10 శాతం కమీషన్ దొబ్బుతూనే ఐపీఎల్‌పై విమర్శలా?: సునీల్ గవాస్కర్ ఫైర్!
ఐపీఎల్ (IPL) టోర్నీపై విమర్శలు గుప్పిస్తున్న విదేశీ మాజీ క్రికెటర్లు, క్రికెట్ బోర్డులపై భారత క్రికెట్ దిగ్గజం సునీల్ గవాస్కర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. బీసీసీఐ నుంచి 10 శాతం కమీషన్ దొబ్బుతూనే టోర్నీపై అనవసర ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. కేవలం తమ ప్రయోజనాల కోసం భారత క్రికెట్‌ను తక్కువ చేసి మాట్లాడటం సరికాదని ఆయన హితవు పలికారు.
ఐపీఎల్ 2026 సీజన్‌లో పూర్తి స్థాయిలో ఆడిన ఇంగ్లండ్ పేసర్ జోఫ్రా ఆర్చర్.. న్యూజిలాండ్‌తో తొలి టెస్ట్‌కు దూరంగా ఉన్నాడు. అంతర్జాతీయ టెస్ట్ క్రికెట్ కంటే ఐపీఎల్ వంటి లీగ్‌లకు ప్రాధాన్యత ఇస్తున్నారంటూ పలువురు మాజీ క్రికెటర్లు ఆర్చర్‌పై విమర్శలు గుప్పించారు. ఐపీఎల్ టోర్నీని తప్పుబట్టారు.
మైఖేల్ వాన్ వ్యాఖ్యలతో..
ఫ్రాంచైజీ లీగ్స్‌తో అంతర్జాతీయ క్రికెట్‌కు ముప్పు పొంచి ఉందని ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ మైఖేల్ వాన్ అన్నాడు. 'టీ20 లీగ్‌లు ఆటగాళ్లకు మంచివే. కానీ అంతర్జాతీయ టెస్టు క్రికెట్ కంటే వీటికే ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడం భవిష్యత్తులో పెద్ద సమస్యగా మారుతుంది’అని పేర్కొన్నాడు.
న్యూజిలాండ్ మాజీ ప్లేయర్ సైమన్ డౌల్ సైతం ఆర్చర్ తీరును తప్పుబట్టాడు. డబ్బుల కోసం దేశం తరఫున జరిగే మ్యాచ్‌కు అందుబాటులో లేకపోవడం సరికాదని విమర్శించాడు. గతంలో ట్రెంట్ బౌల్ట్ వంటి ఆటగాళ్లు ఐపీఎల్ సమయాల్లోనూ టెస్ట్‌ల కోసం సిద్దమయ్యేవారని గుర్తు చేశాడు.

డబ్బులు దొబ్బుతూనే..
ఈ మాజీ ఆటగాళ్ల విమర్శలను సునీల్ గవాస్కర్ ఖండించారు. ఐపీఎల్, భారత క్రికెట్‌ను విమర్శించడం కొందరు విదేశీ ఆటగాళ్లకు అలవాటుగా మారిందని ఆయన వ్యాఖ్యానించారు. ఐపీఎల్‌లో ఆడే విదేశీ ఆటగాళ్లకు ఇచ్చే వేతనంలో 10 శాతం వాటాను బీసీసీఐ నేరుగా ఆయా దేశాల క్రికెట్ బోర్డులకు చెల్లిస్తోందని ఆయన గుర్తు చేశారు.
ఇంగ్లండ్, ఆస్ట్రేలియా లీగ్‌లు ఇలాంటి పద్ధతిని పాటించడం లేదని ఆయన ఎత్తిచూపారు. మిలియన్ల పౌండ్లను బీసీసీఐ నుంచి పొందుతున్న బోర్డులే..ఇప్పుడు ఐపీఎల్‌ను తక్కువ చేసి మాట్లాడటం వారి ద్వంద ప్రమాణాలకు నిదర్శనమని గవాస్కర్ మండిపడ్డారు.
వాస్తవాలను గుర్తించి మాట్లాడాలి..
'భారత క్రికెట్, ఇక్కడి అభిమానుల సొమ్ముతో విదేశీ బోర్డులు తమ ఖజానాను నింపుకుంటున్నాయి. ఆ విషయాన్ని మరిచిపోయి ఐపీఎల్‌ను ద్వేషించడం విడ్డూరంగా ఉంది. భారత క్రికెట్‌ను ఎంతగా తక్కువ చేసి చూపే ప్రయత్నం చేసినా..ప్రపంచ క్రికెట్‌లో టీమిండియా ఆధిపత్యం కొనసాగుతూనే ఉంటుంది. ఇప్పటికైనా విమర్శకులు వాస్తవాలను గుర్తించాలి.’అని గవాస్కర్ చురకలంటించారు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications