కోట్లు పెట్టి డమ్మీ ఆటగాళ్లను కొంటున్నారు: సునీల్ గవాస్కర్
ఐపీఎల్‌లో కొన్ని ఫ్రాంచైజీలు కోట్ల రూపాయాలు పెట్టి డమ్మీ ఆటగాళ్లను కొనుగోలు చేస్తున్నాయని భారత క్రికెట్ దిగ్గజం సునీల్ గవాస్కర్ విమర్శించాడు. ఆటగాళ్ల సామర్థ్యాలను పూర్తిగా పరిశీలంచుకుండానే.. రాష్ట్ర స్థాయి, నగర స్థాయి టోర్నీల్లో భారీ షాట్స్ ఆడుతున్న ఆటగాళ్ల కోసం ఫ్రాంచైజీలు ఎగబడుతున్నాయని అసహనం వ్యక్తం చేశాడు.
ఇలాంటి వన్ మ్యాచ్ వండర్స్ చాలా మంది ఉన్నారని, ఐపీఎల్‌లో వరుసగా అవకాశాలు అందుకుంటున్నారని లిటిల్ మాస్టర్ పేర్కొన్నాడు. ఐపీఎల్ 2026 సీజన్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(ఆర్‌సీబీ) విజేతగా నిలిచిన సంగతి తెలిసిందే. అయితే ఈ సీజన్‌లో ఫ్రాంచైజీలు ఎక్కువగా డమ్మీ ఆటగాళ్లను కొనుగోలు చేశాయని గవాస్కర్ ఓ స్పోర్ట్స్ వెబ్‌సైట్‌కు రాసిన కాలమ్‌లో పేర్కొన్నాడు. ప్రతిభావంతులకు బదులు.. వన్ మ్యాచ్ వండర్స్‌ను ఎంపిక చేస్తున్నారని ఫ్రాంచైజీల స్కౌట్స్‌పై విమర్శలు గుప్పించాడు.
గల్లీ స్థాయి ఆటగాళ్లకు కోట్లు..
'భారత క్రికెట్‌కు ఎంతోమంది ప్రతిభావంతులను ఐపీఎల్ అందించింది. రవిచంద్రన్ అశ్విన్, జస్‌ప్రీత్ బుమ్రా, హార్దిక్ పాండ్యా, రింకు సింగ్, వైభవ్ సూర్యవంశీ వంటి పలువురు ఆటగాళ్లు ఐపీఎల్ ద్వారానే వెలుగులోకి వచ్చారు. ఇదే సమయంలో కొంతమంది ఆటగాళ్లు మాత్రం వేలంలో రికార్డ్ ధర పలికి.. మైదానంలో అంచనాలను అందుకోలేకపోతున్నారు.

రాష్ట్ర, టౌన్ స్థాయి లీగ్‌ల్లో భారీ షాట్లు ఆడి ఐపీఎల్‌లో అవకాశాలు అందుకునే ఆటగాళ్లు.. ఇక్కడ అంతర్జాతీయ స్థాయి బౌలర్లను ఎదుర్కోలేకపోతున్నారు. ఆ లీగ్‌ల్లో బ్యాటింగ్, బౌలింగ్ ప్రమాణాలు ఐపీఎల్‌తో పోల్చితే చాలా తక్కువగా ఉంటాయి. కానీ అలాంటి ప్లేయర్ల కోసం ఫ్రాంచైజీలు ఎగబడి డబ్బులను వృథా చేసుకుంటున్నాయి.
ఆటగాళ్ల సత్తాకు ఐపీఎల్ పరీక్ష..
ఒక ఫ్రాంచైజీ అయితే కోట్ల రూపాయలు పెట్టి కొనుగోలు చేసిన ఆటగాడిని కేవలం రెండు మ్యాచ్‌లకే పరిమితం చేసింది. ఇలా చేయడంలో అర్థం లేదు. అలా చేస్తే ఆ ఆటగాడు డమ్మీ అన్నట్లే. ఐపీఎల్ చాలా త్వరగా ఆటగాడి అసలు సామర్థ్యాన్ని బయటపెడుతుంది. అది ఐపీఎల్ ప్రత్యేకత. ఆటగాడిపై అతిగా అంచనాలు పెట్టుకున్నారా? లేక అతనికి నిజంగానే భారీ ఇన్నింగ్స్ ఆడే సామర్థ్యం ఉందా? అనేది వెంటనే తెలిసిపోతుంది.
ఒక సీజన్‌లో పెద్దగా ప్రాధాన్యం లేని మ్యాచ్‌లో ఒక్కసారి సత్తా చాటినా.. అదే ప్రదర్శన ఆధారంగా వచ్చే ఏడాది మళ్లీ జట్టులో చోటు దక్కించుకునే ఆటగాళ్లు చాలామంది ఉన్నారు. అలాంటి 'వన్-మ్యాచ్ హీరో'లతో కనీసం నాలుగు జట్లు ఏర్పాటు చేయవచ్చు. అయినప్పటికీ వారు మళ్లీ మళ్లీ ఐపీఎల్‌లో వరుస అవకాశాలు అందుకుంటూనే ఉంటారు' అని గవాస్కర్ తన కాలమ్‌లో పేర్కొన్నాడు. ప్రస్తుతం గవాస్కర్ వ్యాఖ్యలు తీవ్ర చర్చనీయాంశమయ్యాయి. లక్నో సూపర్ జెయింట్స్, చెన్నై సూపర్ కింగ్స్‌ను ఉద్దేశించే గవాస్కర్ ఈ వ్యాఖ్యలు చేశాడని నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications