌలింగ్‌లో అండర్సన్ మాత్రమే నిలకడగా రాణిస్తున్నారు. మిగతావాళ్లు జస్ట్ ఆడుతున్నారా? అంటే ఆడుతున్నారు. ఇది సరైన టెస్టు జట్టుగా నాకు కనిపించడం లేదు. ఇంగ్లండ్ ఓపెనర్ల బ్యాటింగ్ టెక్నిక్ మరీ దారుణం. ఇక మూడో స్థానంలో ఆడే హసీబ్ హమీద్ ఇంకా ఆందోళనకు గురవుతూనే ఉన్నాడు. జో రూట్ ఆడితే ఆడినట్టు... లేకపోతే అంతే సంగతులన్నట్లుగా మారింది ఆ జట్టు పరిస్థితి. జోస్ బట్లర్ వన్డే, టీ20 ప్లేయర్. అతను టెస్టు ప్లేయర్ అని కచ్చితంగా చెప్పలేని పరిస్థితి'అని గవాస్కర్ చెప్పుకొచ్చాడు.

భారత్‌దే సిరీస్..
టెస్ట్ స్పెషలిస్ట్ స్టువర్ట్ బ్రాడ్ గాయంతో సిరీస్ నుంచి తప్పుకోగా.. ఆల్‌రౌండర్ బెన్ స్టోక్స్ మానసిక సమస్యలతో విశ్రాంతి తీసుకున్నాడు. దాంతో ఇంగ్లండ్ టీమ్ బలహీనమైంది. ఈ క్రమంలోనే సిరీస్ విజేతను అంచనా వేసిన గవాస్కర్.. ఇంగ్లండ్ గడ్డపై కోహ్లీసేన చరిత్ర సృష్టిస్తుందన్నాడు. 'సిరీస్‌లో మిగిలిన మూడు టెస్టుల్లోనూ భారత్ విజయం సాధిస్తుంది. నేను సిరీస్ ఆరంభానికి ముందే చెప్పా.. టీమిండియా 4-0 లేదా 3-1తో సిరీస్ గెలుస్తుందని. ఇప్పటికీ అదే మాటకి కట్టబడి ఉన్నా. వర్షం వచ్చి మ్యాచ్‌లకు అంతరాయం కలగకపోతే.. నా అంచనా కచ్చితంగా నిజం అవుతుంది'అని గవాస్కర్ ధీమా వ్యక్తం చేశాడు.

సచిన్ సైతం..
భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ సైతం గవాస్కర్ తరహా వ్యాఖ్యలనే చేశాడు. 'ప్రస్తుత ఇంగ్లండ్ జట్టుకు ఒక్కసారిగా కుప్పకూలే చరిత్ర ఉంది. అక్కడే వాళ్లు వెనుకబడ్డారు. ఈ జట్టులో ఎంత మంది బ్యాట్స్‌మెన్ శతకాలు సాధిస్తారని కచ్చితంగా చెప్పగలరు? నేనైతే జోరూట్ మినహా ఎవరినీ ఎంపికచేయలేను. ఇదివరకున్న జట్లలో అలిస్టర్ కుక్, మైఖేల్ వాన్, కెవిన్ పీటర్సన్, ఇయాన్ బెల్, జోనాథన్ ట్రాట్, ఆండ్రూ స్ట్రాస్ లాంటి ఆటగాళ్లు బాగా ఆడేవాళ్లు. ఇప్పుడున్న జట్టులో ఎప్పుడో ఒకసారి శతకాలు బాదినా నిలకడగా రాణించే ఆటగాళ్లు ఎవరున్నారు? అలా ఆడేవారిలో రూట్ మినహా ఎవరూ కనిపించరు. ఇప్పుడా జట్టు పరిస్థితి ఇలా ఉంది. ఇక ఈ మ్యాచ్‌లో రూట్ తొలుత బౌలింగ్ ఎంచుకోడానికి ఇది కూడా ఒక కారణం అయ్యుండొచ్చు.'అని పీటీఐకి ఇచ్చిన ఇంటర్వ్యూలో సచిన్ తెలిపాడు.

అసాధారణ విజయం..
181/6 ఓవర్ నైట్ స్కోర్‌తో చివరి రోజు ఆటను కొనసాగించిన భారత్.. రెండో ఇన్నింగ్స్‌లో 298/8 వద్ద డిక్లేర్ చేసింది. మహమ్మద్ షమీ(70 బంతుల్లో 6 ఫోర్లు, సిక్స్‌తో 56 నాటౌట్), జస్‌ప్రీత్ బుమ్రా(53 బంతుల్లో 2 ఫోర్లతో 36 నాటౌట్) అసాధారణ బ్యాటింగ్‌తో 9వ వికెట్‌కు అజేయంగా 89 పరుగులు జోడించారు. దాంతో భారత్‌కు 271 పరుగుల భారీ ఆధిక్యం లభించింది.
అనంతరం 272 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లండ్ 51.5 ఓవర్లలో 120 పరుగులకు ఆలౌటైంది. జోస్ బట్లర్(96 బంతుల్లో 25), జోరూట్(60 బంతుల్లో 33) పోరాడినా ఫలితం లేకపోయింది.
భారత బౌలర్లలో మహమ్మద్ సిరాజ్(4/32) నాలుగు వికెట్లతో చెలరేగగా.. జస్‌ప్రీత్ బుమ్రా(3/33) మూడు, ఇషాంత్ శర్మ(2/13) రెండు వికెట్లు తీశారు. మహమ్మద్ షమీ(1/13)కి ఒక వికెట్ దక్కింది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications