టీమిండియా యువ బ్యాటర్ సర్ఫరాజ్ ఖాన్‌పై సునీల్ గవాస్కర్ ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఇంగ్లండ్‌తో ధర్మశాల వేదికగా జరుగుతున్న ఐదో టెస్ట్‌లో సర్ఫరాజ్ ఖాన్ ఔటైన తీరును తప్పుబడుతూ అతన్ని మందలించాడు. ఈ ఎక్స్‌ట్రాలే వద్దని, ఆల్‌టైమ్ గ్రేటెస్ట్ బ్యాట్స్‌మన్ సర్ బ్రాడ్‌మన్ చెప్పిన మాటలను గుర్తు చేశాడు.
ఈ మ్యాచ్‌కు కామెంటేటర్‌గా వ్యవహరిస్తున్న సునీల్ గవాస్కర్.. చెత్త షాట్‌తో సర్ఫరాజ్ ఖాన్ ఔటైన తీరును విమర్శిస్తూ ఘాటుగా స్పందించాడు. ఈ మ్యాచ్‌లో సర్ఫరాజ్ ఖాన్ దూకుడైన బ్యాటింగ్‌తో 60 బంతుల్లో 56 పరుగులు చేశాడు. 8 ఫోర్లు, సిక్స్‌తో విధ్వంసం సృష్టించాడు. ఆరంభంలో కాస్త నిదానంగా ఆడిన అతను మార్క్ వుడ్ స్లెడ్జింగ్‌తో చెలరేగిపోయాడు.

బ్యాట్‌తోనే అతనికి తనదైన శైలిలో బదులిచ్చాడు. ఇక 148 కిలోమీటర్ల వేగంతో అతను విసిరిన ఓ బౌన్సర్‌ను అదిరిపోయే అప్పర్ కట్ షాట్‌తో బౌండరీ బాదాడు. ఈ షాట్ మ్యాచ్‌కే హైలైట్‌గా నిలిచింది. చాలా స్వేచ్చగా బ్యాటింగ్ చేసిన సర్ఫరాజ్ సెంచరీ చేసేలా కనిపించాడు. కానీ టీ బ్రేక్ అనంతరం తొలి బంతికే చెత్త షాట్ ఆడి క్యాచ్ ఔట్‌గా వెనుదిరిగాడు.
షోయబ్ బషీర్ బౌలింగ్‌లో లేట్ కట్ ఆడబోయి మూల్యం చెల్లించుకున్నాడు. గ్యాప్ రాబట్టలేక జోరూట్‌కు చిక్కాడు. అయితే బషీర్ వేసిన ఆ బంతిని షాట్ ఆడాల్సింది కాదని గవాస్కర్ అభిప్రాయపడ్డాడు.
'ఆ బంతి పిచ్ అయ్యింది. పైగా షాట్ ఆడాల్సిన ఎత్తులో కూడా రాలేదు. కానీ సర్ఫరాజ్ షాట్ ఆడి మూల్యం చెల్లించుకున్నాడు. టీ బ్రేక్ అనంతరం తొలి బంతినే షాట్ ఆడాల్సిన అవసరం ఏం ఉంది? కాస్త టైమ్ తీసుకుని ఆడితే ఏమైనా నష్టం జరిగేదా..? సర్ఫరాజ్ ఖాన్ ఔటైన తీరు చూశాక నాకు బ్రాడ్‌మన్ చెప్పిన మాటలు గుర్తుకొస్తున్నాయి.
'200 పరుగులు చేసిన తర్వాత కూడా నేను ఎదుర్కొనే ప్రతీ బంతిని సున్నా స్కోర్‌తోనే ఆడుతున్నట్లు భావిస్తాను.'అని చెప్పాడు. కానీ సర్ఫరాజ్ ఖాన్ మాత్రం చివరి సెషన్ ఫస్ట్ బంతినే షాట్ ఆడాడు.'అని గవాస్కర్ ఆగ్రహం వ్యక్తం చేశాడు. పరోక్షంగా ఎక్స్‌ట్రాలు తగ్గించుకొని ఓపికగా బ్యాటింగ్ చేయాలని చురకలంటించాడు.